అట్లాంటా తెలుగు సంఘం ‘తామా’ (Telugu Association of Metro Atlanta) కార్యాలయంలో భారత 74 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు 2023 జనవరి 26న వైభవంగా జరిగాయి. చల్లటి వాతావరణంలో కూడా దాదాపు 70 మందికి పైగా పురజనులు ఈ కార్యక్రమానికి విచ్చేసి తమ దేశ భక్తిని, అభిమానాన్ని చాటుకున్నారు.
తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా (TAMA) కోశాధికారి సునీత పొట్నూరు (Suneetha Potnuru) అందరినీ సగౌరవంగా ఆహ్వానించారు. తదుపరి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రముఖ ఆంట్రప్రెన్యూర్లు, సంఘ పెద్దలు విజు చిలువేరు (Viju Chiluveru), మోహన్ దేవు (Mohan Devu) జెండా వందనం గావించారు.
అందరూ జాతీయ గీతం ఆలపించి, జెండా వందనం చేసి భారత దేశంపై వారికి వున్న గౌరవాభిమానాలు తెలియజెప్పారు. జైహింద్, భారత్ మాతా కీ జై వంటి నినాదాలతో ప్రాంగణం అంతా హోరెత్తింది. అతిథులు గణతంత్ర దినోత్సవం (Republic Day) ప్రాధాన్యత గురించి వివరించి తమ అనుభవాలను పంచుకున్నారు.
ఎంతో మంది చిన్నపిల్లలు రావడం చూసి, వీరే మన భవిష్యత్తు అని చెబుతూ వారు తెలుసుకోవలసిన విషయాలు విశదీకరించారు. చాలా మంది పిల్లలు రిపబ్లిక్ డే అంటే ఏంటి అని తెలుసుకోవడం గమనార్హం. ఈ పండుగ సందర్భంగా తామా కార్యాలయాన్ని దేశ నాయకుల చిత్రపటాలతో, జెండాలతో, మువ్వన్నెల తోరణాలతో అందంగా అలంకరించారు.
తామా అధ్యక్షులు సాయిరామ్ కారుమంచి (Sairam Karumanchi) మాట్లాడుతూ 2012 నుంచి తామా జాతీయ పండుగలు క్రమం తప్పకుండా చేస్తోందని తెలిపి ఈ సర్వోత్తమ కార్యక్రమానికి విచ్చేసినందుకు అందరికీ కృతజ్ఞతాభినందనలు తెలిపారు. గణతంత్ర దేశంగా ఎలా అవతరించిందీ మరియు స్వాతంత్ర పోరాటానికి సంబంధించిన ప్రశ్నలు అడిగి గెలిచిన వారికి బహుమతులు అందజేశారు.
ఇంతమంది కలిసి ఇలా మన జాతీయ పండుగను చేసుకోవడం ప్రశంసనీయమనీ, ఈ కార్యక్రమం భారతదేశంలో చిన్నప్పుడు తమ బడులలో జరిగినట్లు ఉందనీ చర్చించుకుంటూ ఆ రోజులను తామా వారు తమకు గుర్తు చేసినందుకు అభినందించారు.
అందరికీ అల్పాహారం, తేనీరు, మిఠాయిలు మరియు మంచినీరు అందజేశారు. చివరిగా ఈ కార్యక్రమాన్నివిజయవంతం చేసిన ఆహుతులందరికీ, తామా జట్టుకీ, సహాయం చేసిన వారికీ తామా ఉపాధ్యక్షులు సురేష్ బండారు (Suresh Bandaru) ధన్యవాదాలు తెలియజేసి ముగించారు.