Connect with us

Cultural

UAE Telugu Association: టాలీవుడ్ ప్రముఖుల మధ్య ఉగాది ఉత్సవాలు

Published

on

తెలుగు నూతన సంవత్సరాది ఉగాది పర్వదిన సందర్భంగా తెలుగు అసొసియేషన్-యూఏఈ వారు దుబాయి లోని “దుబాయ్ హైట్స్ అకాడెమీ” లో మార్చ్ 18 న సాయంత్రం “ఉగాది ఉత్సవాలు” ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగు అసోసియేషన్ తరఫున కల్చరల్ డైరెక్టర్ శ్రీ వక్కలగడ్డ వెంకట సురేష్ గారి ఆధ్వర్యంలో  ప్రముఖ యాంకర్ రవి, ఉష, శరణ్య సంధానకర్తలుగా వ్యవహరించారు.

కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా తెలుగు సినీ పరిశ్రమ నుంచి ప్రముఖ సంగీత దర్శకురాలు శ్రీమతి ఎం ఎం శ్రీలేఖ గారు, ప్రముఖ కథా నాయిక శ్రీమతి కామ్నా జెఠ్మలాని గారు, సినీ నిర్మాత రాజశేఖర వర్మ గారు, ప్రముఖ న్యాయమూర్తి మాధవ రావు పట్నాయక్ గారు విచ్చేశారు. ఎం ఎం శ్రీలేఖ గారు పాతిక సంవత్సరాల తన సినీ సంగీత ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా మొదలుపెట్టిన ప్రపంచ పర్యటన 25 దేశాలలో జరుపుకుంటున్నట్టుగా తెలిపారు. ఈ పర్యటనలో దుబాయ్ లో పర్యటించటం ఎంతో అనందానుభూతులను కలుగజేసినట్లు తెలిపారు.

ఎం ఎం శ్రీలేఖ గారు, యితర గాయనీమణులు మౌనిక యాదవ్, గాయకులు రవి, గజల్ వినోద్ లతో కలిసి ఆలపించిన బహుళ ప్రజాదరణ పొందిన సినీ మధుర గీతాలు ఆడిటోరియంలోని ప్రేక్షకులందరనీ వుర్రూతలూగించాయి. గజల్ వినోద్ అమ్మ తత్వం మీద, సెల్ ఫోన్ అంశంపై, తెలంగాణ లోని ప్రముఖ ప్రాంతాలపై  ఆలపించిన గజల్స్ అందరినీ ఆకట్టున్నాయి.

మిమిక్రీ కళాకారుడు రాజు ప్రదర్శించిన సినీ/రాజకీయ ప్రముఖుల అనుకరణ అందరినీ నవ్వుల్లో ఓలలాడించింది. మిమిక్రీ రాజు 8 నిమిషాల నిడివి వున్న సినీ సన్నివేశాల మాలికని ప్రదర్శిస్తూ, అందులో కనిపించిన 50 మంది గత/నేటి తరాల ప్రముఖ సినీ నటులను అనుకరించటం ఆహూతులందరినీ మంత్రముగ్ధులను చేసింది. మిమిక్రీ రాజు మొట్టమొదటి సారిగా యిటువంటి ప్రయత్నం చేయటం, సఫలీకృతం అవటం ఎంతో తృప్తినిచ్చినట్లు తెలిపారు.

తెలుగు అసోసియేషన్ తరపున జనరల్ సెక్రటరీ శ్రీ వివేకానంద్ బలుస గారు ప్రసంగించారు. సేవ, సంస్కృతి, సమైక్యత అనే మూడు మూల స్థంభాలపై స్థాపించిన తెలుగు అస్సోసిఏషన్ అతి తక్కువ కాలంలో 25 కి పైగా కార్యక్రమాలను యూఏఈలోని వివిధ ఎమిరేట్స్ లో విజయవంతంగా నిర్వహించటం గురించి వివరించారు.

యాంకర్ రవి తన చతుర సంభాషణలతో, సమయోచిత హాస్యంతో కార్యక్రమాన్ని ఎంతో ఆహ్లాదంగా నిర్వహించి, అందరి ప్రశంసలని పొందాడు. స్పాన్సర్లు మరియు దాతల పూర్తి సహాయ సహకారములతో ఉగాది ఉత్సవాలు ఘన విజయము పొందాయి. తెలుగు నూతన సంవత్సరాది తోటి తెలుగు వారితో కలిసి జరుపొనుటకు వచ్చిన షుమారు 1000 మందితో దుబాయ్ హైట్స్ అకాడెమీ క్రిక్కిరిసి పోయింది. 

యుఏఈలోని వివిధ ఎమిరేట్స్ (దుబాయి, షార్జా, రస్ అల్ ఖైమా) నుంచి వచ్చిన ప్రతిభావంతులైన చిన్నారి, యువ బృందములు చేసిన సంప్రదాయ, సినీ నృత్య ప్రదర్శనలతో అందరినీ ఆకర్షించారు. వ్యవస్థాపక సభ్యులు & బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, సంగీత దర్శకురాలు శ్రీమతి ఎం ఎం శ్రీలేఖ గారిని, కథా నాయిక శ్రీమతి కామ్నా జెఠ్మలాని, వేడుకల్లో ప్రదర్శన యిచ్చిన కళాకారులందరికీ శాలువా, ఙ్ఞాపిక లతో సత్కరించారు. ఇదే విధంగా తమ అద్భుత ప్రదర్శనలతో ఆకట్టున్న యూఏఈ స్థానిక చిన్నారులందరికీ ప్రశంసా పత్రాలను బహూకరించారు.

ఉగాది ఉత్సవాల కార్యక్రమము ఘనంగా జరుపుటకు సంపూర్ణ సహకారమందించిన స్పాన్సర్లు – సెయింట్ మార్టినస్ యూనివర్సిటీ-యూఎస్ఏ, హై గేట్స్ ఇంటర్నేషనల్ స్కూల్, సిల్వర్ స్యాండ్స్ ఎస్టేట్స్ అండ్ ఇన్ ఫ్రా, బిర్యానీస్ & కో, ట్రాన్స్ ఏషియా, హాక్ సెక్యూరిటీ సర్వీసెస్, సూపర్ జెట్ టూర్స్, ఫార్చ్యూన్ ఇన్,   మై దుబాయ్, ఫార్చ్యూన్ గ్రూప్ ఆఫ్ హోటెల్స్, ఇన్వెస్టర్ గ్రోవ్స్ ప్రైవేట్ లిమిటెడ్, గురు ప్రొడక్షన్స్, రవి మెలోడీస్. స్పాన్సర్స్ అందరినీ తెలుగు అస్సోసిఏషన్ తరపున శాలువా, ఙ్ఞాపిక లతో సత్కరించారు.

తెలుగు అసోసియేషన్ అద్యక్షుడు దినేష్ కుమార్ ఉగ్గిన గారు, ఉపాద్యక్షుడు మసిఉద్దీన్ గారు, ప్రధాన కార్యదర్శి వివేకానంద బలుసా గారు, కల్చరల్ డైరెక్టర్ వెంకట సురేష్ గారు, ఇంటర్నేషనల్ ఎఫైర్స్ డైరెక్టర్ సురేంద్ర ధనేకుల గారు, ఫైనాన్స్ డైరెక్టర్ మురళీ కృష్ణ నూకల గారు, కమ్యూనిటీ సర్వీసెస్ డైరెక్టర్ శ్రీ సాయి ప్రకాష్ సుంకు గారు, కమ్యూనిటీ డైరెక్టర్ రవి వుట్నూరి గారు, మార్కెటింగ్ డైరెక్టర్ అంబేద్కర్ గారు, లీగల్ డైరెక్టర్ శ్రీధర్ దామర్ల గారు కార్యక్రమానికి విచ్చేశారు.

ఆంధ్ర కళావేదిక, ఖతార్ నుండి వచ్చిన విక్రమ్ సుఖవాసీ గారు శ్రీలేఖ కార్యక్రమానికి సాంకేతిక సహకారం అందించారు. తెలుగు అసోసియేషన్ తరఫున వర్కింగ్ కమిటీల సభ్యులు ఫ్లోరెన్స్ విమల, సౌజన్య, విజయభాస్కర్,  ఫహీమ్, మోహన కృష్ణ, శరత్ చంద్ర, భీం శంకర్ కార్యక్రమ నిర్వహణ బాధ్యతలు చూసుకున్నారు. మీడియా భాగస్వామ్యులుగా వ్యవహరించిన TV9, TV5 News, NRI2NRI.COM, మా గల్ఫ్, రేడియో ఖుషీ, హైదరాబాద్ సమయ్ ఉగాది ఉత్సవాలు కార్యక్రమానికీ తమ పూర్తి సహకారమందించారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected