ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) ‘తానా‘ లో ఇప్పుడు ఏం నడుస్తుంది అని అడిగితే సగటు తెలుగువారు అంతా జంబలకడి జారు మిఠాయే అంటున్నారు. తానా కి ఉన్న పరపతి ఏంటి? ఎందుకు ఇలా అంటున్నారో తెలియాలంటే మనం ఆదిత్య 369 సినిమాలో నందమూరి బాలక్రిష్ణ లాగా టైం మెషీన్లో గతంలోకి వెళ్ళాల్సిందే.
మెంబర్షిప్స్ తో రచ్చ మొదలు:-
సుమారు ఒక సంవత్సరం వెనక్కి అంటే జనవరి 2022 లోకి తొంగి చూస్తే ప్రస్తుత జంబలకడి జారు మిఠాయకి అప్పుడే బీజం పడినట్లు తెలుస్తుంది. 2022 జనవరి 31 లోపు సుమారు 30 వేల మంది (దాదాపు 17 వేల సభ్యత్వాలు) తెలుగువారు తానా సభ్యత్వం (Membership) తీసుకున్న సంగతి పలు మీడియాల్లో చూశాం.
తానా రాజ్యాంగం లోని ఆర్టికల్ V, సెక్షన్ 8b ప్రకారం ప్రతి నెలా చివరి తేదీ లోపు, అంతకు ముందు నెలలో వచ్చిన మెంబర్షిప్ అప్లికేషన్స్ మరియు పేమెంట్స్ వివరాలు కోశాధికారి (Treasurer) తానా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సారధ్యంలోని మెంబర్షిప్ వెరిఫికేషన్ కమిటీ (MVC) కి పంపాలి. మెంబర్షిప్ వెరిఫికేషన్ కమిటీ వీటిని 15 రోజుల లోపు పరిశీలించి కరెక్ట్ గా ఉన్నవాటిని ఆమోదించవలసి ఉంది. అలాగే ఏదన్నా సమాచారం సరిగా లేని వారికి 15 రోజుల సమయం ఇచ్చి వివరాలు సమర్పించమని కోరాలి.
అటు కోశాధికారి గానీ, ఇటు మెంబర్షిప్ వెరిఫికేషన్ కమిటీ గానీ ఇవేమి సకాలంలో చేయలేదట. అంతే కాకుండా 2022 జనవరి 31 లోపు వచ్చిన తానా సభ్యత్వాలను తానా రాజ్యాంగం (Bylaws) లోని ఆర్టికల్ XIV, సెక్షన్ 1 ప్రకారం ఓటు హక్కు వచ్చేలా 3 నెలల అనంతరం కనీసం 2022 ఏప్రిల్ 30 లోపు కూడా ప్రాసెస్ చేయలేదు అనేది అభియోగం. దీంతో తానా మెంబర్షిప్స్ రచ్చ పతాక స్థాయికి చేరింది.
కోర్టు కేసులు షురూ:-
పైన పేర్కొన్న అభియోగాల ప్రకారం కోశాధికారి మరియు మెంబర్షిప్ వెరిఫికేషన్ కమిటీ (Membership Verification Committee) తానా సభ్యులను బలిపశువులను చేస్తూ తానా రాజ్యాంగం కల్పించిన ప్రాధమిక ఓటు హక్కును కాలరాస్తున్నారంటూ కొత్తగా సభ్యత్వాలు తీసుకున్నవారిలో ముగ్గురు కోర్టు మెట్లెక్కారు.
2022 నవంబర్ 10న మరియు తిరిగి 2023 జనవరి 19న ఈ కేసును విచారించిన మేరీల్యాండ్ లోని బాల్టిమోర్ సిటీ సర్క్యూట్ కోర్టు (Baltimore City Circuit Court) వాదోపవాదాలు పరిశీలించిన అనంతరం ఫైనల్ తీర్పు ఇచ్చే వరకు తానా ఫైనల్ ఓటర్స్ లిస్ట్ ఖరారు చేయకుండా ప్రిలిమినరీ ఇంజంక్షన్ (Preliminary Injunction) ఆర్డర్ ఇచ్చింది.
మొత్తం 30 వేల మంది కొత్త సభ్యులకు వోటింగ్ రైట్స్ ఇద్దామని తీర్మానం చేసి తానా అధ్యక్షుని సారధ్యంలోని ఎగ్జిక్యూటివ్ కమిటీ బోర్డుకి పంపినప్పటికీ ఈసీ లో ఒప్పుకున్న నలుగురు బోర్డులో ఒప్పుకోకపోవడం, అలాగే కోర్ట్ కేసుల కోసం తానా డబ్బులు వేస్ట్ చేయకుండా బైలాస్ సవరించుకొని మొత్తం 30 వేల మంది కొత్త సభ్యులకు వోటింగ్ రైట్స్ ఇవ్వండని బోర్డు మీటింగ్లో తానా లాయర్ ఇచ్చిన సలహాని సైతం తుంగలో తొక్కడం అందరినీ విస్మయపరిచాయట.
కాక రేపిన అసంపూర్ణ ఎలక్షన్ అనౌన్స్మెంట్:-
అయినప్పటికీ తానా బోర్డులో ఉన్న బలాబలాల రీత్యా ఒక వర్గం వారు జనవరి 31 రాత్రి 10 గంటల (Eastern Standard Time) తర్వాత హడావిడిగా ఎలక్షన్ అనౌన్స్మెంట్ అంటూ బోర్డు కార్యదర్శి పేరుతో ఒక యాహూ ఈమెయిల్ నుంచి కొంతమంది తానా సభ్యులకు ఈమెయిల్ వచ్చింది.
కానీ అందులో తానా రాజ్యాంగం లోని ఆర్టికల్ XIV, సెక్షన్ 10 ప్రకారం నామినేషన్ ఫీజు గట్రా వంటి వివరాలేమీ లేవు. అంతే కాకుండా తానా వెబ్సైట్లో గానీ లేదా తానా పత్రికలో గానీ ఎటువంటి వివరాలు లేవు. దీంతో ఒకవేళ నామినేషన్ వేయాలన్నా నామినేషన్ పత్రాలు ఎక్కడ తెచ్చుకోవాలి, నామినేషన్ ఫీజు ఎక్కడ చెల్లించాలి వంటి విషయాలలో స్పష్టత లేకుండా గజిబిజి గందరగోళం అయ్యింది.
తానా వెబ్సైట్ కి సమాంతరంగా మరో వెబ్సైట్:-
ఇదిలా నడుస్తుండగానే TANABOD.ORG అంటూ కొత్త వెబ్సైట్ పుట్టుకొచ్చింది. అందులో కోర్టు పరిధిలో ఉన్న విషయాన్ని కూడా ఖాతరు చేయకుండా రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్టు ఒక పాత ఓటర్స్ లిస్ట్ ప్రత్యక్షమయింది. అప్పటి వరకు అందుబాటులో ఉన్న TANAEC.ORG కూడా వెంటనే ఎవరో కొనేయడం కొసమెరుపు.
ఒక పక్క కోర్టు కేసులు, మరో పక్క అసంపూర్ణ ఎలక్షన్ అనౌన్స్మెంట్ ప్రకారం నామినేషన్ల గడువు దగ్గిర పడడం చూస్తుంటే అతి పెద్ద తెలుగు సంఘం అయిన తానా (Telugu Association of North America) లో జంబలకడి జారు మిఠాయే నడుస్తుంది అంటూ కామెడీ చేస్తున్నారు తానా సభ్యులు.