ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ న్యూయార్క్ టీం ఆధ్వర్యంలో భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు గత శనివారం ఘనంగా జరిగాయి. స్థానిక నాసౌ కౌంటీ ఎగ్జిక్యూటివ్ లారా కర్రన్ ముఖ్య అతిధిగా పాల్గొన్న భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రవాస భారతీయులు ముఖ్యంగా తెలుగువారు ఎక్కువగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మహిళల కొసం ప్రత్యేకంగా త్రోబాల్, టగ్ ఆఫ్ వార్, రింగ్ లాంటి క్రీడలు నిర్వహించారు. మహిళలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న ఈ పోటీలలో గెలిచినవారికి జ్ఞాపికలుఅందజేశారు.
భారతీయ మరియు అమెరికా జాతీయగీతాలను శృతి ఆలపించారు. ముఖ్య అతిధి లారా కర్రన్ జండావందనం గావించి సభికులనుద్దేశించి ప్రసంగించారు. తానా చేస్తున్న వివిధ సేవాకార్యక్రమాలను కొనియాడుతూ ఇంకా కొనసాగించాలంటూ తను మొదలుపెట్టిన ఏషియన్ అమెరికన్ కౌన్సిల్ కి పరిచయం చేసారు. తదనంతరం స్థానిక రాజకీయవేత్త మరియు వ్యాపారవేత్త రాగిణి శ్రీవాత్సవ తానా న్యూయార్క్ టీంని అభినందించారు.
చివరిగా తానా న్యూయార్క్ ప్రాంతీయ కార్యదర్శి దిలీప్ ముసునూరు మాట్లాడుతూ తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు మరియు ఉపాధ్యక్షులు నిరంజన్ శృంగవరపు మద్దతుతో ముందు ముందు ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలను నిర్వహిస్తామని, అలాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం అవ్వడంలో సహకరించిన తానా న్యూయార్క్ టీం మరియు హాజరైన సభికులకు కృతజ్ఞతలు తెలియజేసారు.