Connect with us

Literary

తానా జ్ఞాన నేత్రులు, తెలుగు దివ్వెలు; అమ్మ భాషా సేవలో అంధ మేధావులు

Published

on

ఉత్తర అమెరికా తెలుగుసంఘం (తానా) సాహిత్య విభాగం తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ప్రతి నెలా ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న “నెల నెలా తెలుగు వెలుగు” కార్యక్రమంలో భాగంగా ఆదివారం, ఫిబ్రవరి 26న నిర్వహించన 45వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశం – “జ్ఞాననేత్రులు – తెలుగుదివ్వెలు” అమ్మ భాషా సేవలో అంధ మేధావులు అనే సాహిత్య కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర పాల్గొన్న అతిథులందరుకూ స్వాగతం పల్కుతూ వీరందరి మధ్య ఉన్న సారూప్యం దృష్టి లోపం కాదు, దూరదృష్టి అన్నారు. ఎన్ని ఉన్నా ఇంకా ఏదో లేదనుకుంటూ తమ జీవితాలను అంధకారబందురం చేసుకుంటున్న అసంతృప్తివాదులకు వీరి జీవితాలు వెలుగు బాటలు అని, తమ శక్తిని తాము తెలుసుకోలేక జీవితంలో ఇంకా ఏమీ చెయ్యలేమనే కృంగిపోతున్న నిరాశావాదులకు ఈ అతిథుల జీవితాలు స్ఫూర్తి పతాకలు అన్నారు. కేవలం కృషి, పట్టుదల, ఆత్మస్థైర్యం అనే లక్షణాలను ఆయుధాలుగా చేసుకుని జీవన పోరాటం చేస్తూ ఉన్నత శిఖరాలు అధిరోహిస్తున్న ఈ ధీరోదాత్తుల జీవితాలు అందరికీ కనువిప్పు అంటూ స్వాగతం పలికారు.

ఈ అంతర్జాల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఆర్. మల్లిఖార్జున రావు మాట్లాడుతూ ప్రతి నెలా వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తూ తెలుగు భాషా సాహిత్య సేవలో నిమగ్నమైన తానా ప్రపంచసాహిత్యవేదికకు అభినందనలు, అంధ మేధావులతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఎంతో ప్రత్యేకమైనది అన్నారు.

విశిష్ట అతిథులుగా ఆచార్య మన్నవ సత్యనారాయణ, పూర్వ తెలుగు శాఖాధ్యక్షులు, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (దుగ్గిరాల); ఆచార్య జక్కంపూడి మునిరత్నం నాయుడు, విశ్రాంత తెలుగు ఆచార్యులు, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం (తిరుపతి); డా. బొల్లా జ్యోత్స్న ఫణిజ, సహాయఆచార్యులు, ఆంగ్ల భాషావిభాగం, ఢిల్లీ విశ్వవిద్యాలయం (న్యూ ఢిల్లీ); డి.వి మోహన కృష్ణ, శాస్త్రీయసంగీత విద్వాంసులు (హైదరాబాద్), షాకీర్ మొహమ్మద్, అపార జ్ఞాపకశక్తి సంపన్నులు, వ్యక్తి వికాస శిక్షకులు (హైదరాబాద్); సత్యవాడ సోదరీమణులు – సత్యవాడ రఘునాథమ్మ, సత్యవాడ సూర్యకుమారి, రచయిత్రులు, గాయకురాళ్ళు (విశాఖపట్నం); డా. బెంకి రాఘవేందర్ రెడ్డి, ఉపాధ్యాయుడు (జడ్చర్ల); డా. చిక్కా హరీష్ కుమార్, రచయిత (మహబూబ్ నగర్); డా. చిన్నావుల వేంకట రాజారెడ్డి, ఉపాధ్యాయుడు (కర్నూలు); మోపూరు పెంచల నరసింహం, కవి (నెల్లూరు), పెండ్యాల గాయత్రి, ఉపాధ్యాయిని (సింగరాయకొండ); టింగిరికార్ వెంకటేశ్, వ్యాఖ్యాత, రచయిత (మహబూబ్ నగర్) పాల్గొన్నారు.

వీరు తెలుగు భాష పట్ల తమకున్న అపారమైన అభిమానాన్ని, వారు రచించిన కథా, కవితా సంపుటాలు, నవలల గురించి పంచుకుంటూ, వారి జీవితంలో ఎదురైన అవరోధాలను ఎదుర్కుంటున్న తీరు, తెలుగు భాషను పరిరక్షించి, పరివ్యాప్తం చేయడంలో తల్లిదండ్రులుగా, వ్యక్తులుగా, సంస్థలుగా, ప్రభుత్వ పరంగా ప్రతి ఒక్కరి భాద్యతను గుర్తుచేసి అందరికీ కనువిప్పు కల్గించారు.

తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ తన ముగింపు సందేశంలో ఈ నాటి సాహిత్య కార్యక్రమం మనిషి తలుచుకుంటే జీవితంలో సాధించలేనిది ఏదీ లేదు అనే నానుడికి ఈ విశిష్ట అతిథుల జీవితాలు ప్రత్యక్ష సాక్ష్యం అంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులందరికీ, కార్యక్రం విజయానికి తోడ్పడిన కార్యకర్తలకు, ప్రసార మాధ్యమాల నిర్వాహకులకు ధన్యవాదాలు అన్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected