మైకు దొరికితే ‘మహిళా సాధికారత’ అంటూ ప్రతి ఒక్కరూ ఊక దంపుడు ఉపన్యాసాలతో నినాదాలు ఇస్తుంటారు. మరి ఆచరణలో ఆ నినాదాన్ని విధానపరంగా ప్రోత్సహిస్తున్నారా? అన్ని రంగాల్లో ఇది సాధ్యమేనా? ఇటువంటి ప్రశ్నలకు సమాధానాలతోపాటు మరెన్నో ఉపయోగకరమైన సూచనలు, సలహాలతో తన అనుభవాన్ని అందరితో పంచుకున్నారు మార్గదర్శి మరియు కళాంజలి సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ శైలజా కిరణ్.
జనవరి 29న ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ ఆధ్వర్యంలో మహిళా సాధికారతపై నిర్వహించిన వెబినార్లో మహిళా లోకానికి మార్గదర్శి డాక్టర్ శైలజా కిరణ్ ముఖ్య వక్తగా పాల్గొన్నారు. తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు పర్యవేక్షణలో తానా సాంస్కృతిక కార్యదర్శి శిరీష తూనుగుంట్ల సహకారంతో తానా మాహిళా సాధికారిత ఛైర్మన్ మాధురి ఏలూరి నిర్వహణలో ఈ వెబినార్ విజయవంతమైంది. తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు మాట్లాడుతూ తానా చేపట్టిన అనేక కార్యక్రమాలను వివరించారు. మహిళా సాధికారతను తానా ఒక ముఖ్య అంశంగా తన ఎజెండాలో ఉంచిందని, అందుకు తగిన ప్రాధాన్యత ఇస్తుందని తెలియజేశారు.
అనంతరం పూర్వ అధ్యక్షులు జయ శేఖర్ తాళ్లూరి మాట్లాడుతూ మన పురాణాల్లో స్త్రీ కి ఉన్న ప్రాధాన్యతను, శక్తి సామర్ధ్యములను ఉదాహరణగా వివరించారు. స్త్రీ ఔన్నత్యాన్ని చాటే తెలుగు పద్యాలను వినిపించి మెప్పించారు. తానా ఉపాధ్యక్షులు నిరంజన్ శృంగవరపు మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలకు తన సంపూర్ణ సహకారం ఉంటుందని తెలియజేస్తూ మహిళలు ఈనాడు ఎన్నో రంగాలలో ముందంజ వేస్తున్నారని, అటువంటి వారికి ఈ కార్యక్రమం మరింత ప్రేరణగా నిలుస్తుందని పేర్కొన్నారు. తానా సాంస్కృతిక కార్యదర్శి శిరీష తూనుగుంట్ల మాట్లాడుతూ ప్రాచీన కాలంలో స్త్రీలు ఎంతో ఉన్నత స్థానం లో ఉన్నారని, గార్గీ, మైత్రేయిలను ఉదాహరణగా పేర్కొన్నారు.
శైలజా కిరణ్ ముఖ్య వక్త గా ప్రసంగిస్తూ మహిళలకు సహజంగానే బహుముఖ సామర్ధ్యం ఉంటుందని చెప్పారు. దాని వల్ల సంక్షోభాలను ఎదుర్కొన్నప్పటికీ వ్యాపార, వాణిజ్యరంగాలలో మహిళలు తప్పక రాణిస్తారని తెలిపారు. ఉన్నత విద్య స్వతంత్ర భావాలను పెంపొందిస్తూ మంచిచెడుల విచక్షణా జ్ఞానాన్ని తెలియజెస్తుందని వివరిస్తూ, మహిళలకు విద్య తప్పనిసరి అన్నారు. అలాగే మహిళలు చేపట్టబోయే వాణిజ్య వ్యాపారాలకు సంబందించిన నైపుణ్యాన్ని అభ్యసించాలని సూచించారు. మార్గదర్శి సంస్థ అభివృద్ధిలో, వేలాది మంది సిబ్బందితో, లక్షలాదిమంది వినియోగదారులతో సాగించిన వ్యాపార అనుభవాలను వివరించారు. ఇలా మహిళా సాధికారతపై నినాదం నుంచి విధానం వరకు నిలువెత్తు నిదర్శనంగా సాగిన ఆమె ఉపన్యాసం ఆద్యంతం అందరినీ ఆకట్టుకుంది.
ఈ కార్యక్రమంలో తానా కార్యవర్గం మరియు వివిధ సభ్యులు పాల్గొనడమే కాకుండా చాలా మంది సామాజిక మాధ్యమాలలో వీక్షించారు. తానా పూర్వ మహిళా అధ్యక్షురాలు పద్మశ్రీ ముత్యాల మాట్లాడుతూ ఈ కార్యక్రమం పట్ల సంతోషాన్ని తెలియజేస్తూ ఆమెకు శైలజా కిరణ్ తో ఉన్న పూర్వ పరిచయాన్ని గుర్తు చేసుకున్నారు. అనంతరం ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని పద్మజ బెవర నిర్వహించారు. చివరిగా మాధురి ఏలూరి వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది.