Connect with us

Cultural

అలరించిన Telugu Association of Jacksonville Area సంక్రాంతి సంబరాలు

Published

on

తెలుగు అసోసియేషన్ ఆఫ్ జాక్సన్విల్ ఏరియా (Telugu Association of Jacksonville Area – TAJA) ఆధ్వర్యంలో జనవరి 27న స్థానిక బోల్స్ మిడిల్ స్కూల్ నందు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. తాజా అధ్యక్షులు శ్రీ మహేష్ బచ్చు గారి సారథ్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాలు ఆధ్యంతం అందరినీ అలరించాయి. ఆహ్లాదకరమైన వాతావరణంలో, అంగరంగ వైభవంగా జరిగిన ఈ సంబరాలు పిల్లా పెద్దలందరినీ ఆకట్టుకున్నాయి.

తెలుగు నాట సంక్రాంతి వేడుకలు ఎలా జరుపుకుంటామో అంతే ఘనంగా జాక్సన్విల్లే తెలుగు వారు కూడా జరుపుకోవాలని, సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్న ప్రాంగణాన్నంతా సంక్రాంతి పండుగ వాతావరణాన్ని కళ్లకు కట్టినట్టు, తెలుగుదనం ఉట్టిపడేలా అలంకరించారు. ప్రధాన వేదికను తెలుగు తల్లి మరియు తెలంగాణ తల్లి చిత్రాలతో అలంకరించారు.

ఆహూతులందరూ ఫోటోలు దిగడానికి నాలుగు విభిన్నమైన Photo Booth లను ఏర్పాటు చేసినారు. ఈ కార్యక్రమానికి దాదాపుగా 600 మంది తాజా సభ్యులు హాజరయినారు. తాజా సభ్యులందరూ సాంప్రదాయ దుస్తులతో వచ్చి పండుగ వాతావరణం తీసుకొచ్చారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని తాజా వారు, సాంప్రదాయ పిండి వంటలు, ముగ్గుల పోటీలు మరియు పిల్లలకు ఫ్యాన్సీ డ్రెస్ పోటీలను నిర్వహించారు.

ఫ్యాన్సీ డ్రెస్ పోటీలలో పది సంవత్సరాలలోపు పిల్లలు రైతులుగా, కొత్త అల్లుడులాగా, హరిదాసులాగా … చాలా అందంగా తయారయి వచ్చారు. జ్యోతి ప్రజ్వలన చేసి, వేద పండితులు శ్రీ శ్రీనాథ్ గారి ఆశీర్వచనాలతో సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించారు. అచ్చమైన తెలుగు వాతావరణాన్ని అణువణువునా ప్రతిబింబించే కూచిపూడి, కోలాటం, నాటికలను, పాటలను, నృత్యాలను ఎంచుకొని బాలబాలికలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

వేదిక పైన చేసిన అన్ని కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. “మన గోపికలు” వారు అన్నమయ్య కీర్తనకు చేసిన కోలాటం సభికులందరినీ అలరించినది. వెంకటేశ్వర స్వామి వేషధారణలో వచ్చిన బాబును తాజా (Telugu Association of Jacksonville Area) అధ్యక్షులు శ్రీ మహేష్ బచ్చుగారు మెచ్చుకొని అప్పటికప్పుడు బహుమతిని అందచేసినారు.

నృత్యాంజలి, దేవీ తత్వం, తాళ తరంగిణి, లిటిల్ చార్మర్స్, సప్త స్వరాలయం, కుందనపు బొమ్మలు, సామజ వరగమన నాటిక, బుట్ట బొమ్మలు, ఇండియన్ రిధం, బీట్ బ్రేకర్స్, అప్సరలు తదితర కార్యక్రమాలతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశారు. ఇదే వేడుకలో మాతృ భాషా సేవ చేస్తున్న అధ్యాపకులను తాజా కార్యవర్గ సభ్యులు సత్కరించారు.

సనాతన ధర్మాన్ని, మన సంస్కృతిని కాపాడుతూ, తెలుగు వారికి అండగా నిలుస్తున్న శ్రీ శ్రీమాన్ శ్రీనాధ్ గారు, జాక్సన్విల్లే దేవాలయములో పురోహితులుగా పాతిక సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు “సువర్ణ గండ పెండేరం”తో పాటు “పురోహిత బ్రహ్మ” అనే బిరుదుతో ఘనంగా సత్కరించారు. గత రెండు దశాబ్దాలుగా జాక్సన్విల్లే తెలుగు సంఘానికి అధ్యక్షులుగా వ్యవహరించిన పెద్దలందరి సమక్షంలో ఈ సత్కారం జరిగినది.

తాజా అధ్యక్షులు శ్రీ మహేష్ బచ్చు (Mahesh Bachu) గారు అధ్యక్షోపన్యాసం చేస్తూ.. గత సంవత్సర కాలంగా తమ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇరవై ఒక్క కార్యక్రమాల గురుంచి వివరించారు. మన సంస్కృతిని మనం కాపాడుకోవాలని, తెలుగు వారు అందరూ కలిసి ఉంటూ, ఒకరికొకరు చేదోడువాదోడుగా ఉండాలని, ఆపత్కాలంలో పలువురికి తాజా ఏవిధంగా సాయపడిందో సవివరంగా తెలియచేసారు.

కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించడానికి కీలకపాత్ర పోషించినటువంటి తోటి కార్యవర్గ సభ్యులను ప్రత్యేక జ్ఞాపికలతో సన్మానించారు. తదనంతరం 2024 నూతన అధ్యక్షడిగా ఎంపికైన శ్రీ మల్లి సత్తి తన నూతన కార్యనిర్వాహక బృందాన్ని, సభకు పరిచయం చేశారు. చివరి కార్యక్రమముగా హనుమాన్ చాలీసా పారాయణం జరిగినది.

ఇందులో దాదాపుగా యాభై మందికి పైగా పిల్లలుగా పాల్గొన్నారు. వేదిక మీద యాభై మంది పిల్లలు పాడుతుంటే, వీక్షిస్తున్న ప్రేక్షకులు కూడా శృతి కలిపారు. ప్రాంగణమంతా హనుమాన్ చాలీసాతో మార్మోగిపోయింది. ఆసమయంలో ఆహూతులందరు భ‌క్తి పార‌వ‌శ్యంలో మునిగి పోయారు. తాజా వారు అందరికీ అయోధ్య రామాలయ అక్షింతలు పంచిపెట్టారు.

అమెరికా (USA) మరియు భారతదేశ (India) జాతీయ గీతాలతో తాజా సంక్రాంతి సాంస్కృతిక కార్యక్రమాలు ముగించుకొని భోజనాలకు వెళ్లిపోయారు. ఇరవైకి పైగా వంటకాలతో సంక్రాంతి విందు భోజనం వడ్డించారు. సాంప్రదాయ తెలుగు మిఠాయిలు, తినుబండరాళ్లు, పచ్చళ్ళు, పొడులు, పులిహోర, పెరుగన్నం, వంకాయ, ఇతర ఆహార పదార్థాలతో ఆహుతులకు తెలుగింటి భోజనం రుచి చూపించారు.

స్థానిక “మా కిచెన్” ఇండియన్ రెస్టారెంట్ వారు తయారు చేసిన ఈ విందును అతిథులు ఆస్వాదించారు. తాజా సంక్రాంతి సంబరాలకు Vasavi Group, Persis Biryani Indian Grill, Ravi’s Academy, YourTravelBooking.com, Budget Decor Delight వారు ఆర్ధికంగా సహకరించినారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected