Connect with us

People

Raleigh, North Carolina: తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీక NTR జయంతి నేపధ్యంలో అభిమానుల స్మరణ సభ విజయవంతం

Published

on

Raleigh, North Carolina: తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన మహానటుడు, తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (NTR) 103వ జయంతి సందర్భంగా రాలీ ఎన్నారై టీడీపీ (Raleigh NRI TDP) ఆధ్వర్యంలో అభిమానుల స్మరణ సభ విజయవంతంగా నిర్వహించారు.

ప్రతి సంవత్సరం మాదిరిగానే, రాలీ నుండి స్వస్థలమైన ఉదయగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎన్నికైన కాకర్ల సురేష్ (Suresh Kakarla) గారి స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని అభిమానులు, టీడీపీ (TDP), జనసేన (Janasena), బీజేపీ (BJP) కూటమి నాయకులు మరియు కార్యకర్తలు కలిసి నిర్వహించారు.

అపెక్స్ (Apex, North Carolina) నగరంలోని సేలెమ్ విలేజ్ క్లబ్ హౌస్‌ (Salem Village Clubhouse) లో జరిగిన ఈ వేడుకలకు తెలుగు కుటుంబాలు, ఎన్టీఆర్ అభిమానులు, కూటమి నాయకులు మరియు కార్యకర్తలు హాజరై ఎన్టీఆర్ గారి చిత్రపటానికి జ్యోతి వెలిగించి, పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా పలువురు వక్తలు ఎన్టీఆర్ గారి రాజకీయ, సినీ, సామాజిక సేవలను స్మరించుకుంటూ ఆయన తెలుగు జాతికి అందించిన సేవలను కొనియాడారు. అలాగే జై ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్ (Johar NTR) అంటూ నినాదాలు చేశారు. కేక్ కట్ చేసి అందరికీ అందజేశారు.

వక్తలు మాట్లాడుతూ… తెలుగు ప్రజల గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిన మహానేతగా ఎన్టీఆర్ (NTR) చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమం, సామాజిక న్యాయం, స్వాభిమాన రాజకీయాలకు ఆయన వేసిన బాట నేటికీ కోట్లాది మందికి స్ఫూర్తిగా నిలుస్తోందని అన్నారు.

కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు తమ పార్టీ కండువాలతో ఐక్యతను ప్రదర్శిస్తూ, ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అభివృద్ధి కోసం కలిసి పనిచేయాలనే సంకల్పాన్ని వ్యక్తం చేశారు. యువత ఎన్టీఆర్ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

వేడుకల అనంతరం పాల్గొన్న వారందరికీ ఆతిథ్య విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రుచికరమైన విందును అందించి కార్యక్రమ విజయానికి సహకరించిన చార్మినార్ బిర్యానీస్ & చాట్ రెస్టారెంట్ (Charminar Biryanis & Chat Restaurant) యాజమాన్యానికి నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

వారి సహకారం కార్యక్రమాన్ని మరింత విజయవంతంగా నిలిపిందని పేర్కొన్నారు. కుటుంబ సమేతంగా హాజరైన తెలుగు ప్రజలు (Telugu People) పరస్పరం ఆప్యాయతలు పంచుకుంటూ, ఎన్టీఆర్ గారి జ్ఞాపకాలను స్మరించుకుంటూ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పనిదినం అయినప్పటికీ మే 28నే ఎన్టీఆర్ జయంతి వేడుకలు నిర్వహించడం విశేషం

రాలీ (Raleigh, North Carolina) లో నిర్వహించిన ఈ జయంతి వేడుకలు ప్రవాస తెలుగు సమాజ ఐక్యతకు, ఎన్టీఆర్ పట్ల ఉన్న అభిమానానికి నిదర్శనంగా నిలిచాయి. చివరిగా వందన సమర్పణతో నందమూరి తారక రామారావు (Nandamuri Taraka Rama Rao) గారి 103వ జయంతి కార్యక్రమం ముగిసింది.

error: NRI2NRI.COM copyright content is protected