Connect with us

Investments

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ప్రవాసాంధ్రులను భాగస్వామ్యం చేసేలా పెట్టుబడుల సదస్సు @ Atlanta, Georgia

Published

on

Atlanta, Georgia: ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు, వ్యాపార విస్తరణ, సాంకేతిక అభివృద్ధి, రాష్ట్ర ప్రగతిలో ప్రవాసాంధ్రుల భాగస్వామ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో నిర్వహించిన Andhra Pradesh Investors Summit – Atlanta 2026 విజయవంతమైంది.

అట్లాంటా (Atlanta, Georgia) లోని తెలుగు సమాజం, వ్యాపారవేత్తలు, ఐటీ నిపుణులు, పెట్టుబడిదారులు, కమ్యూనిటీ నాయకుల నుంచి ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. సాయంత్రం 7 గంటలకు ప్రారంభమైన ఈ సదస్సు రాత్రి 10 గంటల వరకు కొనసాగగా, 250 మందికి పైగా పాల్గొన్నారు.

భారత్–అమెరికా సంబంధాల్లో భారతీయుల పాత్ర కీలకం

ఈ కార్యక్రమంలో జార్జియా రాష్ట్ర సెనేటర్ షాన్ స్టిల్ (Hon. Shawn Still), రాష్ట్ర ప్రతినిధులు టాడ్ జోన్స్ (Hon. Todd Jones), కార్టర్ బారెట్ (Hon. Carter Barrett) పాల్గొని ప్రసంగించారు. భారత్–అమెరికా సంబంధాలు, జార్జియా రాష్ట్ర అభివృద్ధిలో భారతీయ అమెరికన్ల ఆర్థిక, వృత్తిపరమైన, సామాజిక సేవలను వారు ప్రత్యేకంగా ప్రస్తావించారు.

అమెరికా అవకాశాల గడ్డ అని పేర్కొంటూ, ఆ అవకాశాలను అందిపుచ్చుకుని ఎదిగిన భారతీయ సమాజం వ్యాపారం, సాంకేతికత, విద్య, ఆర్థిక వ్యవస్థ, కమ్యూనిటీ అభివృద్ధి వంటి రంగాల్లో కీలక పాత్ర పోషిస్తోందని అభినందించారు. భారత్ (India), జార్జియా మధ్య భవిష్యత్తులో వ్యాపార, పెట్టుబడి, సాంకేతిక భాగస్వామ్యాలను మరింత బలోపేతం చేసుకునేందుకు విస్తృత అవకాశాలు ఉన్నాయని వారు అభిప్రాయపడ్డారు.

‘నేను సైతం’.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ప్రవాసాంధ్రుల భాగస్వామ్యం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర అమెరికా ప్రత్యేక ప్రతినిధి శ్రీనివాస్ మిరియాల (Srinivas Miriyala) తన ‘నేను సైతం’ (Nenu Saitham) ప్రెజెంటేషన్ ద్వారా ప్రవాసాంధ్రులు రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాల్సిన ఆవశ్యకతను వివరించారు.ప్రవాసాంధ్రుల వద్ద ఉన్న నెట్‌వర్క్‌లు, వనరులు, ఆలోచనలను ఆంధ్రప్రదేశ్ అభివృద్ధితో అనుసంధానించడం ద్వారా రాష్ట్రానికి గణనీయమైన ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. ఈ దిశగా BUILD, INVEST, GIVE BACK అనే మూడు ప్రధాన మార్గాలను వివరించారు.

BUILD: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త వ్యాపారాలను ప్రారంభించడం, ఇప్పటికే ఉన్న సంస్థలను విస్తరించడం ద్వారా ఉపాధి అవకాశాలు, ఆర్థికాభివృద్ధికి తోడ్పడాలని సూచించారు.
INVEST: రాష్ట్రంలో అభివృద్ధి చెందుతున్న రంగాల్లో పెట్టుబడి అవకాశాలను పరిశీలించి, స్థానిక వ్యాపారాలు, పరిశ్రమల వృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
GIVE BACK: స్వగ్రామం, సొంత జిల్లా, రాష్ట్ర అభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని కోరారు.

టెక్నాలజీ నుంచి వ్యవసాయం వరకు.. విస్తృత పెట్టుబడి అవకాశాలు

ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (GCCs), డేటా సెంటర్లు, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, ఆటోమొబైల్, ఎలక్ట్రిక్ వాహనాల విడిభాగాలు, పోర్టులు, లాజిస్టిక్స్, క్వాంటమ్ టెక్నాలజీ, డీప్‌టెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ఆక్వాకల్చర్, ఫార్మాస్యూటికల్స్ (Pharmaceuticals), పర్యాటక రంగాల్లో ఉన్న అవకాశాలను శ్రీనివాస్ మిరియాల వివరించారు.

అదేవిధంగా మోడల్ ఫార్మ్స్, కిరణం సోలార్ కార్యక్రమాలు, యువతకు మెంటరింగ్, పాఠశాలల అభివృద్ధి, కంప్యూటర్ మరియు రోబోటిక్స్ ల్యాబ్‌లు, స్కాలర్‌షిప్‌లు, ఆరోగ్య సేవలు, స్వచ్ఛమైన తాగునీటి సదుపాయాలు వంటి కార్యక్రమాల ద్వారా ప్రవాసాంధ్రులు (NRIs) తమ స్వగ్రామాలకు సేవలందించవచ్చని వివరించారు.

పెట్టుబడిదారుల ప్రశ్నలు.. ఆసక్తికర చర్చలు

ప్రెజెంటేషన్ అనంతరం నిర్వహించిన ఓపెన్-ఫ్లోర్ ఇన్వెస్టర్ ప్రశ్నోత్తర కార్యక్రమం సదస్సుకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు ఎలా పెట్టాలి? ఏ రంగాల్లో ఎక్కువ అవకాశాలు ఉన్నాయి? ఎన్‌ఆర్‌ఐలు, ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా (OCI) లకు అందుబాటులో ఉన్న మార్గాలేమిటి? తయారీ, సాంకేతికత, వ్యవసాయం, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల్లో ఎలా భాగస్వాములు కావచ్చు? వంటి అంశాలపై పాల్గొన్నవారు ప్రశ్నలు అడిగి, శ్రీనివాస్ మిరియాల (Srinivas Miriyala) తో చర్చించారు.

సదస్సుకు హాజరైనవారు ప్రసంగాలను శ్రద్ధగా వినడంతో పాటు, పెట్టుబడి అవకాశాలపై ఆసక్తి చూపుతూ చర్చల్లో చురుకుగా పాల్గొనడం విశేషం. ఈ కార్యక్రమం కేవలం సమాచారాన్ని అందించే వేదికగా కాకుండా, ఆంధ్రప్రదేశ్‌తో (Andhra Pradesh) ప్రవాసాంధ్రుల అనుబంధాన్ని మరింత బలోపేతం చేసే చర్చలకు, భవిష్యత్తు భాగస్వామ్యాలకు నాంది పలికింది.

స్పాన్సర్లకు, నిర్వాహకులకు ప్రత్యేక కృతజ్ఞతలు

ఈ సదస్సు విజయవంతం కావడానికి సహకరించిన స్పాన్సర్లు, నిర్వాహకులకు APNRT North America – South East Chapter ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. వేదికను అందించిన Reflections, ప్రత్యేక సహకారం అందించిన ఉదయ్ భాస్కర్ కొట్టే, రవి ఎలిశెట్టి, నరేష్ శ్రీరామ లకు నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు.

ఈవెంట్ స్పాన్సర్లుగా మహారాణ యడవల్లి, సురేష్ కరొతు (Suresh Karothu), సురేష్ ధూళిపూడి, రాజు మందపాటి (Raju Mandapati) సహకరించారు. ఆతిథ్య భోజన ఏర్పాట్లలో పిస్తా హౌస్, సంక్రాంతి, మన విందు సంస్థలతో పాటు సాగర్ లగిసెట్టి (Sagar Lagisetti) తమ వంతు సహకారం అందించారు.

ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు సురేష్ కరొతు, మహారాణ యడవల్లి, రాజు మందపాటి, వెంకట్ గోక్యాడ (Venkat Gokyada), సురేష్ ధూళిపూడి, మధు, హరి తోలేటి, శివ పూల, శ్రీనివాస్ పసుపులేటి, కోదండరావు కోలా కీలక పాత్ర పోషించారు. ప్రణాళిక, అతిథుల సమన్వయం, పెట్టుబడిదారులకు ఆహ్వానాలు, ఆతిథ్యం, వేదిక ఏర్పాట్లు, ఇతర నిర్వహణ బాధ్యతలను సమన్వయంతో చేపట్టారు.

‘బిల్డ్.. ఇన్వెస్ట్.. గివ్ బ్యాక్’.. ఆంధ్రప్రదేశ్ ప్రగతికి ప్రవాసాంధ్రుల పిలుపు

250 మందికి పైగా ఒకచోట చేరడం మాత్రమే కాకుండా, మూడు గంటల పాటు ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) పెట్టుబడులు, వ్యాపార అవకాశాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ఆసక్తిగా చర్చించడం ఈ సదస్సు సాధించిన ముఖ్య విజయంగా నిర్వాహకులు పేర్కొన్నారు. “Build. Invest. Give Back. Connect. Collaborate. Create Opportunities.” అనే సందేశంతో, ప్రవాసాంధ్రులు తమ అనుభవం, నైపుణ్యం, పెట్టుబడులు, పరిచయాలను రాష్ట్ర అభివృద్ధికి అనుసంధానించాలని పిలుపునిచ్చారు.

మన ఊరి కోసం ఒక అడుగు.. మన ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కోసం మరో అడుగు అనే స్ఫూర్తితో నిర్వహించిన ఈ సదస్సు, ప్రవాసాంధ్రులు మరియు ఆంధ్రప్రదేశ్ మధ్య కొత్త వ్యాపార సంబంధాలకు, పెట్టుబడులకు, సామాజిక భాగస్వామ్యాలకు మార్గం సుగమం చేస్తుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.

error: NRI2NRI.COM copyright content is protected