Connect with us

Government

టెక్సాస్ లో ఉగాది పండుగని తెలుగు భాషా వారసత్వ దినంగా గవర్నర్ ప్రకటన

Published

on

ఏప్రిల్ 2, డాలస్: టెక్సాస్ రాష్ట్రంలో తెలుగు వారికి రాష్ట్ర గవర్నర్ చే ప్రత్యేక గుర్తింపు దక్కింది. శ్రీ శుభ కృత్ నామ తెలుగు నూతన సంవత్సర ఉగాది పర్వదిన సందర్భంగా టెక్సాస్ రాష్ట్ర గవర్నర్ గ్రెగ్ అబ్బాట్ ఏప్రిల్ 2, 2022 వ తేదీని “తెలుగు భాషా వారసత్వ దినం” గా ప్రకటిస్తున్నట్లు తెలియజేస్తూ ప్రముఖ ప్రవాస భారతీయ నాయకులు, ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్ అధ్యక్షులు దా. ప్రసాద్ తోటకూర కు గవర్నర్ అబ్బాట్ అధికారిక ప్రకటన ప్రతిని అందజేశారు.

“టెక్సాస్ రాష్ట్రంలో వివిధ నగరాలలో నివశిస్తున్న లక్షలాది తెలుగు కుటుంబాల వారు విభిన్న సంస్కృతుల వారితో మమేకమవుతూ విద్య, వైద్య, వాణిజ్య, ప్రభుత్వ, కళా రంగాలలో తెలుగువారు పోషిస్తున్న పాత్ర మరువలేనిదన్నారు. తెలుగు వారికున్న క్రమశిక్షణ, కుటుంబ విలువల పట్ల గౌరవం, వృత్తిపట్ల నిభద్దత, విద్య పట్ల శ్రద్ధ ఇతరులకు ఆదర్శప్రాయం అన్నారు. టెక్సాస్ రాష్ట్రంలో తెలుగు భాష మాట్లాడే వారి సంఖ్య నానాటికీ పెరుగుతోందని వారు తమ అస్తిత్వాన్ని నిలబెట్టుకుంటూనే రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాలని ఆ అధికారిక ప్రకటనలో పిలుపునిచ్చారు”.

దా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “టెక్సాస్ రాష్ట్రంలో చిరకాలం గా నివశిస్తున్న తెలుగు వారి పట్ల ప్రత్యేక గౌరవం, శ్రద్ధ చూపుతూ టెక్సాస్ రాష్ట్ర గవర్నర్ తన శ్రీమతి సిసీలియా తో కలసి తెలుగు వారి ముఖ్యమైన పండుగ ఉగాదిని “తెలుగు భాషా వారసత్వ దినంగా” ప్రకటించడం రాష్ట్ర చరిత్రలో ఇది తొలిసారని, తెలుగు వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసినందులకు టెక్సాస్ రాష్ట్ర తెలుగు ప్రజలందరి తరపున గవర్నర్ దంపతులకు మా హృదయపూర్వక ధన్యవాదాలు” అన్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected