ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి శ్రీ వీర పాండియన్ గారి నేతృత్వంలో రాష్ట్ర ప్రతినిధి బృందం చేపట్టిన ఐదు రోజుల యునైటెడ్ కింగ్డమ్ (United Kingdom) పర్యటన విజయవంతంగా ముగిసింది. పర్యటనలో భాగంగా యూకేలోని పలు ప్రాంతాల్లో ప్రముఖ వైద్య, ఆరోగ్య, విద్యా సంస్థల ప్రతినిధులతో బృందం సమావేశమైంది.
వైద్య, ఆరోగ్య రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలో అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) గారి దార్శనికతకు అనుగుణంగా ఈ పర్యటన సాగింది.
రాష్ట్రంలో వైద్య సేవలను మెరుగుపరిచేందుకు ఆధునిక సాంకేతిక (Technology) పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం, వైద్య విద్య, పరిశోధనలో పరస్పర సహకారాన్ని పెంపొందించడం, ఆరోగ్య రంగంలో పెట్టుబడి అవకాశాలను పరిశీలించడం వంటి అంశాలపై సమావేశాల్లో చర్చించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యూరప్ ప్రత్యేక ప్రతినిధి శ్రీ గుంటుపల్లి జయకుమార్ గారు ఈ పర్యటనను సమన్వయం చేశారు. యూనివర్సిటీ కాలేజ్ లండన్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, క్వీన్ ఎలిజబెత్ హాస్పిటల్, ఎన్హెచ్ఎస్ యూకే, గేట్స్ ఫౌండేషన్, ఇంపీరియల్ కాలేజ్ లండన్, హెల్త్ గ్లోబల్, యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్‌హామ్, బీఐటీ, ఏఐ హెల్త్, నైస్, ఆర్ఏఐ యూకే, టీసీఎస్ యూకే, బాపియో సంస్థల ప్రతినిధులతో (Representatives) బృందం సంప్రదింపులు జరిపింది.
బ్రిటిష్ పార్లమెంట్ (Parliament) ప్రాంగణంలో జరిగిన సమావేశంలో ప్రవాస తెలుగు వైద్య నిపుణులతో పాటు పలు సంస్థల ప్రతినిధులను బృందం కలిసింది. పర్యటన సందర్భంగా జరిగిన సమావేశాల్లో పాల్గొన్న పెట్టుబడిదారులు, వైద్య నిపుణులు, విద్యా సంస్థల ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్య రంగ పెట్టుబడి అవకాశాలను పరిశీలించేందుకు, రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ఆసక్తి వ్యక్తం చేశారు.
ఐదు రోజుల పర్యటన విజయవంతంగా ముగియడం పట్ల శ్రీ వీర పాండియన్ గారు సంతోషం వ్యక్తం చేశారు. సమావేశాల్లో పాల్గొన్న సంస్థల ప్రతినిధులకు, ఏపీఎన్ఆర్టీ సభ్యులకు, పర్యటన విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు (Thanks) తెలిపారు.