Connect with us

News

ఇమ్మిగ్రేషన్ 360° సెమినార్ ద్వారా తెలుగు వారికి పూర్తిస్థాయి అవగాహన కల్పించిన TANA

Published

on

అమెరికాలో నివసిస్తున్న తెలుగు వారికి ఇమ్మిగ్రేషన్‌కు సంబంధించిన అంశాలపై పూర్తిస్థాయి అవగాహన కల్పించేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) ఇమ్మిగ్రేషన్ 360° పేరుతో అవగాహన సదస్సును నిర్వహించారు. తానా ఎన్నారై స్టూడెంట్స్ కోఆర్డినేటర్ డా. ఉమ ఆరమండ్ల కటికి ఆధ్వర్యంలో ఈ ఆన్లైన్ సెషన్ నిర్వహించారు.

అమెరికా ఇమ్మిగ్రేషన్ వ్యవస్థలో తరచూ మారే నిబంధనలు, వీసా ప్రక్రియలలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి ఈ సదస్సు అమెరికాలోని తెలుగువారికి ఎంతగానో ఉపయోగపడింది. ఇమ్మిగ్రేషన్ రంగంలో సుదీర్ఘ అనుభవం ఉన్న ప్రముఖ న్యాయవాది ఆటార్నీ సంతోష్ రెడ్డి సోమిరెడ్డి (Santosh Reddy Somireddy) అవగాహన కల్పించారు.

యుఎస్ ఇమ్మిగ్రేషన్ చట్టాలు, ఉద్యోగ ఆధారిత వీసాలు (H1B, Green Card), కుటుంబ ఆధారిత ఇమ్మిగ్రేషన్ ప్రాసెస్, లీగల్ స్టేటస్‌కు సంబంధించిన సమస్యలు, ఇటీవలి కాలంలో వచ్చిన కీలక మార్పులు, తాజా పరిణామాలపై ఆయన సవివరంగా వివరించారు. సంక్లిష్టమైన నిబంధనలు, వీసా ప్రక్రియలు, సాధారణంగా ఎదురయ్యే న్యాయపరమైన అంశాలపై స్పష్టత ఇచ్చారు.

రిమోట్ వర్క్‌కు సంబంధించిన మార్గదర్శకాలు, యూనివర్సిటీలు, అంతర్జాతీయ విద్యార్థులు పాటించాల్సిన నిబంధనలు, ప్రయాణ సమయంలో అవసరమైన పత్రాలు, ప్రయాణ పరిమితులపై కూడా వివరాలు అందించారు. కార్యక్రమంలో పాల్గొన్న వారి ఇమ్మిగ్రేషన్ (Immigration) సందేహాలను నివృత్తి చేశారు. పాల్గొన్న సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

తానా ఎన్నారై స్టూడెంట్స్ కోఆర్డినేటర్ డా. ఉమ ఆరమండ్ల కటికి (Dr. Uma Katiki Aramandla) మాట్లాడుతూ.. ‘‘ఇమ్మిగ్రేషన్ అనేది ఇప్పుడు ఎంతో మంది భారతీయుల కలలు, ఆశయాలు, వారి భవిష్యత్తును నిర్దేశించే ప్రక్రియగా మారింది. ప్రస్తుతం రోజురోజుకు మారుతున్న ఇమ్మిగ్రేషన్ నిబంధనలతో ఎంతో మంది ప్రొఫెషనల్ ఉద్యోగులు, విద్యార్థులు కన్ఫ్యూజన్ లో పడుతున్నారు.

అందుకోసమే తానా (TANA) తరుఫున ఇమ్మిగ్రేషన్ సమస్యలపై అవగాహన కల్పించి.. అనుభవజ్ఞులైన అటార్నీ సంతోష్ రెడ్డి సోమిరెడ్డి తో ఉద్యోగులు విద్యార్థుల సమస్యలపై పరిష్కారానికి చొరవ చూపాలనే ఈ సెమినార్ ను ఏర్పాటు చేశాం. లీగల్ గా ఇబ్బందులు ఎదురైన వారి సమస్యలకు పరిష్కారం చూపడమే లక్ష్యంగా పెట్టుకున్నాం.’’ అని అన్నారు.

ఈ సందర్భంగా తానా తరఫున ఈ కార్యక్రమానికి సహకరించిన తానా పెద్దలందరికీ ఉమ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి యాంకర్ లావణ్య గూడూరు (Lavanya Guduru) గారు సంధాన కర్తగా వ్యవహరించారు. తానా ప్రెసిడెంట్ డా. నరేన్ కొడాలి (Dr. Naren Kodali) ఫోన్ కాల్ ద్వారా మాట్లాడారు. ఇదొక గొప్ప కార్యక్రమం నిర్వహించారని ప్రశంసించారు.

ఇమ్మిగ్రేషన్‌కు సంబంధించి సందేహాలు, ఆందోళనలు ఉన్న కమ్యూనిటీ సభ్యులు తమ ప్రశ్నలను సదస్సుకు ముందుగానే సమర్పించే వెసులుబాటును తానా (TANA) ఆధ్వర్యంలో తానా ఎన్నారై స్టూడెంట్స్ కోఆర్డినేటర్ డా. ఉమ ఆరమండ్ల కటికి ముందుచూపుతో ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక ఆన్‌లైన్ ప్రశ్నావళి ఫారమ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.

ప్రతినిధులు తమ సమస్యలు లేదా సందేహాలను ఈ ఫారమ్ ద్వారా నమోదు చేయడంతో నిపుణులు వారి సమస్యలకు ఖచ్చితమైన పరిష్కారాలను సూచించారు. ముందుగా అందిన ప్రశ్నల ఆధారంగా అత్యంత ప్రాధాన్యత ఉన్న, ఎక్కువ మందిని ప్రభావితం చేసే అంశాలను వర్గీకరించి సదస్సులో (Immigration Seminar) ప్రత్యేకంగా చర్చించారు.

అంతే కాకుండా, హాజరైన వారు న్యాయవాదితో నేరుగా మాట్లాడి తమ అనుమానాలను నివృత్తి చేసుకున్నారు. దీంతో డా. ఉమ ముందు చూపు వల్ల ఎంతో మంది అమెరికాలో ఇమ్మిగ్రేషన్ సమస్యతో బాధపడుతున్న తెలుగు వారు తమ సమస్యలకు పరిష్కారాలను వెతుక్కున్నారు. దీంతో ఈ అవగాహన సదస్సు (Immigration Seminar) డా. ఉమ చొరవతో గ్రాండ్ సక్సెస్ అయ్యింది.

ఇమ్మిగ్రేషన్ 360° అవగాహన సదస్సు గ్రాండ్ సక్సెస్ కావడానికి సహకారం అందించిన తానా ఫౌండేషన్ ట్రస్ట్రీ సతీష్ మేక (Satish Meka), యూత్ కోఆర్డినేటర్ చెరుకూరి శ్రీనివాసరావు, ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ కృష్ణ ప్రసాద్ సోంపల్లి (Krishna Prasad Sompally), ఓహయో వ్యాలీ రీజినల్ రిప్రెంజేటేటివ్ ప్రదీప్ చందనం (Pradeep Chandanam), శ్రీదేవి దొంతి, యాంకర్ లావణ్య గూడురులకు తానా ఎన్నారై స్టూడెంట్స్ కోఆర్డినేటర్ డా. ఉమ ఆరమండ్ల కటికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

error: NRI2NRI.COM copyright content is protected