మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ‘మా’ ఎన్నికల్లో మంచు విష్ణు ప్యానెల్ ఘనవిజయం సాధించింది. సుమారు మూడు నెలలకు పైగా విమర్శలు, వివాదాలు, మాటల తూటాలతో మా ఎన్నికలు అసెంబ్లీ ఎలక్షన్స్ ని తలపించాయి. విష్ణు, ప్రకాశ్ రాజ్ ల మధ్య హోరాహోరీ పోటీ నడిచిన ఇంతటి ఉత్కంఠ భరితమైన పోరులోనూ విష్ణు భారీ విజయం సాధించారు. విష్ణు ముందు నుంచి తన గెలుపుపై చాలా నమ్మకంగా ఉన్నారు. పోలింగ్ రోజున కూడా రెండు ప్యానళ్లు నువ్వానేనా అన్నట్టు వాడిగా అరుచుకున్నారు. విష్ణు ప్యానల్ నుంచి ఎక్కువమంది గెలవడంతో ఇక మా పరిపాలన సజావుగా సాగుతుందేమో. ఎందుకంటే ఏ నిర్ణయాన్నైనా అమలు చేయడం సులభమవుతుంది. విష్ణు విజయం కోసం తండ్రి మోహన్ బాబు పకడ్బందీగా పావులు కదిపారు. పాత నటీనటులను కలేయటం, పోల్ మేనేజ్మెంట్ పక్కాగా నిర్వహించడం తదితర విషయాల్లో నేర్పరితనాన్ని ప్రదర్శించారు.
926 మంది సభ్యులున్న మా లో 883 ఓటర్లు ఉన్నారు. ఆదివారం జరిగిన ఎన్నికల్లో 603 ఓట్లు బ్యాలెట్ ద్వారా పోల్ కాగా, 52 పోస్టల్ బ్యాలెట్స్ వచ్చాయి.పోస్టల్ బ్యాలెట్‌తో కలిపి 655 ఓట్లు పోల్ అవ్వడం మా చరిత్రలో ఇది మొదటిసారి. విష్ణుకు 381 ఓట్లు రాగా, ప్రకాశ్ రాజ్‌కు 274 ఓట్లు వచ్చాయి. దీంతో విష్ణు 106 ఓట్ల తేడాతో గెలిచినట్టయింది. ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా హీరో శ్రీకాంత్ కూడా 106 ఓట్ల తేడాతోనే బాబూమోహన్ పై గెలవడం విశేషం.