Hyderabad, Telangana: వంశీ ఆర్ట్ థియేటర్స్ (Vamsi Art Theaters) ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఇచ్చే ప్రతిష్టాత్మక ఉగాది పురస్కారాలలో భాగంగా, ఈ పరాభవ నామ సంవత్సర ఉగాదికి వివిధ దేశాల తెలుగు సంస్థల నుండి సాంస్కృతిక కళారంగ విభాగాలలో విభిన్న సేవలు అందిస్తున్నవారికి “వంశీ సీల్వెల్ ప్రవాస భారతీయ ఉగాది పురస్కారాలు” ఆదివారం హైదరాబాద్ త్యాగరాయ గానసభలో అందజేశారు.
ప్రముఖ సినీ నటులు డా. రాజేంద్ర ప్రసాద్ (Dr. GaddeRajendra Prasad), నటీమణులు సంగీత, మంజుభార్గవి, దర్శకులు రేలంగి నరసింహారావు, సినీకవి వనమాలి మరియు ప్రముఖ సాహితీవేత్తలు, రచయితలు, వివిధ రంగాల కళాకారులు కూడా ఈ ప్రతిష్టాత్మక ఉగాది పురస్కారాలతో (Ugadi Awards) వేదికపై సత్కరించబడ్డారు.
“ఇటువంటి వంశీ వేదికపై మా ‘శ్రీ సాంస్కృతిక కళాసారథి (Sri Samskrutika Kalasaradhi Singapore)’ సంస్థ ప్రధాన కార్యనిర్వాహక వర్గ సభ్యురాలు, రచయిత్రి రాధిక మంగిపూడి (Radhika Mangipudi) కి “సభా భారతి” బిరుదు ప్రదానం జరగడం, మా సంస్థ సభ్యులైన యడవల్లి శేషు కుమారి శాస్త్రీయ సంగీతంలోనూ, తంగిరాల సౌభాగ్యలక్ష్మి లలిత సంగీత రంగంలోనూ, పావని చిలువేరు సాహిత్య రంగంలోను ఉగాది పురస్కారాలను అందుకోవడం మాకెంతో గర్వకారణం” అని సింగపూర్ నుండి సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్ (Ratna Kumar Kavuturu) పేర్కొన్నారు.
యూకే నుండి డా. బాబురావు చౌదరి చాపరాల & భారతి దంపతులు, హాంకాంగ్ నుండి జయ పీసపాటి, ఖతార్ నుండి సాహిత్య జ్యోత్స్న కొలిపాక, యూఏఈ నుండి శ్రీకాంత్ చిత్తర్వు, శ్రీనివాస లింగం, సౌదీ అరేబియా నుండి కొనేరు ఉమామహేశ్వరరావు, అనిల్ కుమార్ కడించెర్ల, అమెరికా నుండి శ్రీనివాస్ గూడూరు (Srinivas Guduru), వాణి దిట్టకవి, జయరాం ఎర్రమిల్లి తదితరులు కూడా ఈ పురస్కారాలను అందుకున్నారు.
ముఖ్యఅతిథిగా విచ్చేసిన తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender Reddy), డా.కె వి రమణాచారి ఐఏయస్, హైదరాబాద్ (Hyderabad) దూరదర్శన్ కేంద్రం హెడ్ కామేశ్వరి, డా. వంశీ రామరాజు మరియు ఇతర అతిథుల చేతుల మీదుగా ఈ పురస్కార ప్రదాన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది.