Connect with us

Patriotism

ఇండియా డే పరేడ్ లో ఆకట్టుకున్న సిలికానాంధ్ర శకటం: Fremont, California

Published

on

ఉత్తర కాలిఫోర్నియా లోని ఫ్రీమాంట్ నగరంలో FOG (Festival of Globe) సంస్థ ఆధ్వర్యంలో 75వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఆగష్టు 20న ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా ఆదివారం ఉదయం అనేక స్థానిక భారతీయ సాంస్కృతిక సంస్థలు తమ తమ రాష్ట్రాల సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేట్టుగా ముస్తాబు చేసిన శకటాలను నగర వీధుల్లో ఊరేగించారు. తొలిసారిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిలికానాంధ్ర తమ శకటానికి జడ్జెస్ ఛాయిస్ అవార్డును కూడా గెలుచుకుంది.

సిలికానాంధ్ర శకటం తెలుగు రాష్ట్రాల భాష సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేట్టుగా అలంకరించబడింది. శకటం మధ్యలో బంగారు రంగులో మెరుస్తున్న గుడి గోపురం లో నటరాజ స్వామి కొలువు తీరగా ఆ స్వామి ముందు కూచిపూడి నాట్యం చేస్తున్న నర్తకీమణి కనిపిస్తుంది. దానికి ఒక పక్క మువ్వన్నెల భారతీయ పతాకం రెపరెపలాడింది.

మరోవైపు తెలుగు అక్షరమాలతో అందంగా అలంకరించబడిన సింహాసనం లో అక్షర రాజు కూర్చొని ఉండగా వారి ముందు జాతీయ పతాకాన్ని పట్టుకున్న చిన్నారులతో అమెరికాలో రాబోయే తరంలో కూడా తెలుగు భాషకు, భారతీయ సంప్రదాయానికి ఢోకా లేదని చాటుతున్నట్టుగా కనిపించింది. అంతేకాకుండా శకటానికి రెండు పక్కలా పోచంపల్లి జనార్ధన్ సౌజన్యంతో తీర్చిదిద్దబడిన తెలుగు కళారూపాలు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి.

సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షులు కూచిబొట్ల ఆనంద్ భారత జాతీయ పతాకం చేతబట్టి భారత్ మాతాకీ జై అంటూ ముందు నడుస్తుండగా, గుర్రాలుగా అలంకరించుకున్న చిన్నారుల వెనుక సిలికానాంధ్ర సైనికులు రెండు వరసలుగా నడిచి వస్తూ సిలికానాంధ్ర రథాన్ని వీధుల్లో ఊరేగించారు.

అంబా పరాకు తో మొదలై, పలు జానపద గీతాలకు, మైసమ్మ పాటలకు కు సిలికానాంధ్ర ఆడపడుచులు చేసిన నృత్యాలు ప్రేక్షకులతో చప్పట్లు కొట్టించాయి. వేదుల స్నేహ లంబాడి అలంకరణ మరియు సిలికానాంధ్ర ఉపాధ్యక్షుడు కొండిపర్తి దిలీప్ పోతరాజు వేషం ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయి. వేడుక చూడటానికి వచ్చిన వందలాది ప్రవాస భారతీయులు, భారత్ మాతాకీ జై అంటూ చేసిన నినాదాలతో ఫ్రీమాంట్ నగరం మారుమ్రోగిపోయింది.

ఉరేగింపు అనంతరం జరిగిన సభలో సిలికానాంధ్ర శకటానికి జడ్జెస్ ఛాయిస్ అవార్డును ప్రకటించినప్పుడు, కూచిభొట్ల ఆనంద్ FOG నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఆజాదీ కి అమృత్ మహోత్సవ్ గా జరుపుకుంటున్న ఈ 75 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం, సంస్థ తరఫున అవార్డును అందుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఈ శకట నిర్మాణానికి నాయకత్వం వహించిన కందుల సాయి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

ఈ కార్యక్రమం విజయవంతం అవ్వడానికి సిలికానాంధ్ర కార్యకర్తలు సంగరాజు దిలీప్, పరిమి శివ, తనారి గిరి, అయ్యగారి శాంతివర్ధన్, లొల్ల మురళి, సింహాద్రి కిరణ్, కూచిభొట్ల శాంతి తదితరులు విశేష కృషి చేశారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected