అక్టోబర్ 16 ఆదివారం రోజున అమెరికాలోని వాషింగ్టన్ డిసి నగరంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ముందుగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సేవ్ ఎపి బిల్డ్ అమరావతి అంటూ నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా జయరాం కోమటి మాట్లాడుతూ రాజధాని రైతులు శాంతియుతంగా, హైకోర్టు అనుమతితోటి పాదయాత్ర చేస్తుంటే సాక్షాత్తు ముఖ్యమంత్రే దాడులను ప్రోత్సహిస్తూ ఉద్దేశ్యపూర్వకంగా రహదారులను మూయించి వేస్తున్నారు. అమరావతి రైతులపై దాడులకు ముఖ్యమంత్రి బాధ్యత వహించాలని కోమటి జయరాం అన్నారు. అధికారపక్షం యొక్క అరాచకాలు చూసి ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలోనే వున్నాయి.
అమరావతి రైతుల పాదయాత్రకు వస్తున్న ప్రజాస్పందన చూసిన తరువాత పాలకపక్షంలో అలజడి మొదలైంది. పాదయాత్ర సజావుగా జరగటానికి సహకరించవలసిన అధికారపక్షం అడ్డంకులు సృష్టించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. న్యాయస్థానం ఇచ్చిన తీర్పును వెంటనే అమలు చేస్తూ అమరావతి రాజధాని నిర్మాణాన్ని తక్షణమే పూర్తి చేయాలని కోరారు.
మాజీ శాసనమండలి సభ్యులు వైవిబి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ఉత్తరాంధ్రను జగన్ రెడ్డి దోపిడీ నుండి రక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మంత్రులు, పార్లమెంట్ సభ్యులు పోటీపడి విశాఖను దోచుకుంటున్నారు. రాష్ట్రంలోని విచ్చిన్నకర శక్తులపట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.
గుంటూరు మిర్చియార్డు మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ రైతుల పాదయాత్ర చూసి ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు. వాక్ స్వాతంత్య్రం పౌరుల ప్రాధమిక హక్కులే కాకుండా అసలు జీవించే హక్కుని హరించివేస్తున్నారు. వై.యస్ రాజశేఖర్ రెడ్డి, జగన్ రెడ్డి పాదయాత్రలు చేసినపుడు ఎవరు అడ్డుకోలేదు. విశాఖ ప్రాంతానికి రైల్వే జోన్, విశాఖ ఉక్కు, భోగాపురం ఎయిర్ పోర్ట్, సాగునీటి ప్రాజెక్టులపై ద్రుష్టి పెట్టాల్సిన ప్రభుత్వం అమరావతి రాజధానిని నాశనం చేయడానికి పూనుకోవడం అత్యంత విషాదకరం.
ఈ కార్యక్రమంలో బి.వి రమణ, డి.వి శేఖర్, భాను ప్రకాష్ మాగులూరి, నరేన్ కొడాలి, గౌతమ్ అమిర్నేని, రామ్ చౌదరి ఉప్పుటూరి, సత్యనారాయణ మన్నే, త్రిలోక్ కంతేటి, విజయ్ గుడిసేవ, కృష్ణ లాం, సుధా పాలడుగు, అనిల్ ఉప్పలపాటి, సుధీర్ కొమ్మి, రవి అడుసుమిల్లి, సాయి బొల్లినేని, శ్రీనాధ్ రావుల, సుష్మ అమృతలూరి, హనుమంతరావు వెంపరాల, మన్నవ వెంకటేశ్వరరావు, గుత్తా రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.