Connect with us

Literary

Dallas, Texas: కొసరాజు సాహిత్య వైభవం.. ఘనంగా సర్వలభ్య రచనల ఆవిష్కరణ, హోరెత్తిన సంగీత విభావరి

Published

on

Dallas, Texas: తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో మనసు ఫౌండేషన్ సహకారంతో కవిరత్న, జానపద కవిసార్వభౌమ కొసరాజు రాఘవయ్య చౌదరి సర్వలభ్య రచనలను ముద్రించి గత సంవత్సరం గుంటూరు (Guntur) లో కొసరాజు కుటుంబసభ్యులు, సాహిత్యాభిమానుల మధ్య సహస్రావధాని పద్మశ్రీ డా. గరికిపాటి నరసింహారావు (Garikipati Narasimha Rao) చేతులమీదుగా అత్యంత వైభవంగా ఆవిష్కరించడం జరిగింది.

ఆదివారం ఈ సాహిత్య సంపుటాలను అమెరికాలో డాలస్ నగరంలో ఘనంగా ఆవిష్కరించారు. ‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’ మరియు ‘కళావాహిని’ సంయుక్త ఆధ్వర్యంలో ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (Telugu Association of North Texas) సహకారంతో ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది. ముందుగా కళావాహిని వ్యవస్థాపకులు అనంత్ మల్లవరపు (Ananth Mallavarapu) స్వాగతోపన్యాసంతో కొసరాజు చిత్రపటానికి అతిథులందరూ పుష్పాంజలి ఘటించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.          

తానా పూర్వాధ్యక్షులు మరియు తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర (Dr. Prasad Thotakura) సభాధ్యక్షుడిగా వ్యవహరించిన ఈ సమవేశంలో  కొసరాజు సాహిత్యంపై పరిశోధనచేసి పి.హెచ్.డి పట్టా, స్వర్ణ పతకం పొందిన డా. నల్లూరి రామారావు మఖ్యఅతిథిగా, విశిష్టఅతిథిగా పాల్గొన్న ‘కొసరాజు సినీవ్యాస సంహిత’ రచయిత చంద్రహాస్ మద్దుకూరి ప్రబృతులు కొసరాజు వైభవాన్ని వివిధ కోణాలలో విశ్లేషించారు. ముఖ్యఅతిథి డా. నల్లూరి రామారావు (Dr. Nalluri Rama Rao) చేతుల మీదుగా కొసరాజు సాహిత్య సంపుటాలను ఆవిష్కరించారు.

డా. నల్లూరి మాట్లాడుతూ “కొసరాజు కలంనుండి వెలువడ్డ కవితలు, శతకాలు, కావ్యాలు, సినీ గీతాలు ఒక విశిష్ట శైలిలో సాగాయన్నారు. వీరి రచనలలో గండికోట యుద్ధం, కడగండ్లు, కొసరాజు విసుర్లు, కొండవీటి వైభవం, నవభారతం, భానుగీత మొదలైనవి ముఖ్యమైనవి. వీటిలో కొసరాజుకు కూడా బాగా నచ్చినది గండికోట యుద్ధం అంటూ అందరూ తప్పక చదవవలసిన కావ్యం అన్నారు. కొసరాజు పద నిఘంటువును (Dictionary) రూపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.”

చంద్రహాస్ మద్దుకూరి మాట్లాడుతూ ” సినిమా గీతాలలో కొసరాజు వాడిన అచ్చతెలుగు పదాలు, గ్రామీణ ప్రాంతపు మాటలు, పదప్రయోగాలు బహుశా ఏ ఇతర సినీగీత రచయిత (Film Lyricist) చేసి ఉండరు అన్నారు. కొసరాజు పాటలు సరళంగాఉండి పండిత పామర జనులను సమంగా ఆకర్షించాయన్నారు. ఆయన పాటలకు టోపీ, లారీ, సిగరెట్, పేకాట, పకోడీ మొదలైనవి అన్నీ వస్తువులే అంటూ అందుకే అవి ప్రజలమధ్య చిరస్మరణీయంగా ఉంటాయన్నారు.

డా. ప్రసాద్ తోటకూర తన అధ్యక్షోపన్యాసంలో రైతు అన్నదాత, కవి జ్ఞానదాత. ఈ రెండూ కలిసిన కొసరాజు – సాహితీ చైతన్య ప్రదాత అన్నారు. కేవలం నాల్గో తరగతి వరకు మాత్రమే చదువుకున్న కొసరాజు జానపద గీతాలలోని లాలిత్యం, పొగరూ వగరూ ఏమాత్రం తగ్గకుండా తెలుగు సినిమా (Telugu Cinema) పాటకు సొగసులద్దారు అన్నారు.

అచ్చతెలుగు అందాలు, జానపదుల సొగసులు, పల్లెపట్టు చమత్కారాలు, విరుపులు కొసరాజు పాటలలో కొట్టొచ్చినట్లు కన్పిస్తాయి. యక్షగానాలు, వీధి భాగవతాలు, హరికథలు, జముకుల కథలు, బుర్రకథలు, భజనగీతాలు, పగటివేషగాళ్ళ పాటలు, రజకుల పాటలు, పాములోళ్ళపాటలు, గంగిరెద్దుల వారి పాటలు ఇలా ఎన్నో వైవిధ్య భరితమైన (Diverse) కొసరాజు గీతాలు ప్రజల మధ్య కలకాలం నిలిచి ఉంటాయనేది నిత్యసత్యం అంటూ ఘన నివాళులర్పించారు.

కొసరాజు ప్రత్యేక సంగీత విభావరి (Musical Concert) లో – స్థానిక గాయనీ గాయకులు అభినుత మద్దుకూరి, అనంత్ మల్లవరపు, భారతి అంగలకుదిటి, చంద్రహాస్ మద్దుకూరి, మహిత మద్దుకూరి, పూజిత కడ్మిసెట్టి, ప్రభాకర్ కోట, రాజశేఖర్ సూరిభొట్ల, రామన్ వీరంరాజు, సాహితి కోటంరాజు, సాంబ కర్నాటి, శారద షణ్ముఖిలు హృద్యంగా గానం చేసిన – నిలువవే వాలు కనులదానా; ముద్దబంతి పూలు బెట్టీ మొగిలి రేకులు జడనుజుట్టి; మొగలిరేకుల సిగదానా, మురిడీ గొలుసుల పిలదానా; సరిగంచు చీరగట్టి బొమ్మంచు రైక తొడిగి; చిలకన్న చిలకవే బంగారు గిలకవే; నందామయా గురుడ నందామయా; కళ్లు తెరచి కనరా సత్యం ఒళ్ళు మరచి వినరా; మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా; ఆడుతు పాడుతు పనిజేస్తుంటే అలుపూ సొలుపేమున్నది; తింటానికి కూడు చాలదే జాంగిరీ – టౌను పక్కకెళ్ళొద్దురా డింగరీ; ఏడనున్నాడో, ఎక్కడున్నాడో నా చుక్కలరేడు; రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి; ఏరువాకా సాగారో రన్నో చిన్నన్న; చెంగు చెంగునా గంతులు వేయండి; సై సై జోడెడ్లాబండీ బండి, షోకైనా దొరలాబండీ; అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే; బలే చాన్సులే బలే చాన్సులే…ఇల్లరికంలో ఉన్న మజా; సరదా సరదా సిగిరెట్టూ ఇది దొరలు తాగు బల్ సిగిరెట్టు; నీ సోకు జూడకుండ నవనీతమ్మా, నే నిముసమైన బతకలేనె ముద్దులగుమ్మ; మా వూళ్ళో ఒక పడుచుందీ దయ్యమంటె భయమన్నది; రావే రావే బాలా హల్లో మై డియర్ లీల మొదలైన పాటలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి.

సాయి నృత్య అకాడమీ నాట్యగురు యడ్లపాటి శ్రీదేవి నిర్వహణలో – శ్రేష్ట వేముల, మనస్విని రెడ్డి పెంతాల, అనుప వేముల, పల్లవి తుమ్మలూరు ‘ఏరువాక సాగారోరన్న’, ‘కళ్ళు తెరిచి కనరా’, ‘సరిగంచు చీర కట్టి’ మొదలైన పాటలకు చేసిన నృత్యాలు కార్యక్రమంలో (Program) ఒక ప్రత్యేక ఆకర్షణగా నిల్చాయి.

ఈ సంగీత విభావరికి ముందు మనసు ఫౌండేషన్ అధినేత మన్నం రాయుడు పంపిన వీడియో సందేశాన్ని ప్రదర్శించారు. ఈ సాహిత్య సంపుటాలను ముద్రించడంలో ప్రముఖ పాత్ర వహించిన మనసు ఫౌండేషన్ సభ్యుడు పారా అశోక్ కుమార్ ను డా. ప్రసాద్ తోటకూర ప్రశంసించి సాహిత్య పోషకులు (Literary Patrons) గా సహకరించిన మురళి వెన్నం, చంద్రహాస్ మద్దుకూరి, చినసత్యం వీర్నపు, ముఖ్యఅతిథి డా. నల్లూరి రామారావులను ఘనంగా సత్కరించారు.

సంగీత విభావరిలో పాల్గొన్న గాయనీ గాయకులను, నృత్య కళాకారులను డా. కృష్ణబాబు చుండూరి, డా. జంధ్యాల జయకృష్ణ బాపూజీ, గోపాల్ పోనంగి, మురళి వెన్నం, సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ, రాజారెడ్డి, చినసత్యం వీర్నపు, డా. నరసింహారెడ్డి ఊరిమిండి, చంద్రశేఖర్ కన్నెగంటి, సురేష్ కాజ, అనంత్ మల్లవరపు, డా. రమణ జువ్వాడి, డా. నీలిమ మద్దుకూరి, డా. శ్రీదేవి జువ్వాడి, విజయమోహన్ కాకర్ల సన్మాన జ్ఞాపికలు (Felicitation Mementos) అందచేసి దుశ్శాలువలతో ఘనంగా సత్కరించి అభినందించారు.

error: NRI2NRI.COM copyright content is protected