Connect with us

Cultural

తెలుగుదనం ఉట్టిపడేలా సిలికానాంధ్ర ఉగాది ఉత్సవం

Published

on

ఏప్రిల్ 2 శనివారం సాయంత్రం కాలిఫోర్నియా లోని మిల్పిటాస్ నగరంలో సిలికానాంధ్ర నిర్వహించిన శుభకృత్ నామ ఉగాది ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వందల సంఖ్యలో హాజరైన తెలుగు కుటుంబాలను ముందుగా భారతదేశం నుంచి ప్రత్యేకంగా తెప్పించిన వేపపువ్వుతో చేసిన ఉగాదిపచ్చడితో నిర్వాహకులు ఆహ్వానించారు.

ఈ కార్యక్రమం బ్రహ్మశ్రీ మారేపల్లి నాగవేంకటశాస్త్రి గారి వేదపఠనంతో మొదలయింది. ఆ తరువాత ఈ కొత్తసంవత్సరంలో రాబోయే ఫలితాలను తమ పంచాంగపఠనంతో వివరించారు. శ్రీ మధుబాబు ప్రఖ్య గారి సంచాలకత్వంలో ప్రాంతీయ తెలుగుకవుల స్వీయ కవితాపఠనం జరిగింది. దీనిలో శ్రీమతి స్వాతి చీమకుర్తి , శ్రీ వంశీకృష్ణ ప్రఖ్య గారు, శ్రీ రావు తల్లాప్రగడ గారు, శ్రీ మారేపల్లి వేంకటశాస్త్రి గారు పాల్గొన్నారు. శ్రీ రావు తల్లాప్రగడ గారు వినూత్నంగా చిరంజీవి అమోఘ్ కూచిభొట్ల మృదంగ వాద్య సహకారంతో చేసిన కవితాగానం, శ్రీ మధు ప్రఖ్య గారి ఛలోక్తులు సభికులను అమితంగా ఆకట్టుకున్నాయి.

స్వర్గీయ శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి 10 పాటలను ఎంచుకొని “ఆంధ్రకాహళి” శీర్షికన సూర్య వక్కలంక గారు స్వరపరచగా సిలికానాంధ్ర సభ్యులు దశాబ్దం క్రిందట ఉగాది ఉత్సవంలో ప్రదర్శించారు. ఈ నాడు మళ్ళీ అదే సభ్యులు మళ్ళీ అవే గీతాలను తమ పిల్లలతో కలిసి పాడి వినిపించిన వసంత గానలహరికి ప్రేక్షకులు మిన్నంటిన కరతాళధ్వనులతో అభినందించారు.

చివరగా శ్రీ దిలీప్ కొండిపర్తి గారి దర్శకత్వంలో ప్రదర్శించిన నాటిక “ఆదుర్దా వద్దు, ఆనందం ముద్దు” ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది. శ్రీ శ్రీనివాస్ ప్రభల గారి రచించిన ఈ నాటికలో శ్రీ రామకృష్ణ కాజా, శ్రీమతి కాత్యాయని ధూళిపాళ్ళ, శ్రీ అనిల్ చింతలపాటి, శ్రీ దీనబాబు కొండుభొట్ల పాత్రలు పోషించగా, శ్రీ దిలీప్ కొండిపర్తి గారు ఒక ప్రత్యేక పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలతో పాటూ, ఉగాది సందర్భంగా పిల్లలకు నిర్వహించిన భాషా వికాస పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేశారు.

ఈ కార్యక్రమానికి భారత కాన్సులేట్ జనరల్ శ్రీ టి. నాగేంద్రప్రసాద్ గారు ముఖ్యఅతిధిగా విచ్చేశారు. వారు అందరికీ ఉగాది శుభాకాంక్షలను తెలియజేస్తూ భారత కాన్సులేట్ ప్రవాసీయుల కోసం చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. మరో విశేషం వారి శ్రీమతి పద్మ గారు కూడా స్థానిక కవులతోపాటు తాను కూడా వారి ఉగాది కవితని చదివి వినిపించారు.

సిలికానాంధ్ర శ్రేయోభిలాషి, యూనివర్సిటీ ఆఫ్ సిలికానాంధ్ర భవనానికి తొలిదాత విశ్రాంత వైద్యులు శ్రీ లక్కిరెడ్డి హనిమిరెడ్డి గారు తనకు సంస్థతో ఉన్న దీర్ఘకాల అనుబంధాన్ని పంచుకుంటూ సభికులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. అందరి హర్షాతిరేకాలమధ్య యూనివర్సిటీ భవిష్యత్ కార్యాచరణకు మొదటి విరాళం సభా ముఖంగా ప్రకటించి తమ వితరణశీలతను చాటుకున్నారు. సభకు హాజరైన ప్రముఖ వైద్యులు శ్రీ కె. వేణు గారు, శ్రీ ప్రభాకర్ కల్వచర్ల గార్లు కూడా అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియచేశారు.

సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ ఆనంద్ కూచిభొట్ల గారు అధ్యక్షోపన్యాసం చేస్తూ తమ సంస్థ గత 21 సంవత్సరాలుగా చేస్తున్న కార్యక్రమాలను, సాధించిన విజయాలను పంచుకుంటూ భవిష్యత్ ప్రణాళికలను కూడా వివరించారు. ఈ సందర్భంలో సిలికానాంధ్ర నవతరం నాయకులను, కార్యకర్తలను సభికులకు పరిచయం చేశారు. కోకిలాస్ కిచెన్ వారందించిన పదహారణాల తెలుగు భోజనం తో పాటు సిలికానాంధ్ర వారు ప్రతి ఒక్కరికీ అందజేసిన కవితాతాంబూలం అందరినీ ప్రత్యేకంగా ఆకర్షించింది.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected