జానపదాన్ని జ్ఞానపథంగా నమ్ముకున్న అట్లాంటా ఎన్నారై (Atlanta, Georgia) జనార్ధన్ పన్నెల ఒక పక్క జార్జియా జానపద జనార్ధన్ (Janardhan Pannela) గా, ప్రజాగాయకునిగా రాణిస్తూ మరోపక్క ఆటిజం మరియు మానసిక వికలాంగులకు గత 24 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.
ఇప్పుడు ఆ 24 ఏళ్ళ సేవను Asia International Culture Research University (International Accreditation Organization – IAO USA) వారు గుర్తించి గౌరవ డాక్టరేట్ (Honorary Doctorate) ని ప్రధానం చేశారు. గత నెల ఇండియా వెళ్లి డాక్టరేట్ పట్టా పుచ్చుకున్నారు. దీంతో ఇది దివ్యాంగులకు దక్కిన పట్టం అంటూ ప్రవాసులు అభినందిస్తున్నారు.
సేవాతత్పరతతో రెండు దశాబ్దాలకు పైగా ఆటిజం (Autism), మానసిక వికలాంగులకు సేవలందిస్తూ తన సంపాదనలో కొంత భాగం తాను ఇండియాలో నిర్వహిస్తున్న శాంతినికేతన్ ఫౌండేషన్ (Shantiniketan Foundation) కోసం ఖర్చు చేస్తూ వస్తున్న అట్లాంటా వాసికి గౌరవ డాక్టరేట్ దక్కడం అభినందనీయం.
ఈ సందర్భంగా జనార్ధన్ పన్నెల మాట్లాడుతూ… ఒకప్పుడు డాక్టర్ కావాలని EAMCET పరీక్ష రాసి రాంక్ తెచ్చుకున్నప్పటికీ సీట్ రాకపోవడం, ఇప్పుడు ఆ కోరిక దేవుని దయతో సేవామార్గంలో డాక్టర్ జనార్ధన్ పన్నెల (Dr. Janardhan Pannela) అనిపించుకునేలా చేయడం సంతోషకరం అన్నారు.
అలాగే AICRU University కి, తన తల్లితండ్రులకు, కుటుంబానికి, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు, శాంతినికేతన్ ఫౌండేషన్ (Shantiniketan Foundation) నిర్వహణకు సర్వదా శతధా సహకరించి తోడ్పాటు అందించిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.