తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (TTA) అలబామా (Alabama) చాప్టర్ ఆధ్వర్యంలో 2వ వార్షికోత్సవ సంబరాలు, దసరా మరియు బతుకమ్మ వేడుకలు అక్టోబర్ 17న పెల్హామ్ సివిక్ సెంటర్ (Pelham Civic Complex) లో అంగరంగ వైభవంగా జరిగాయి.
ఈ వేడుకలకు అలబామా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తెలుగు ప్రజలు, కుటుంబ సమేతంగా భారీ సంఖ్యలో తరలివచ్చారు. టిటిఎ అలబామా (TTA Alabama Chapter) కమిటీ సభ్యులు (Committe Members) శ్రవణ్ వంగురు ఆధ్వర్యంలో విచ్చేసిన అతిథులకు కమిటీ ప్రతినిధులు సాంప్రదాయబద్ధంగా సాదర స్వాగతం పలికారు.
రంగురంగుల పువ్వులతో తీర్చిదిద్దిన బతుకమ్మలు ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆడపడుచులు భక్తిశ్రద్ధలతో బతుకమ్మ పూజలు నిర్వహించి, పాటలు పాడుతూ ఆటలు ఆడారు. అనంతరం పోటీల్లో పాల్గొని ఉత్తమంగా బతుకమ్మలను పేర్చిన మహిళలకు నిర్వాహకులు (Organizers) బహుమతులు ప్రధానం చేశారు.
ఈ సందర్భంగా పిల్లలు, పెద్దలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. తెలుగు సమాజానికి విశేష సేవలందించిన పలువురు ప్రముఖులకు టిటిఎ అలబామా (TTA Alabama Chapter) తరుఫున “జీవిత సాఫల్య పురస్కారం” (Lifetime Achievement Award) మరియు “సామాజిక సేవా పురస్కారం” (Social Service Award) లను అందజేశారు.
దసరా & బతుకమ్మ వేడుకల అనంతరం విచ్చేసిన అతిథులందరికీ నోరూరించే బహుళ వంటకాలతో చక్కటి విందు భోజనం ఏర్పాటు చేశారు. చివరిగా యువత (Youth), పిల్లలు డిజె (DJ) సంగీత హోరులో ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ వేడుకలను దిగ్విజయం చేశారు.
ఈ దసరా & బతుకమ్మ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కమిటీ (TTA Alabama Chapter) సభ్యులకు, స్వచ్ఛంద సేవకులకు మరియు విరాళాలు అందించిన దాతలకు టిటిఎ (Telangana American Telugu Association) ప్రతినిధులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.