Missouri, September 13, 2026: అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘నాట్స్’ తాజాగా ఆన్‌లైన్ వేదికగా ఆర్థిక అక్షరాస్యత సదస్సు నిర్వహించింది. నాట్స్ మిస్సోరి విభాగం (NATS Missouri Chapter) నిర్వహించిన ఈ సదస్సుకు తెలుగు వారి నుంచి మంచి స్పందన లభించింది.
అమెరికాలోని వివిధ చాప్టర్లకు చెందిన నాట్స్ (NATS), తెలుగు కుటుంబాలు ఈ సదస్సులో ఆన్‌లైన్ ద్వారా పాల్గొన్నారు. ప్రముఖ ఆర్ధిక నిపుణులు ప్రసాద్ స్వర్ణ ఈ సదస్సుకు విచ్చేసి ఎన్నో విలువైన ఆర్ధిక అంశాలను వివరించారు. భవిష్యత్తులో ఆర్థిక భద్రతను (Financial Stability) ఎలా సాధించుకోవాలి..? ఆర్ధిక స్థిరత్వానికి అనుసరించాల్సిన మార్గాలేమిటి అనే పలు కీలక విషయాలను వివరించారు.
ముఖ్యంగా జీవిత బీమా, వీలునామా విల్ అండ్ ట్రస్ట్ (Will and Trust) ఏర్పాటు చేసుకోవడం వంటి అత్యంత ప్రాముఖ్యమైన అంశాలపై అవగాహన కల్పించారు. భవిష్యత్తులో ఎదురయ్యే ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనేందుకు ఎలా సన్నద్ధమవ్వాలి..? ఆర్ధిక ప్రణాళికలు (Financial Planning) ఎలా ఉండాలనేది కూడా ప్రసాద్ ఈ తరహా ముందస్తు ప్రణాళికలు ఎంతగానో ఉపయోగపడతాయని ప్రసాద్ స్వర్ణ తెలిపారు.
ఈ కార్యక్రమంలో నాట్స్ (NATS) వెబ్ సెక్రటరీ కిషోర్ నాదెండ్ల, వైస్ ప్రెసిడెంట్ (ప్రోగ్రామ్స్) రాజేష్ కాండ్రు, నాట్స్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ (ఎన్‌సీ జోన్) సందీప్ కొల్లూరి, నాట్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అలాగే నాట్స్ మిస్సోరీ చాప్టర్ బృందం (NATS Missouri Chapter) సభ్యులు మధుసూదన్ దద్దాల, మురళి బండారుపల్లి, నరేష్ రాయంకుల, సునీల్ స్వర్ణ, అన్వేష్ చాపరాలతో పాటు పలువురు ఈ సదస్సులో పాల్గొన్నారు.
ఆర్ధికంగా తమకు తెలియని ఎన్నో విషయాలను నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు ద్వారా తెలుసుకున్నామని ఈ సదస్సులో పాల్గొన్న తెలుగువారు హర్షం వ్యక్తం చేశారు. ఆన్‌లైన్ ద్వారా ఇంత చక్కటి సదస్సును నిర్వహించిన నాట్స్ మిస్సోరి విభాగ నాయకులను నాట్స్ చైర్మన్ కిషోర్ కంచర్ల (Kishore Kancharla), నాట్స్అధ్యక్షులు రాజ్ అల్లాడ (Raj Allada) ప్రత్యేకంగా అభినందించారు.