Connect with us

Literary

విశిష్టంగా బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్‌ అష్టావధానం: Hindu Temple of Atlanta, TAMA

Published

on

అట్లాంటాలో హెచ్ టి ఏ (హిందూ టెంపుల్ ఆఫ్ ఆట్లాంటా) మరియు తామా (తెలుగు అసోసిఏషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా) ఉభయ సంస్థల సహకారంతో ఏప్రిల్ 16, 2023 న హెచ్ టి ఏ ప్రాంగణంలో బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్‌గారి అష్టావధానం అద్భుతంగా జరిగింది. తెలుగు భాషలో విశిష్టమైన ప్రక్రియ అవధానం.

కోవిడ్ తరువాత ప్రప్రథమంగా జరిగిన ఈ అవధానానికి రికార్డు స్థాయిలో దాదాపు 240 మంది పాల్గొన్న ఈ కార్యక్రమం జ్యోతి ప్రజ్వలన, ప్రార్థనాగీతాలాపన, ప్రముఖుల వక్తవ్యాలతో సుమారు ఉదయం 11 గంటలకు మొదలయింది. సమస్యాపూరణం, దత్తపది, వర్ణనము, నిషిద్ధాక్షరి, న్యస్తాక్షరి, ఆశువు, పురాణపఠనం మరియు అప్రస్తుతప్రసంగం మొదలగు అంశాలతో సాహితీ ప్రియులనే కాకుండా అందరినీ అలరించే విధంగా సాగటం శ్లాఘనీయం.

నిర్వాహకులు వచ్చిన వారందరికీ రుచికరమైన విందు భోజనం ఏర్పాటు చేశారు. తామా వారు సంస్కృతి, సాంప్రదాయం, సాహిత్యం, భాష, వైద్యం, విద్య, వికాసం, వినోదాలను సమ పాళ్ళలో రంగరిస్తూ చేస్తున్న అనేక ఉపయుక్తమైన కార్యక్రమాలు విశేష ఆదరణ చూరగొంటున్నాయి. ప్రజలు, స్పాన్సర్లు, వాలంటీర్లు తామాకి మూలస్తంభాలు, వారి అండ దండలతో భవిష్యత్తులో మరిన్ని విశేష కార్యక్రమాలు చేయబోతున్నారు.

తామా అధ్యక్షులు సాయిరామ్ కారుమంచి, హెచ్ టి ఏ అధ్యక్షులు అరవింద్ గోలి వారి సంస్థల గురించి క్లుప్తంగా చెప్పి, సభకు అందరినీ ఆహ్వానించారు. అట్లాంటా నివాసులు, ప్రముఖ అవధాని శ్రీ. నేమాని సోమయాజులు సంచాలకులుగా వ్యవహరించారు. సప్తఖండ అవధాన సార్వభౌమ పద్మాకర్ గారు సమస్యలో “భక్తిఁ గొల్వను వేంకటేశుని దాపురించును బాపముల్” అని యతిభంగంతో ఇచ్చిన సమస్యని సద్య్భక్తి అనిపూరించి యతి భంగంలేకుండా, అర్థభంగం కాకుండా చక్కగా పూరించారు.

అలాగే శవము, చితి, పాడు, కాడు అనే అమంగళకరమైన పదాలని ఉపయోగిస్తూ జన్మదిన వేడుకలని పూరించమంటే చక్కగా అన్యార్థాలలో పూరించారు. సముద్రాన్ని దాటడానికి ఆలోచిస్తున్న రామునికి సముద్రం దారి ఇవ్వకపోవడంతో కింకర్తవ్యమని మూడురోజులు దర్భాసనుడై తపస్సు చేసిన రాముని మనస్స్థితిని వర్ణించమంటే చాలా బాగా పద్యాన్ని అందించారు.

పత్యక్షరం నిషేధిస్తూ “నాటు నాటు” అంటూ ప్రపంచమంతా మార్మోగుతున్న తెలుగుభాష వైభవాన్ని వివరించమంటే, అలవోకగా పూరించారు. మొదటిపాదంలో 15వ అక్షరం “శి”, రెందవపాదంలో 9వ అక్షరం “వ” మూడవవ పాదంలో 2వ అక్షరం “ప”, నాల్గవపాదంలో 10వ అక్షరం “దం” ఉపయోగిస్తూ శివపదమహిమని విశదీకరించమంటే అనాయాసంగా ఉత్పలమాలలో పూర్తిచేసారు.

అలానే మూడు ఆవృత్తాలలో ముగ్గురు అడిగిన ఆశువులకు అత్యంగా వేగంగా పద్యాలని అందించి శ్రోతలని ముగ్ధులను గావించారు. పురాణ పఠనంలో కూడా మూడు ఆవృత్తాలలో ముగ్గురు అడిగిన పద్యాలకు అద్భుతమైన వివరణలనిస్తూ ఆయాసందర్భాలలో ఆ మహాకవులు వ్రాసిన సుదీర్ఘమైన వచనాలనికూడా వినిపించి తమ పురాణ విజ్ఞానాన్ని నిరూపించుకున్నారు.

మధ్య మధ్యలో అప్రస్తుత ప్రసంగి అడిగిన చిలిపి ప్రశ్నలకు కూడా హాస్యాస్పదమైన సమాధానలనిచ్చి ప్రేక్షకులని నవ్వించారు. ఈ రకంగా మొత్తం అవధానం అలవోకగా, ఆనందదాయకంగా పూర్తిచేసి అందరి మెప్పుకి పాత్రులయ్యారు. అవధాని గారిని, సంచాలకులను, పృచ్ఛకులను తామా మరియు హెచ్ టి ఏ వారు జ్ఞాపికలు, పుష్ప గుచ్చాలు మరయు దుశ్శాలువాలతో సగౌరవంగా సత్కరించారు.

భోజనాల సమయంలో అందరూ భారత దేశంలో జరిగే శుభకార్యాలను తలపించేలా జరిగింది అనుకోవటం, ఇలాంటివి మున్ముందు మరిన్ని జరగాలని కోరుకోవటం ఈ కార్యక్రమం ఏ పరిమాణంలో జరిగిందో చెప్పటానికి తార్కాణం. చివరిగా సాయిరామ్ అవధానాన్ని విజయవంతం చేసిన ఆహుతులకు, స్పాన్సర్లకు, వాలంటీర్లకు, హెచ్ టి ఏ టీంకు, తామా టీంకు ధన్యవాదాలు తెలియజేసి కార్యక్రమాన్ని ముగించారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected