Dallas, Texas: అమెరికా పర్యటనలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ (SBI Chairman) శ్రీనివాసులు శెట్టి అమెరికా దేశంలోనే అతి పెద్దదైన, డాలస్ పరిసర ప్రాంతంలో అర్వింగ్ నగరంలో నెలకొనియున్న మహాత్మాగాంధీ స్మారకస్థలిని శుక్రవారం సందర్శించి మహాత్మాగాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు.
18 ఎకరాల సువిశాలమైన పార్క్ లో ప్రశాంత వాతావరణంలో ఏర్పాటుచేసిన ఈ విగ్రహం చూడ ముచ్చటగా ఉందన్నారు. విదేశాలలో ఇంత భారీ విగ్రహ నిర్మాణం సాకారం కావడానికి కృషిచేసిన మహాత్మాగాంధీ మెమోరియల్ వ్యవస్థాపక ఛైర్మన్ డా. ప్రసాద్ తోటకూర (Dr. Prasad Thotakura), కార్యవర్గ సభ్యుల కృషిని, ఇందులో భాగస్వాములు అయిన వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
వ్యవస్థాపక కార్యదర్శి రావు కల్వల, ఇండియా అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సస్ (Indian Association of North Texas) అధ్యక్షుడు మహేంద్ర రావు, డా. ప్రసాద్ తోటకూర లు ఛైర్మన్ శ్రీనివాసులు శెట్టికి ఆవరణ అంతా చూపించి, 12 వసంతాలు పూర్తి చేసుకున్న ఈ స్మారకస్థలి కేవలం ప్రవాస భారతీయులకే గాక అమెరికన్లకు సైతం ఒక ముఖ్య యాత్రాస్థలం అయిందని వివరించారు.
డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “ఫ్రిస్కో నగరంలో ఇటీవలే SBIC Branch ను ప్రారంభించడం సంతోషకరం అన్నారు. ఎన్నో వ్యాపకాలతో తీరికలేని పనులలో ఉండి కూడా మహాత్మాగాంధీ మెమోరియల్ (Mahatma Gandhi Memorial) ను సందర్శించడానికి విచ్చేసిన ఛైర్మన్ శెట్టి కి ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు.
బ్యాంకింగ్ రంగంలో 38 సంవత్సరాలకు పైగా అనుభవం గడించిన శ్రీనువాసులు శెట్టి (Srinivasulu Setty) ని భారత ప్రభుత్వం 2024 ఆగస్టులో State Bank of India (SBI) 27వ ఛైర్మన్గా నియమించింది. ఈ పదవిలో ఈయన 2027 ఆగస్టు వరకు కొనసాగుతారు.
తెలంగాణ (Telangana), జోగులాంబ గద్వాల జిల్లాలోని ‘పెద్దపోతులపాడు’ గ్రామంలో జన్మించిన శ్రీనివాసులు శెట్టి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక విద్యను అభ్యసించి, ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి వ్యవసాయ శాస్త్రంలో బి.ఎస్సీ పట్టా పొందారు.
సాధారణ బ్యాంకు అధికారిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి, దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియాకు ఛైర్మన్ స్థాయికి ఎదగడం ఎంతోమందికి స్పూర్తిదాయకం (Inspirational) అన్నారు.