Connect with us

Birthday Celebrations

నందమూరి బాలక్రిష్ణ అతిథిగా ఆంధ్ర కళా వేదిక ఖతార్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు

Published

on

విశ్వవిఖ్యాత నవరస నటనా సార్వభౌమ కి. శే. శ్రీ నందమూరి తారక రామారావు (Nandamuri Taraka Ramarao) గారి “శత జయంతి ఉత్సవాలు” ఆంధ్ర కళా వేదిక ఖతార్ ఆధ్వర్యంలో మే 5వ తారీఖున శుక్రవారం దోహా లో LA Cigale హోటల్ లోని అల్ వాజ్బా బాల్రూమ్ లో (Qatar) అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నందమూరి తారక రామారావు గారి నట వారసుడు, హిందూపురం శాసనసభ్యులు, నట సింహం శ్రీ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) గారు పాల్గొన్నారు. ఆయనతో పాటు ప్రముఖ సినీ నేపధ్య గాయనీ గాయకులు సింహ భాగవతుల, ప్రవీణ్ కుమార్ కొప్పోలు, గాయని పర్ణిక మాన్య హాజరయ్యారు.

ఖతార్ లోని భారత రాయబార సంస్థ ఆధ్వర్యంలో ఉన్న అత్యున్నత సంస్థల (ICC, ISC ICBF, IBPN) అధ్యక్షులు, వారి ప్రతినిధులు, ఖతార్ లోని తెలుగు ప్రముఖులు మరియు వివిధ తెలుగు సంఘాల (TKS, TPS, TGS, TJQ, TBA) అధ్యక్షులు, వారి కార్యవర్గ సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఖతార్ లోని నలుమూలల నుండి 1200 మందికి పైగా హాజరయ్యారు.

బాలబాలికల సంప్రదాయ నృత్యాలతో సాంస్కృతిక కార్యక్రమాల్ని మొదలుపెట్టగా గాయనీ గాయకులు సింహ, ప్రవీణ్ మరియు పర్ణిక NTR మరియు బాలకృష్ణ గారి పాటలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. బాలయ్య బాబు తన తండ్రి (NTR) గారి గూర్చిన అద్భుత ప్రసంగమే కాకుండా “శివశంకరీ శివానందలహరి” పాటను పాడి ప్రేక్షకులందరినీ ఆకట్టుకున్నారు. బాలయ్య పాటకు ప్రేక్షకులందరూ ఫిదా అయ్యి స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. అలాగే హర్షధ్వానాలతో “జై బాలయ్య” నినాదాలతో హాలంతా మార్మోగింది. అయన లైవ్ లో పాడిన పాట ఇప్పటికీ నెట్లో వైరల్ గా మరి హల్ చల్ చేస్తోంది.

ఆంధ్ర కళావేదిక అధ్యక్షుడు శ్రీ వెంకప్ప భాగవతుల మాట్లాడుతూ కేవలం వారం రోజుల సమయంలో నిర్వహించిన ఈ కార్యక్రమం “న భూతొ న భవిష్యత్” అనే విధంగా ఖతార్ లోని తెలుగు సంఘాలలో చరిత్ర సృష్టించిందని, ఈ కార్యక్రమాన్ని ఇంత భారీ విజయవంతంగా నిర్వహించుకోటానికి అవకాశం కల్పించి సహకరించిన శ్రీ గొట్టిపాటి రమణయ్య గారికి, ప్రాయోజితులు (Sponsors) కి తన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

అంతే కాక కార్యక్రమ నిర్వహణ ప్రోత్సాహక కమిటీ సభ్యులు అయిన గోపాల్ గారికి, వాసు గారికి, రమేష్ గారికి, విక్రమ్ సుఖవాసి కి, స్వచ్ఛంద సేవకులు (వాలంటీర్స్) గా సహకరించిన వారికీ ప్రత్యేకంగా గోవర్ధన్ అమూరు కు, కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్న చిన్నారులకు, వారి తల్లితండ్రులకు కూడా ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అద్భుతమైన మీడియా సహకారాన్ని అందిస్తున్న మీడియా మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమం కోసం తమ కార్యవర్గ సభ్యులు శ్రీ గొట్టిపాటి రమణ, విక్రమ్ సుఖవాసి, వీబీకే మూర్తి, శ్రీ సుధ, శిరీష రామ్, రవీంద్ర, శేఖరం రావు, సాయి రమేష్, KT రావు బృందం చేసిన కృషి అభినందనీయమని కొనియాడారు మరియు హృదయపూర్వక అభినందనలు తెలియజేసారు. ఆంధ్ర కళావేదిక ప్రధాన కార్యదర్శి శ్రీ విక్రమ్ సుఖవాసి ముగింపు సందేశ ధన్యవాదాలతో కార్యక్రమం వైభవోపేతంగా ముగిసింది.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected