తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (TANA) 46 సంవత్సరాల చరిత్రలో మొట్టమొదటిసారి ఎలక్ట్రానిక్ వోటింగ్ పద్దతి ద్వారా నిర్వహిస్తున్న ఎన్నికలలో (Elections) పోలింగ్ మొదట్లో మందకొడిగా సాగినప్పటికీ ఈ వారం కాస్త స్పీడు అందుకున్నట్లు తెలుస్తుంది.
డిసెంబర్ 25 వరకు ఉధృతంగా ప్రచారం నిర్వహించిన రెండు ప్యానెల్స్ (Team Kodali & Team Vemuri) కూడా డిసెంబర్ 26 న రావలసిన ఎలక్ట్రానిక్ వోటింగ్ బ్యాలెట్స్/ఈమెయిల్స్ కోసం కాచుకొని కూర్చున్నారు. కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఒక రోజు లేటుగా, అనగా డిసెంబర్ 27 న బ్యాలెట్స్ (Ballots) తానా సభ్యుల ఈమెయిల్ బాక్సుల్లోకి చేరుకున్నాయి.
ఏదో బ్యాలెట్స్ రాగానే పెద్ద ఎత్తున వెంటనే ఓట్లు పోల్ చేపిద్దామనుకున్న తానా నాయకులకు (TANA Leaders) తత్త్వం బోధపడడానికి ఎక్కువ సమయం పట్టలేదు. క్రిస్మస్ మరియు నూతన సంవత్సర సెలవుల సీజన్ కావడంతో తానా ఓటర్లు/సభ్యులు ఓట్లు వేయడానికి పెద్దగా అందుబాటులో లేరు, లేదా ఆసక్తి చూపలేదు.
కొందరైతే రెండు ప్యానెల్స్ వారు పంపిన మాస్ ఈమెయిల్స్ దెబ్బకి తట్టుకోలేక వాటితోపాటు వోటింగ్ ఈమెయిల్ కూడా తెలిసో తెలియకో డిలీట్ చేశారు. మొదటి రోజు ఒక టైం లో 10 నిమిషాల వ్యవధిలో 10 కాంపెయిన్ ఈమెయిల్స్ రావడం తానా సభ్యుల (TANA Voters) ఓపికని పరీక్షించింది.
దీంతో రెండు ప్యానెల్స్ వారు కూడా ముందు తమకి అందుబాటులో ఉన్న మరియు డైరెక్ట్ గా పరిచయం ఉన్న తానా సభ్యులతో (TANA Members) ఎవరికి వారు తమ అనుయాయులకు మద్దతుగా ఓట్లు వేయించుకున్నారు. ఇలా మందకొడిగా మొదలైన పోలింగ్ జనవరి 2 తర్వాత కొంచెం ఊపందుకున్నట్లు అనిపించింది.
కాకపోతే కొందరు సెలవులకు ఇండియా (India) వెళ్లడం, అమెరికా మరియు కెనడా (Canada) లో ఉన్నవారు మాత్రమే ఓట్లు వెయ్యగలగడం వంటి కారణాల రీత్యా ఇప్పటికీ చాలా మంది తానా సభ్యులు ఓట్లు వెయ్యలేదు. వచ్చే వారంలో ఇలాంటి వారందరి చేత ఓట్లు వేయించడానికి రెండు ప్యానెల్స్ పోటీదారులు సన్నద్ధమవుతున్నారు.
ఇలా స్లో గా పోలింగ్ అవుతున్నప్పటికీ, ఇప్పటి వరకు సుమారు ఒక 40 శాతం ఓట్లు పోల్ అయ్యి ఉంటాయని అంచనా. వోటింగ్ చివరి తేదీ జనవరి 17 న సాయంత్రం 5 గంటల లోపు ఇంకో 10 శాతం వరకు ఓట్లు పోల్ అయ్యే అవకాశం ఉంది. మొత్తంగా సుమారు 50 శాతానికి కొంచెం ఎక్కువగా పోల్ అయ్యే అవకాశం ఉందంటున్నారు తానా నాయకులు.
ఇక జయాపజయాల విషయానికి వస్తే… మిగతా ప్రాంతాల్లో కొంచెం అటుఇటుగా సమానంగా ఉన్నప్పటికీ అట్లాంటా, అపలాచియన్ మరియు వర్జీనియా ప్రాంతాల్లో మొత్తంగా భారీ మెజారిటీ సాధించి, పూర్తి ప్యానెల్ విజయం సాధిస్తామని టీం కొడాలి (Team Kodali) ప్యానెల్ వారు బాగా ధీమాగా ఉన్నారు.
అలాగే ఒహాయో, ఆస్టిన్, హ్యూస్టన్, న్యూయార్క్, డల్లాస్ ప్రాంతాల్లోని మెజారిటీ కలుపుకొని ఓవరాల్ గా అర కొర మెజారిటీతో అయినా సరే తమ ప్యానెల్ విజయతీరాలకు చేరుతుందని టీం వేమూరి (Team Vemuri) ప్యానెల్ సభ్యులు అంటున్నారు. ఫౌండేషన్ ట్రస్టీస్ డోనార్ కేటగిరీలోని రెండు పదవులలో మాత్రం రెండు ప్యానెల్స్ చెరొకటి గెలుస్తారని అంచనా.
ఒక పక్క టీం కొడాలి నుంచి తానా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి నరేన్ కొడాలి (Naren Kodali) కి అందరికంటే ఎక్కువ మెజారిటీ వస్తుందని కొందరు, టీం కొడాలి ప్యానెల్లో దాదాపు అందరూ గెలిచినప్పటికీ రీజినల్ రిప్రజంటేటివ్స్ లో కొన్నిటికి మాత్రం టీం వేమూరి తో బొటాబొటీ ఫైట్ నడిచి అటు ఇటు అయ్యే ఛాన్స్ ఉంటుందని మరికొందరు అంటున్నారు.
ఇంకో పక్క క్రాస్ వోటింగ్ (Cross Voting) బెడద కూడా ఉంటుందని, కాకపోతే మొత్తంగా ఎక్కువ ఓట్లు పోల్ అయ్యి మెజారిటీ 2 వేలకు మించి ఉంటే మాత్రం క్రాస్ వోటింగ్ బెడదని దాటుకొని ఆ ప్యానెల్ అన్ని పొజిషన్స్ కైవసం చేసుకుంటుందని ఊహాగానాలు నడుస్తున్నాయి. ఈ మెజారిటీ గ్యాప్ తగ్గే కొద్దీ క్రాస్ వోటింగ్ రీత్యా మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశాలు మెరుగవుతాయి.
ఇకపోతే టీం వేమూరి (Sateesh Vemuri) ప్యానెల్ లో క్రాస్ వోటింగ్ ప్రయోజనం ద్వారా అత్యధిక ఓట్లు అశోక్ కొల్లా, శిరీష తూనుగుంట్ల మరియు శశాంక్ యార్లగడ్డ కి వస్తాయని టాక్ నడుస్తుంది. ఏమో కొందరు ఊహించుకుంటున్నట్లు ఎవరూ ఊహించని ఫలితాలు (Election Results) కూడా వస్తాయేమో చూడాలి.
ఎన్నికల ప్రచారంలో ఉన్నంత కాన్ఫిడెన్స్, రోజులు గడిచే కొద్ది, పోలింగ్ శాతం పెరుగుతున్న కొద్దీ ఇప్పుడు మాత్రం కొంతమందిలో లేదని స్పష్టంగా తెలుస్తుంది. అందుకే “మంత్రాలకు చింతకాయలు రాలుతాయా?” అనే చందాన తానా ఎన్నికలు సాగుతున్నాయి అంటూ కొందరు దెప్పి పొడుస్తున్నారు కూడా.
జనవరి 18 న కౌంటింగ్ పూర్తి అయితే గానీ ఎవరి అంచనాలు నిజమవుతాయో, ఎవరి అంచనాలు తలకిందులౌతాయో తెలియదు. సతీష్ వేమూరి సారధ్యంలోని టీం వేమూరి (Team Vemuri) మరియు నరేన్ కొడాలి సారధ్యంలోని టీం కొడాలి (Team Kodali) ప్యానెల్స్ కి NRI2NRI.COM తరపున బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాం.
ఏది ఏమయినప్పటికీ, ఎవరు గెలిచినప్పటికీ తారతమ్య భేదాలు వదిలి అహంకారం చూపకుండా తానా సంస్థ ఔన్నత్యాన్ని పెంపొందించేలా, ముఖ్యంగా అమెరికాలోని తెలుగు వారికి మరియు రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న తెలుగువారికి ప్రజోపయోగమైన సరికొత్త సేవలతో ముందుకు నడుస్తారని ఆశిద్దాం.