Connect with us

Cricket

100 జట్లు, 1500 ఆటగాళ్లు, 20 వేల రన్స్ తో తానా జాతీయ క్రికెట్ ఛాంపియన్షిప్ కి అద్వితీయమైన ముగింపు

Published

on

. తానా చరిత్రలో మొదటిసారి జాతీయ క్రికెట్ టోర్నమెంట్
. గ్రాండ్ కిక్ ఆఫ్ & ఫైనల్స్ ఇన్ చార్లెట్
. 100 జట్లు, 1500 ఆటగాళ్లు, 20 వేల రన్స్
. 6 నెలలపాటు యువతేజం శశాంక్ కార్యదక్షత
. ప్రాంతీయ కార్యదర్సుల అసమాన తోడ్పాటు
. విజేతలు 10 వేలు, రన్నర్స్ 5 వేలు ప్రైజ్ మనీ కైవసం

క్రికెట్! ఈ మాట వినగానే భారతీయ మూలాలున్న ప్రతి ఒక్కరూ అది అమెరికా అయినా అమలాపురం అయినా కేరింతలు కొడతారు. కొందరు ఆడి, ఇంకొందరు చూసి, మరికొందరు క్రికెట్ టోర్నమెంట్స్ నిర్వహించి ఆస్వాదిస్తారు. ఇలా పిల్లల్లోను, పెద్దల్లోనూ క్రికెట్ మ్యానియా ఎక్కువే.

అలాంటి నిర్వాహకుల్లో ఒకడిగా ముందడుగు వేసి, అందరి మద్దతు కూడగట్టి ‘అలా అమెరికాపురంలో’ అన్నట్టు తానా జాతీయ క్రికెట్ ఛాంపియన్షిప్ కి శ్రీకారం చుట్టారు తానా క్రీడా కార్యదర్శి శశాంక్ యార్లగడ్డ. స్వతహాగా ఫుట్బాల్ క్రీడాకారుడు అవడంతో క్రీడల నిర్వహణలో ఉన్న లోటు పాట్ల అవగాహన ఉండడం కలిసొచ్చింది.

ఈ యువతేజం అనుకున్నదే తడవుగా 2022 ఫిబ్రవరి నెలలో జాతీయ క్రికెట్ ఛాంపియన్షిప్ కి బీజం వేయడం, మార్చి నెలలో ప్రణాళిక రచించడం, చక చకా ఏప్రిల్ నెలలో అపలాచియన్ రీజియన్ లోని నార్త్ కెరొలీనా రాష్ట్రం, చార్లెట్ నగరంలో గ్రాండ్ కిక్ ఆఫ్ తో సంచలనం సృష్టించడం శశాంక్ కార్యదక్షతను చాటింది.

ఏప్రిల్ నుంచి ఆగష్టు వరకు వివిధ తానా రీజియన్స్ లో స్థానిక ప్రాంతీయ కార్యదర్సులు నాగ పంచుమర్తి, సతీష్ కొమ్మన, ప్రదీప్ కుమార్ గడ్డం, నాని వడ్లమూడి, శ్రీనివాస్ ఉయ్యూరు, దిలీప్ కుమార్ ముసునూరు, రత్న ప్రసాద్ గుమ్మడి ఆధ్వర్యంలో తమ సిటీ, రీజియన్ స్థాయి పోటీలను నిర్వహించారు.

సిటీ స్థాయిలో, రీజియన్ స్థాయిలో, చివరిగా జాతీయ స్థాయిలో నాకౌట్ ఫార్మాట్లో పోటీపడేలా కసరత్తు చేసిన ఈ ఛాంపియన్షిప్, భూమి గుండ్రంగా ఉన్నట్లు అపలాచియన్ రీజియన్ చార్లెట్ లో మొదలై అన్ని రీజియన్లు తిరిగి చివరకు గ్రాండ్ ఫైనల్ కు కూడా చార్లెట్ నే చేరుకుంది.

ఒక రకంగా చెప్పాలంటే మొత్తం జాతీయ స్థాయి తానా క్రికెట్ ఛాంపియన్షిప్ కి మార్గదర్శన చేసిన కర్టెన్ రైజర్ ఈవెంట్ లాంటి గ్రాండ్ కిక్ ఆఫ్ మరియు ఫైనల్స్ నిర్వహణలో మంచి సామర్ధ్యాన్ని చూపిన తీరును చూస్తే అపలాచియన్ రీజియన్ ప్రాంతీయ కార్యదర్శి నాగ పంచుమర్తి సారధ్యంలోని తానా జట్టు ఎంత బలంగా ఉందో తెలుస్తోంది.

నాలుగు రోజుల ముందుగానే షెడ్యూల్ రిలీజ్ చేయడంతో జట్లన్నీ సెప్టెంబర్ 2 శుక్రవారం రాత్రికే చార్లెట్ చేరుకున్నాయి. సెప్టెంబర్ 3, 4 తేదీల్లో నిర్వహించిన జాతీయ స్థాయి పోటీలు హోరాహోరీగా సాగాయి. శనివారం లీగ్ మ్యాచ్ల అనంతరం ఆదివారం చార్లెట్ బిందాజ్ బాయ్స్ జట్టు, ఒహాయో వాలీ ఐసీసీ జట్టు ఫైనల్స్ లో పోటీపడ్డాయి.

చివరకు బిందాజ్ బాయ్స్ జట్టుని విజయం వరించడంతో ఐసీసీ జట్టు రన్నర్స్ గా మిగిలిపోయింది. ఈ సందర్భంగా చార్లెట్ బిందాజ్ బాయ్స్ కు మద్దతుగా డ్రమ్స్, డీజే, షాంపేన్ తో ఛీర్ చేశారు. టోర్నమెంట్ ఆసాంతం అందరూ తానా మరియు స్పాన్సర్ ఏజి ఫిన్ టాక్స్ వారి జెర్సీలు ధరించి సందడి చేశారు.

క్రికెట్ అభిమానుల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న తానా క్రికెట్ ఛాంపియన్షిప్ కి జాతీయ టైటిల్ స్పాన్సర్ గా వ్యవహరించడానికి ఏజి ఫిన్ టాక్స్ అధినేత అనిల్ గ్రంధి అడిగిన వెంటనే ముందుకు రావడాన్ని అభినందించాలి. ఈ స్పాన్సర్షిప్ విషయంలో ఠాగూర్ మల్లినేని సహాయం గర్హనీయం.

ఈ క్రికెట్ ఛాంపియన్షిప్ నిర్వహణ మొత్తంలో రాజ్ యార్లగడ్డ, వేణు చావా, రవి పోట్ల, వెంకట్ బొమ్మ, రాజేష్ చెరుకుపల్లి, సలీం షేక్, యమున మన్నవ, మహేష్ బొల్లిముత్, శ్రీధర్ పెళ్లూరు, వెంకీ అడుసుమిల్లి మరియు హర్షద్ రెడ్డి ల సహకారం మరువలేనిది.

మొత్తంగా సుమారు 6 నెలలపాటు 100 జట్లకు పైగా అమెరికా అంతటా పోటాపోటీగా తలపడగా చార్లెట్ బిందాజ్ బాయ్స్ జట్టు విజేతగా నిలిచి 10 వేల ప్రైజ్ మనీ తోపాటు ట్రోఫీ ని కైవసం చేసుకుంది. అలాగే ఒహాయో వాలీ ఐసీసీ జట్టు 5 వేల ప్రైజ్ మనీ తోపాటు రన్నర్స్ ట్రోఫీ ని కైవసం చేసుకుంది. ఫైనల్స్ లో ధీరజ్ సోని మరియు డీజే సెంచరీలు కొట్టడం కొసమెరుపు.

తానా లీడర్షిప్ నుంచి ఫౌండేషన్ ఛైర్మన్ వెంకట రమణ యార్లగడ్డ, కమ్యూనిటీ సర్వీసెస్ కోఆర్డినేటర్ రాజా కసుకుర్తి, మెంబర్షిప్ బెనిఫిట్స్ కోఆర్డినేటర్ శ్రీని యలవర్తి, ఒహాయో వాలీ ప్రాంతీయ కార్యదర్శి నాని వడ్లమూడి, విమెన్ ఎంపవర్మెంట్ ఛైర్ మాధురి ఏలూరి తదితరులు ఫైనల్స్ కి చార్లెట్ వచ్చి వెన్ను తట్టి నిలబడ్డారు.

అలాగే ఫైనల్స్ నిర్వహణలో తానా చార్లెట్ వాలంటీర్స్ సంతోష్, ప్రణయ్, నాయుడు, ప్రశాంత్, సుధీర్, రంగనాథ్, రఘు వేమూరి, సాయి కిలారు, సునీల్ బత్తిన, అశ్విన్ గూడూరు, చందు బాచు, మణి, రమేష్ అల్లేని, సురేష్ పోలిశెట్టి, శ్రీనాథ్, కార్తీక్ మండవ, యాంకర్ శ్రావ్య మానస, పిల్లలు వెంకట కోట హనిష్క్ చెర్లంచెర్ల మరియు శ్రేయాస్ పోలిశెట్టి ల సహకారం అభినందనీయం.

ఓవరాల్గా తానా చరిత్రలో మొట్టమొదటిసారి జాతీయ స్థాయిలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం, అందునా హై స్టాండర్డ్స్ మైంటైన్ చేస్తూ నెలల తరబడి సమయం కేటాయించి అద్వితీయమైన విజయం సాధించడంతో తానా క్రీడా కార్యదర్శి శశాంక్ యార్లగడ్డ ని యూ ఆర్ సెటింగ్ ది బార్ హై అంటూ తానా సభ్యులు అభినందిస్తున్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected