ఈ మధ్యనే ఓ సినిమాలో చూసాం ఓ వ్యక్తి తన ఓటు హక్కు వినియోగించుకోటానికి విదేశాల నుంచి స్వదేశానికి వస్తాడు. అది సినిమా.. కానీ నిజ జీవితంలో ఓటు కోసం అంత ఖర్చు పెట్టుకొని ఎవరు వస్తారు అనుకుంటే పొరపాటే. నవంబర్ 30 న తెలంగాణా (Telangana) లో పోలింగ్ జరుగుతున్నది విదితమే. ఈ నేపథ్యంలో తన ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అమెరికా నుంచి నగరానికి వచ్చారు.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజక వర్గం మంచాల గ్రామానికి చెందిన విలాస్ రెడ్డి జంబుల (Vilas Reddy Jambula) వృత్తిరీత్యా అమెరికా (USA) లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. సొంత రాష్ట్రం తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల్లో ఎలాగైనా వెళ్లి ఓటు వేయాలని సంకల్పంతో అమెరికా నుంచి వచ్చి తన విలువైన ఓటును వినియోగించుకోనున్నారు.
మరో వైపు ప్రీతమ్, ఆదిత్య రాయుడు, రామకృష్ణ, పవన్ మధు, కొంపెల్ల శ్రీనివాస్, కూతురు శ్రీనివాస్, ప్రవీణ్ వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఓటు వేయడం కోసమే నగరానికి వచ్చిన వీరు గురించి పోలింగ్ కేంద్రాలలో తెలియడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
మంచి ప్రజానాయకుడిని ఎన్నుకోవటానికి ఓటే ఆయుధమని, అందుకోసం ప్రతి ఒక్కరూ తమ విలువైన ఓటును వినియోగించుకోవాలని యువ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఓటు వేసేందుకు వీరు చూపిన చొరవ ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం. అంతేకాకూండా ఓటు యొక్క విలువను వీరు చాటి చెప్పారు.