కర్ణాటక ముఖ్యమంత్రిగా బీజేపీ నేత బసవరాజ బొమ్మై ఈరోజు ఎన్నికయ్యారు. తన తండ్రి ఎస్‌ఆర్ బొమ్మై గతంలో జనతాపార్టీ తరఫున కర్ణాటక రాష్ట్ర 11వ ముఖ్యమంత్రిగా పనిచేయడం విశేషం. గత్యంతరం లేని పరిస్థితుల్లో కన్నీటి పర్యంతం అవుతూ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన యడియూరప్ప బొమ్మై పేరును ప్రతిపాదించారు. బీజేపీ అధిష్ఠానం తరఫున పరిశీలకులుగా హాజరైన కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, కిషన్‌రెడ్డిలు నాయకత్వ మార్పును సాఫీగా జరిగేలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. లింగాయత్ సామాజిక వర్గానికే మళ్ళీ ముఖ్యమంత్రి పదవి దక్కినట్టయింది. ఆర్.అశోక్(వక్కలిగ), గోవింద కారజోళ(దళిత), బి.శ్రీరాములు (బోయ) ఉప ముఖ్యమంత్రులుగా ఎన్నికయ్యారు. రేపు బుధవారం ఉదయం 11 గంటలకు సీఎంగా బొమ్మైతో గవర్నర్ ప్రమాణస్వీకారం చేయించనున్నట్లు తెలుస్తుంది.