Connect with us

Social Service

ఇండియాలో తానా ఫౌండేషన్ సేవలకు పునరుత్తేజం – TANA Foundation చైర్మన్ డా. ప్రసాద్ నల్లూరి

Published

on

తెలుగు రాష్ట్రాల్లో TANA Foundation ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలను చేపట్టనున్నట్లు తానా ఫౌండేషన్ చైర్మన్ (2025-2027) ప్రముఖ వైద్యులు డాక్టర్ నల్లూరి ప్రసాద్ (Dr. Prasad Nalluri) తెలిపారు. సేవా కార్యక్రమాల్లో భాగంగా తన స్వగ్రామమైన ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు జిల్లాలో ఉన్న టీ.నర్సాపురం ప్రాంతంలో ఆయన సేవా కార్యక్రమాలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఈ ప్రాంతంలో మేము సైతం మిత్ర బృందం చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలు తెలుసుకుని వారి సేవలు స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు. ఆదివారం ఆయన తన సతీమణి లక్ష్మి గారితో కలిసి స్వగ్రామమైన (Hometown) టీ.నర్సాపురాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మేము సైతం మిత్ర బృందం సభ్యులు దంపతులను శాలువాతో ఆత్మీయంగా సత్కరించి స్వాగతం పలికారు.

తానా ఫౌండేషన్ (TANA Foundation) సహకారంతో, మేము సైతం మిత్ర బృందం ఆధ్వర్యంలో డిసెంబర్ 3న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించనున్న సామాజిక సేవా కార్యక్రమాల్లో (Service Activities) భాగంగా దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని డాక్టర్ ప్రసాద్ నల్లూరి దంపతులు లాంఛనంగా ప్రారంభించారు.

స్థానిక దివ్యాంగురాలు నార్లపాటి యువతికి దుప్పటి, పండ్లు అందజేయడంతో పాటు వ్యక్తిగతంగా కొంత ఆర్థిక సహాయాన్ని (Finacial Assistance) కూడా అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ నల్లూరి ప్రసాద్ మాట్లాడుతూ, తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అమెరికాతో పాటు స్వదేశంలోనూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

ఇందులో భాగంగా త్వరలో టీ.నర్సాపురం హైస్కూల్‌లో సంబంధిత అధికారుల అనుమతితో విద్యార్థినీ విద్యార్థులకు ప్రాణాపాయ అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడే సీపీఆర్ (CPR) శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సామాజిక కార్యకర్త ఎస్.డి. నాసర్ పాషా మాట్లాడుతూ, తన చిన్ననాటి స్నేహితుడు డాక్టర్ ప్రసాద్ (Dr. Prasad Nalluri) తన సతీమణితో కలిసి తమ గ్రామానికి రావడం, మేము సైతం మిత్ర బృందం చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్తలు కొరివి నాగేశ్వరరావు, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జాతీయ అవార్డు (National Award) గ్రహీత పింగుల మధు, జమీల బేగం, అబ్దుల్లా, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

error: NRI2NRI.COM copyright content is protected