తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (Telugu Association of North America) 2023-25 కాలానికి జరుగుతున్న ఎలక్షన్స్ (Elections) ప్రచారం ఊపందుకుంది. నరేన్ కొడాలి సారధ్యంలోని టీం కొడాలి (Team Kodali) మరియు సతీష్ వేమూరి సారధ్యంలోని టీం వేమూరి (Team Vemuri) అమెరికాలోని అన్ని ప్రాంతాల్లో మద్దతు కూడగట్టేలా తిరుగుతున్నారు.
ఇందులో భాగంగా తానా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి డా. నరేన్ కొడాలి (Dr. Naren Kodali) మరియు తానా మాజీ అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు, టీం కొడాలి కి మద్దతుగా గత కొన్నిరోజులుగా పలు రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలు చేశారు. డోర్ టు డోర్ ప్రచారం తరహాలో వీలైనంత ఎక్కువ ప్రాంతాలను, ఓటర్లను చుట్టి వస్తున్నారు.
నరేన్ కొడాలి బృందం ఒహాయో రాష్ట్రంలోని కొలంబస్ (Columbus, Ohio) నగరంలో ప్రచారం నిర్వహిస్తుండగా, 3 రోజులపాటు అంజయ్య చౌదరి లావు (Anjaiah Chowdary Lavu) బృందం సౌత్ ఈస్ట్ రిప్రజంటేటివ్ అభ్యర్థి మధుకర్ యార్లగడ్డ తో కలిసి ఫ్లోరిడా రాష్ట్రంలోని జాక్సన్విల్ (Jacksonville), ఓర్లాండో (Orlando), టాంపా (Tampa) నగరాల్లో కాంపెయిన్ నిర్వహించారు.
వారాంతంలో నరేన్ కొడాలి బృందం మిచిగన్ (Michigan) మరియు ఇల్లినాయిస్ (Illinois) రాష్ట్రాలను కవర్ చేశారు. డెట్రాయిట్ (Detroit) మరియు చికాగో (Chicago) నగరాల్లో ప్రముఖులతో మిలాఖత్ అయినట్లు సమాచారం. డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించి వీలైనంత ఎక్కువమందిని కలిసి మద్దతు సమీకరించారని వినికిడి.
అలాగే తానా మాజీ అధ్యక్షులుఅంజయ్య చౌదరి లావు బృందం టెక్సస్ (Texas) రాష్ట్రంలోని డల్లాస్ (Dallas) లో రెండు రోజులపాటు తిష్ట వేశారు. కృష్ణా ఎన్నారై (Krishna NRI) గ్రూప్ తోపాటు మరికొందరు ప్రముఖులను కలిసి చాప కింద నీరులా ప్రచారం నిర్వహించినట్లు సమాచారం.
అనంతరం ఆదివారం డిసెంబర్ 10, సోమవారం డిసెంబర్ 11 మరియు మంగళవారం డిసెంబర్ 12న మూడు రోజులపాటు అంజయ్య చౌదరి లావు అపలాచియన్ రీజియన్ (Appalachian Region) లో టీం కొడాలి కి మద్దతుగా బహుళ సమావేశాల్లో పాల్గొన్నారు. వోటింగ్ దగ్గిర పడేకొద్దీ ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) నాయకులు ప్రచారం జోరు పెంచుతున్నారు.
ప్రత్యేకంగా అపలాచియన్ ప్రాంతంలో టీం కొడాలి (Team Kodali) తరపున 6 గురు అభ్యర్థులు పోటీలో ఉండడం, వారందరూ ఇప్పటికే ఒక రౌండ్ ఇంటర్నల్ సమావేశాలు కూడా నిర్వహించడం కలిసివచ్చే అంశం. వర్కింగ్ డే అయినప్పటికీ దాదాపు 150 మంది పాల్గొనడం విశేషం.