Cumming, Georgia: పరంపర ఫౌండేషన్, ప్రముఖ ఆయన డాన్స్ అకాడమీ సహకారంతో, జూలై 15, బుధవారం కమ్మింగ్, జార్జియాలోని బంజారా బ్యాంక్వెట్స్ వేదికగా “ప్రవాహ” పేరుతో ఒక వినూత్న ఇంటరాక్టివ్ నృత్య ప్రదర్శనను నిర్వహించింది. ప్రవాహతో పరంపర ఫౌండేషన్ (Parampara Foundation) సాంస్కృతిక సాయంత్రం ఘన విజయంగా నిలిచింది.
అట్లాంటా (Atlanta) పరిసర ప్రాంతాల భారతీయ సమాజం నుంచి పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు హాజరైన ఈ కార్యక్రమం విశేష విజయాన్ని సాధించింది. “ప్రవాహ” అనే పేరుకు తగినట్లుగానే, జీవితం, భక్తి, దైవశక్తి అనే శాశ్వత ప్రవాహాన్ని భారతీయ శాస్త్రీయ నృత్య సంప్రదాయాల ఆధారంగా నృత్యం, ప్రత్యక్ష సంగీతం, కథా విన్యాసాల సమ్మేళనంగా అద్భుతంగా ఆవిష్కరించారు.
కళాకారులు–ప్రేక్షకుల మధ్య ఆధ్యాత్మిక సంభాషణ
సాధారణ నృత్య ప్రదర్శనలకు భిన్నంగా, ప్రవాహ ప్రత్యేకత దాని ఇంటరాక్టివ్ రూపకల్పనలో కనిపించింది. కళాకారులు మరియు ప్రేక్షకుల మధ్య ఒక ఆధ్యాత్మిక సంభాషణగా రూపొందించిన ఈ కార్యక్రమంలో, ప్రతి ప్రదర్శన వెనుక ఉన్న తాత్విక భావాలను ప్రేక్షకులు ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం కల్పించారు. భారతీయ సంప్రదాయాల శాశ్వత విలువలను కళ ద్వారా అనుభూతి చెందేలా ఈ ప్రదర్శన సాగింది.
ఆయన డాన్స్ ఎన్‌సెంబుల్ (Aayana Dance Company) సభ్యులు సమూహ నృత్యాలు, ఏకపాత్ర, ద్విపాత్ర ప్రదర్శనలు, భావప్రధానమైన అభినయాలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. ఆకుపచ్చ, నారింజ, ఎరుపు రంగుల సాంప్రదాయ వస్త్రధారణ, ఆలయాభరణాలతో అలంకరించుకున్న నర్తకులు అద్దాల వేదికపై దైవలీలలను, భక్తి ఘట్టాలను జీవం పోసినట్లుగా ఆవిష్కరించారు.
కార్యక్రమంలోని ప్రధాన ఆకర్షణలు
అద్భుతమైన లయబద్ధ పాద విన్యాసాలు, సమన్వయంతో కూడిన నృత్య కదలికలు, ప్రేమ, విరహం, సమర్పణ వంటి భావోద్వేగాలను ప్రతిబింబించిన సన్నివేశాలు ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకున్నాయి. హాస్యం, కరుణ, భక్తి రసాల సమ్మేళనంగా సాగిన ప్రతి ప్రదర్శన ప్రారంభ ప్రార్థన నుంచి ముగింపు వరకు ప్రేక్షకులను కట్టిపడేసింది.
సాయంత్రం 6:00 గంటల నుంచి 8:30 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమానికి హాజరైన ప్రేక్షకులు (Audience) హర్షధ్వానాలతో కళాకారులను అభినందించారు. పలువురు ఈ అనుభవాన్ని “హృదయాన్ని తాకినది”, “ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించినది” అని అభివర్ణించారు.
సమాజానికి కృతజ్ఞతలు – సాంస్కృతిక పరిరక్షణకు నిరంతర కృషి
ఈ సందర్భంగా పరంపర ఫౌండేషన్‌కు (Parampara Foundation) చెందిన ప్రమోద్ రెడ్డి, ఆయన డాన్స్ అకాడమీకి చెందిన మనోజ్ఞ బాలరాజు తమ సంస్థల లక్ష్యాలు, కార్యకలాపాలను వివరించి, అట్లాంటా (Atlanta) తెలుగు, భారతీయ సమాజం అందిస్తున్న ఆదరణకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ఆర్గనైజింగ్ టీమ్ సభ్యురాలు నీలిమ గడ్డమనుగు (Neelima Gaddamanugu) కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికీ, స్వచ్ఛంద సేవకులకు, విరాళాలు అందించిన వారికి, సహకరించిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. విదేశాల్లో పెరుగుతున్న భావితరాలకు భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించి, ప్రోత్సహించాలనే ఫౌండేషన్ లక్ష్యానికి ఇలాంటి ప్రోత్సాహమే బలమని ఆమె పేర్కొన్నారు.
అట్లాంటా పరిసర ప్రాంతాల్లోని పలు నృత్య అకాడమీలు, తెలుగు సంస్థలు (Telugu Associations) ఉత్సాహంగా పాల్గొని అందించిన సహకారం ఈ కార్యక్రమాన్ని చిరస్మరణీయ విజయంగా నిలబెట్టిందని ఫౌండేషన్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది. వారి భాగస్వామ్యం భారతీయ శాస్త్రీయ కళల పరిరక్షణలో సమాజ ఐక్యతను ప్రతిబింబించిందని పేర్కొంది.
ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో సహకరించిన వెంకట్ కుట్టువా (Venkat Kuttua) ఫోటోగ్రఫీ (ఫోటోగ్రఫీ), రఘు వలుసాని (వీడియోగ్రఫీ), వేదిక భాగస్వామి బంజారా బ్యాంక్వెట్స్ (Banjara Banquets), అలంకరణ బాధ్యతలు నిర్వహించిన మయూరి క్రియేషన్స్ సంస్థలకు పరంపరా ఫౌండేషన్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. కార్యక్రమ సమన్వయ బాధ్యతలను నీలిమ గడ్డమనుగు, సందీప్ రెడ్డి గుండ్ల, నందా చాట్ల, స్నిగ్ధ నెల్లుట్ల, చంద్రశేఖర్ ఆల్తాటి విజయవంతంగా నిర్వహించారు.
“ప్రవాహ” ద్వారా పరంపర ఫౌండేషన్ (Parampara Foundation) మరోసారి కళల శక్తిని చాటుతూ, ప్రవాస భారతీయులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి భారతీయ సంస్కృతి, సంప్రదాయాలతో అనుబంధాన్ని మరింత బలోపేతం చేసింది. రానున్న నెలల్లో మరిన్ని స్ఫూర్తిదాయక సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తామని ఫౌండేషన్ ప్రకటించింది.