Gandhampalle, Telangana: మహబూబాబాద్ జిల్లా (Mahabubabad District) బయ్యారం మండలం గంధంపల్లి గ్రామంలో చేతన ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సేవా కార్యక్రమాలు ఘనంగా సాగాయి. పేద ప్రజల ఉపాధి అభివృద్ధికి దోహదపడే విధంగా వివిధ ఉపకరణాల పంపిణీ కార్యక్రమం బుధవారం ఉత్సాహంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి హాజరైన పోలీసు అధికారులు చేతన ఫౌండేషన్ సేవలను కొనియాడుతూ అభినందనలు తెలిపారు. ఉద్యోగ రీత్యా అమెరికాలో స్థిరపడ్డప్పటికీ స్వగ్రామాన్ని మరవకుండా నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న చేతన ఫౌండేషన్ వ్యవస్థాపకులు వెనిగళ్ళ రవి కుమార్ (Ravi Venigalla) సేవా భావం ప్రశంసనీయం అని మహబూబాబాద్ డిఎస్పీ నంబూరి తిరుపతిరావు పేర్కొన్నారు.
విదేశాల్లో ఉంటూ కూడా స్వదేశ ప్రజల అభ్యున్నతికి కృషి చేయడం గొప్ప విషయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని అర్హులైన లబ్ధిదారులకు 13 తోపుడు బండ్లు, మూడు పిండి మిల్లులు, మూడు ఇస్త్రీ పెట్టెలను పంపిణీ చేశారు.
ఎల్మాస్ మాగ్నెటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తమ సిఎస్ఆర్ నిధులతో ఈ కార్యక్రమానికి సహకారం అందించగా, చేతన ఫౌండేషన్ (Chetana Global Foundation) సభ్యులు గ్రామంలో అర్హులైన లబ్ధిదారులను గుర్తించి ఈ పంపిణీ చేపట్టారు. ముఖ్య అతిథుల చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా డిఎస్పీ తిరుపతిరావు మాట్లాడుతూ.. చేతన ఫౌండేషన్ సేవా కార్యక్రమాలకు ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు. సంస్థ వ్యవస్థాపకుడు వెనిగళ్ళ రవి కుమార్ మార్గదర్శకత్వంలో బంధుమిత్ర బృందం రెండు తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం వారి నిస్వార్థ సేవకు నిదర్శనం అని తెలిపారు. ఇటువంటి మంచి కార్యక్రమాలకు పోలీసు శాఖ నుండి ఎల్లప్పుడూ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
తుమ్మలపల్లి ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గంధంపల్లి సర్పంచ్ భూక్యా ప్రవీణ్ కుమార్, బయ్యారం సిఐ రవీందర్, ఎస్ఐ తిరుపతి, చేతన ఫౌండేషన్ కెనడా (Canada) ప్రతినిధి సీతారామారావు, సంస్థ అధ్యక్షుడు వెనిగళ్ళ అనిల్ కుమార్, ఉపాధ్యక్షుడు వెనిగళ్ళ వెంకటేశ్వరరావు, జాయింట్ సెక్రటరీ దొడ్డా సీతారామయ్య, సభ్యులు తాతా గణేష్, నవీన్, రషీద్, తోటకూర అంజమ్మ తదితరులు పాల్గొన్నారు.
పంపిణీ కార్యక్రమం అనంతరం లబ్ధిదారులు తమకు ఉపాధి మార్గం చూపిన చేతన ఫౌండేషన్ (Chetana Global Foundation) కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సహాయం తమ కుటుంబాల ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అనేక మంది గ్రామస్థులు పాల్గొన్న ఈ కార్యక్రమం గంధంపల్లి (Gandhampalle) లో సేవా స్పూర్తిని మరింత పెంచినట్లు స్పష్టమైంది.