తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అమెరికా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మశాచుసెట్స్ రాష్ట్రంలోని బోస్టన్ నగరంలో జరుగుతున్న గ్లోబల్ ఇన్నోవేషన్ హెల్త్ కేర్’ సదస్సులో కేటీఆర్ మశాచుసెట్స్ రాష్ట్ర గవర్నర్ చార్లీ బేకర్‌తో సమావేశమయ్యారు.
మార్చి 25 న నిర్వహించిన ఈ సదస్సులో హైదరాబాద్‌లో పెట్టుబడులకు కేటీఆర్ ఆహ్వానించగా, గవర్నర్ చార్లీ సానుకూలంగా స్పందించారు. అంతేకాకుండా హైదరాబాద్, బోస్టన్ నగరాల మధ్య ఉన్న సారూప్యతను గుర్తు చేసారు. ఈ సందర్భంగా కేటీఆర్ గవర్నర్ చార్లీ ని శాలువా, మెమెంటోతో సత్కరించారు.
అనంతరం కేటీఆర్ సౌత్ బోరో సిటీలోని నిర్వాణ హెల్త్ ఆఫీసును సందర్శించారు. అక్కడ ప్రముఖ ప్రవాస తెలుగు నేతలు శశికాంత్ వల్లేపల్లి, శ్రీనివాస్ గుత్తికొండ, అలాగే ప్రఖ్యాత యాపిల్ కంపెనీ మాజీ సీఈఓ జాన్ స్కల్లీ, నిర్వాణ హెల్త్ సీఈఓ రవి ఐకా మరియు రుద్రమ్మ పగిడిపాటి తదితరులతో సమావేశమయ్యారు. తెలంగాణకు పెట్టుబడులను ఆహ్వానించేలా కేటీఆర్ పలు సమావేశాలకు హాజరవుతున్నారు.