Connect with us

Conference

జయహో తానా; 2023లో 23వ మహాసభలకు ఘనమైన ముగింపు

Published

on

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) 23వ మహాసభలు ఘనంగా ముగిశాయి. ఫిలడెల్ఫియా (Philadelphia) మహానగరంలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్‌ సెంటర్‌లో 3 రోజులపాటు అత్యంత వైభవంగా విభిన్న కార్యక్రమాలతో తానా కన్వెన్షన్ విజయవంతమయ్యింది.

మొదటి రెండు రోజుల లానే చివరి రోజైన జులై 9 ఆదివారం రోజున కూడా శుభప్రదంగా ప్రారంభించారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారి శ్రీనివాస కళ్యాణం కనులవిందుగా జరిగింది. పూజ అనంతరం శాస్త్రోక్తంగా తీర్ధ ప్రసాదాలు అందించారు.

వ్యవసాయ సదస్సు, జొన్నవిత్తుల గారి బహుజనశతకం, తెలంగాణ రాజకీయ ఫోరమ్, తెలంగాణ ఎంపీ రేవంత్ రెడ్డి, ఆస్కార్ విజేత చంద్రబోస్ తో ఆత్మీయ సమావేశాలు, ఎన్నారై టీడీపీ సమావేశం, తానా జనరల్ బాడీ మీటింగ్, ధీం-తానా సింగింగ్, డాన్స్, బ్యూటీ పాజెంట్ ఫైనల్ పోటీలు వివిధ మీటింగ్ రూమ్స్ లో నిర్వహించారు.

అలాగే గోదావరి, కృష్ణా, రాయలసీమ జిల్లాల ఎన్నారై మరియు వివిధ కాలేజీల సమావేశాలు, సెలబ్రిటీస్ తో మాటా మంతి, స్టార్ట్ అప్ బిజినెస్ సెమినార్, రీల్స్ & షార్ట్ ఫిలిమ్స్ పోటీలు, ఐటీ సర్వ్ సమావేశం, కెరీర్ ఫెయిర్, ఈషా ఫౌండేషన్ మరియు హార్ట్ఫుల్నెస్ కూడా నిర్వహించారు.

కృష్ణా ఎన్నారై సమావేశంలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి డా. నూతలపాటి వెంకట రమణ ని సన్మానించారు. నిన్న భోజనాల దగ్గిర కొంచెం గడబిడ అవ్వడంతో ఈరోజు పక్కా ప్లానింగ్ తో ఫుడ్ మరియు సెక్యూరిటీ కమిటీ వారు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.

సాయంత్రం మెయిన్ వేదికపై తెలుగు సంస్కృతీసంప్రదాయాలకు సంబంధించిన కల్చరల్ ప్రోగ్రామ్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ (NTR) పై ప్రదర్శించిన ‘జయహో, జయజయహో తారకరామా’ ప్రత్యేక కార్యక్రమం అన్నికంటే హైలైట్.

రెండు ఫ్యాషన్ షోలూ అలరించాయి. తెలుగు సినిమా సీనియర్ నటులు మురళీ మోహన్ తెలుగు సంస్కృతీ సంప్రదాయాలకు చేసిన సేవలను గుర్తిస్తూ తానా-ఎన్టీఆర్ అవార్డును నందమూరి బాలక్రిష్ణ (Nandamuri Balakrishna) చేతుల మీదుగా అందించారు.

సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి డా. నూతలపాటి వెంకట రమణ (Nuthalapati Venkata Ramana) ని ఘనంగా సన్మానించారు. అలాగే కోవిడ్ వ్యాక్సిన్ ‘కొవాక్సిన్’ (Covaxin) ప్రధాత, భారత్‌ బయోటెక్‌ (Bharat Biotech) వ్యవస్థాపకులు & చైర్మన్‌ కృష్ణ ఎల్ల (Krishna Ella) కి తానా లైఫ్‌టైం అచీవ్‌మెంట్ అవార్డును అందించారు.

ధీంతానా మహిళా బృందాన్ని, జానీ నిమ్మలపూడి, రేవంత్ రెడ్డి సహా పలువురు రాజకీయ, సినీ నటీనటులను సన్మానించారు. బాలయ్య (Nandamuri Balakrishna) సినీ కెరీర్ కి సంబంధించి చేసిన మెడ్లి డాన్స్ అనంతరం వేదికపైకి ఆహ్వానించి సతీసమేతంగా సత్కరించారు. ఈ సందర్భంగా బాలయ్య సభనుద్దేశించి ప్రసంగించారు.

తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు మరియు కాన్ఫరెన్స్‌ కన్వీనర్‌ రవి పొట్లూరి కలిసి 23వ మహాసభల వివిధ కమిటీల సభ్యులను వేదికపైకి పిలిచి అభినందించారు. ప్రెసిడెన్షియల్ స్పెషల్ రికగ్నిషన్ అవార్డులు అందుకున్న వారిలో అట్లాంటా నుంచి ప్రముఖ వాలంటీర్ రామ్ మద్ది ఉన్నారు.

తానా సభల చివరి రోజునే అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు పదవీ కాలం కూడా ముగిసింది. ఈ సందర్భంగా అంజయ్య తన హయాంలో నెలకొల్పిన రికార్డ్స్, సేవలపై ప్రసంగించారు. ఈ క్రమంలో తానా నూతన అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు బాధ్యతలు తీసుకున్నారు. నిరంజన్ 2023 – 2025 కి తానా అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తారు.

అనంతరం సంగీత రారాజు మ్యూజిక్‌ మేస్ట్రో ఇళయరాజా మ్యూజికల్ నైట్ కార్యక్రమం తెలుగు సంగీత ప్రేమికులను మంత్రముగ్ధులను చేసింది. ఇళయరాజా ట్రూప్ లోని సింగర్స్ సునీత, మనో మరియు ఇతరులతో కలిసి పాత పాటలను వినసొంపుగా పాడి తానా 23వ మహాసభలను ఘనంగా ముగించారు.

ఇంత వైభవంగా తానా చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా 23వ మహాసభలు నిర్వహించిన తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు, కాన్ఫరెన్స్‌ కన్వీనర్‌ రవి పొట్లూరి, కాన్ఫరెన్స్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌ లావు మరియు వివిధ కమిటీల సభ్యులను ప్రత్యేకంగా అభినందించాలి.

మరిన్ని ఫోటోల కొరకు www.NRI2NRI.com/Day 3 In 23rd TANA Convention in Philadelphia ని సందర్శించండి.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected