Connect with us

Arts

Norway: అలరించిన స్వరరాగ శతావధానం – వీధి అరుఁగు & SS Music Academy International

Published

on

సంగీత సరస్వతి సంపూర్ణ కృపా పాత్రులు, గాన విద్యాప్రవీణ, స్వర ఘనాపాటి, సంగీత శిక్షణా విశారద, స్వరకర్త శ్రీ గరికిపాటి వెంకటప్రభాకర్ గారి మొట్టమొదటి అంతర్జాతీయ స్వరరాగ శతావధాన కార్యక్రమం దిగ్విజయంగా పూర్తయినది. “వీధి అరుఁగు, నార్వే” మరియు “యస్ యస్ మ్యూజిక్ అకాడెమీ – ఇంటర్నేషనల్” సంస్థలు సంయుక్తంగా ఒక అపూర్వ అంతర్జాతీయ స్వరరాగ శతావధాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాయి.

ఈ స్వరరాగశతావధానం కార్యక్రమంలో భాగంగా అంతర్జాల వేదికపై నిర్విరామంగా ఏప్రిల్ 14 వ తేదీ నుండి మొదలుకొని ఏప్రిల్ 22వ తేదీ వరకు 17 దేశాల నుంచి సంగీతజ్ఞులైనటువంటి 108 మంది పృచ్ఛకులతో, 15 మంది సమన్వయకర్తలతో నిర్వహించిన కార్యక్రమం ఆద్యంతము ఎంతో ఆహ్లాదకరంగా జరిగింది.

సరస్వతీ ఉపాసనే నాదోపాసన. ఆ నాదోపాసన స్వరరాగతాళ రసరమ్య రూపమై నాభీహృత్కంఠరసనాల నుండి ఉద్భవించడం అనేది ఒక అద్భుతమైన సునాద ప్రక్రియ అది కేవలం కారణజన్మములకే సాధ్యం. స్వయంగా ఆ వరాన్నిఅమ్మవారి కృపతో పొందిన వరపుత్రులు శృతియుత మధుస్రవంతీ స్వర మాధుర్యసమన్విత లలితశాస్త్రీయసంగీత కళాపోషకులు పూజ్యుగురులు అవధాని శ్రీ.గరికిపాటి వెంకట ప్రభాకర్ గారు.

అవధాన ప్రక్రియలో భాగంగా సంగీతజ్ఞులైన పృచ్ఛకులు శరపరంపరగా సంధించిన ప్రశ్నలకు అతి స్వల్పవ్యవధిలో ఒకసారి రాగ వర్ణనతో, మరోసారి నిషిద్ధస్వర విన్యాసంతో, ఒకతూరి రాగమాలికల కూర్పులతో, స్వరాక్షరాలతో, ఒకపరి రాగతాళరసమార్పుల కూర్పులతో బదులిస్తూ, అప్రస్తుత ప్రసంగ ప్రభంజనాన్ని అలవోకగా అడ్డుకుంటూ, సంగీత పాలసముద్రం చిలకగా వచ్చిన అమృత గుళికలు తన స్వరరాగావధానంగా రూపుదాల్చిన కార్యక్రమమే ఈ స్వరరాగావధానం.

శ్రీ ప్రభాకర్ గారు ఎంతో సునాయాసంగా, అద్భుతంగా, అవలీలగా చేసారీ స్వరరాగావధానం. కొన్ని చోట్ల అవధాని గారి రసస్ఫూర్తి అనితరసాధ్యం అనేలా ప్రకటితమైంది. ఈ అపూర్వసంగీత విషయాల సారమును తెలుసుకొన్న ప్రతి ఒక్కరూ పూర్తిగా సంతృప్తి చెంది, కరతాళ ధ్వనులతో తమ ఆమోదం తెలియచేశారు.

ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా ఖతార్ నుండి శ్రీ విక్రమ్ సుఖవాసి (Vikram Sukhavasi) గారు వ్యవహరించారు. ముఖ్య అతిథులుగా తెలుగు భాషాసేవకులు, భాషాకోవిదులు కీ.శే. సముద్రాల లక్ష్మణయ్య గారి కుమారులు శ్రీ సముద్రాల విజయానంద్ గారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ పూర్వ సంచాలకులు డా. విజయ్ భాస్కర్ దీర్ఘాశి గారు, తానా పూర్వ అధ్యక్షులు శ్రీ జయ్ తాళ్లూరి (Jay Talluri) గారు, వంగూరి ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీ వంగూరి చిట్టెం రాజు గారు, తానా పూర్వ అధ్యక్షులు శ్రీ ప్రసాద్ తోటకూర గారు, ఇంకా ఎందరో మహానుభావులు విచ్చేసి శ్రీ గురుదేవుల ఆమోఘమైన పాండిత్యం చూసి వేనోళ్ళ కొనియాడారు.

ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన వీధిఅరుఁగు వ్యవస్థాపకులు శ్రీ వెంకట్ తరిగోపుల (Venkat Tarigopula) గారు ఇలాంటి కార్యక్రమాలు ముందుతరాల వారికి ఒక నిఘంటువుగా ఉంటాయని తెలుపుతూ, గురువుగారి అపార ప్రతిభాపాటవాలకు మరియు సంగీతానికి చేస్తున్న కృషికి వారికి గౌరవ డాక్టరేట్ రావాలని కోరుకుంటూ వారి అభిమానాన్ని చాటుకున్నారు.

విజయోత్సవ సభలో గురుదేవులను సత్కరించుకున్న పిమ్మట నిర్వాహకులను, పృచ్ఛకులను, ముఖ్య అతిథులను, స్వయంసేవకులను, ఇంకా ప్రత్యక్షముగా, పరోక్షంగా సేవలందించిన అందరినీ గౌరవ మర్యాదలతో సత్కరించారు.

అంతర్జాతీయంగా (International) మొట్టమొదటిసారి నిర్వహించిన ఈ శతావధానం కార్యక్రమాన్ని వండర్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్స్ మరియు తెలుగు బుక్ అఫ్ రికార్డ్స్ లో పొందుపరిచి అంగీకార పత్రాన్ని అందజేశారు. గురుదేవులు అందరికీ శుభం కలగాలని, ప్రతి ఒక్కరికీ శుభాశీస్సులు అందించటంతో ఈ 4 రోజుల అంతర్జాతీయ స్వరరాగ శతావధాన కార్యక్రమం మహాద్భుతంగా పూర్తయినది.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected