Connect with us

Events

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కళామతల్లి ముద్దు బిడ్డలకు సత్కారం @ తానా కళారాధన, శిల్పకళా వేదిక, హైటెక్ సిటీ, హైదరాబాద్

Published

on

హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ శిల్పకళా వేదికలో డిసెంబర్‌ 16వ తేదీన నిర్వహించిన ‘తానా కళారాధన’ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు, అలనాటి సినీ నటీనటులు కృష్ణవేణి, కోట శ్రీనివాసరావు, మురళీమోహన్‌, గిరిబాబు, గాయని సుశీల, రచయిత పరుచూరి గోపాలకృష్ణ, దర్శకుడు కోదండరామిరెడ్డితోపాటు గాయని సునీత, మాజీ ఎంపి యార్లగడ్ల లక్ష్మీప్రసాద్‌ తదితరులకు చిరు సత్కారం గావించారు.

ఈ కార్యక్రమంలో వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. ఖండాంతరాలు దాటి వెళ్ళినా జన్మభూమి ఋణం తీర్చుకొంటున్న తానా సంస్థ సేవలను అభినందించారు. మాతృ మూర్తిని, మాతృ భాషను, ఉన్న వూరిని, గురువులను ఎన్నటికీ మరువరాదని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో కన్నా అమెరికాలో తెలుగు వెలుగుతోందని అన్నారు.

మాతృభాష అభివృద్ధి కోసం ప్రవాసులు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నారని, ఇక్కడున్న తెలుగువారు వారిని ఆదర్శంగా తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని వెంకయ్యనాయుడు తెలిపారు. ముందు మన భాషను నేర్చుకోవాలి, ఆ తరువాతే ఆంగ్లం నేర్చుకోవాలి అని చెబుతూ, పిల్లలు మాతృభాషలో మాట్లాడేలా చిన్నప్పటి నుంచే అలవాటు చేయాలని కోరారు.

ఇతర భాషలు నేర్చుకోవడంలో తప్పులేదు కానీ అమ్మభాషను మరిచిపోరాదని, మాతృభాషలో చదవడం వల్ల ఉన్నతపదవులు రావన్న భావన వద్దని అంటూ, ప్రస్తుత రాష్ట్రపతి, ప్రధాని, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ మాతృభాషలోనే చదువుకుని ఉన్నత పదవులను చేపట్టిన విషయాన్ని ఈ సందర్భంగా ఉదహరించారు.

తానూ కూడా పల్లెటూరులో మాతృభాషలో చదువుకున్న విషయాన్ని గుర్తు చేశారు. అంతకుముందు ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. గురు రామాచారి ఆధ్వర్యంలో వారి శిష్యులు దాదాపు 80 మంది చేసిన గణేశ వందనంతో కార్యక్రమాలను ప్రారంభించారు.

సౌందర్య కౌశిక్‌ చేసిన నాట్య ప్రదర్శన, రమాదేవి శిష్యులు చేసిన నృత్య ప్రదర్శన అందరినీ అలరించాయి. దాదాపు 85 మందికిపైగా కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వాతి అట్లూరి ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేయడంలో సహకరించి విజయవంతం చేశారు.

ఈ కార్యక్రమంలో అమెరికాలో 20 సంవత్సరాలకు పైగా తెలుగు ఎన్నారైలకు మీడియాపరంగా సేవలందిస్తున్న ‘తెలుగు టైమ్స్‌’ యూ ట్యూబ్‌ ఛానల్‌ను ప్రారంభించారు. ప్రముఖ గాయని సుశీల చేతుల మీదుగా దీనిని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సహకరించిన స్పాన్సర్లను ఘనంగా సత్కరించారు. స్కందన్‌షి గ్రూపుకు చెందిన సురేష్‌ రెడ్డి దంపతులను తానా నాయకులు శాలువా, మెమెంటోలతో సన్మానించారు.

ఈ కార్యక్రమంలో తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు 2023, కాన్ఫరెన్స్‌ కమిటీ కన్వీనర్‌ రవి పొట్లూరి, తానా చైతన్యస్రవంతి కో ఆర్డినేటర్‌ సునీల్‌ పంత్ర, ఫౌండేషన్‌ కార్యదర్శి శశికాంత్‌ వల్లేపల్లి, రవి మందలపు, పురుషోత్తమ చౌదరి గుడే, ఠాగూర్ మల్లినేని, డా. ఉమా ఆరమండ్ల కటికి, రాజా కసుకుర్తి, హితేష్ వడ్లమూడి, సురేష్ కాకర్ల, కళారాణి కాకర్ల తదితర తానా నేతలు పాల్గొన్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected