జూన్ 28, 1921లో జన్మించిన పీవీ నరసింహారావు బహుభాషావేత్త. తెలుగువారి కీర్తిని దేశవ్యాప్తి చేసిన అసాధారణ ప్రతిభాశాలి. భారతదేశ ప్రధానమంత్రి పదవిని అధిష్టించిన ఒకే ఒక్క తెలుగు బిడ్డ. భారత ఆర్ధిక వ్యవస్థలో విప్లవాత్మక ఆర్థిక సంస్కరణల రూపకర్త. 1957లో శాసనసభ్యుడిగా రాజకీయ జీవితం ఆరంభించి దేశ ప్రధాని పదవిని చేపట్టడం తెలుగువారందరికీ గర్వకారణం. స్వయంగా ఎన్నో పుస్తకాలు రాశారు, సాహిత్య స్ఫూర్తి ఉన్నవారు. ఆయనకున్న 800 ఎకరాల భూమిని ప్రజలకు ధారాదత్తం చేసిన నిగర్వి. విద్యా శాఖ మంత్రిగా ఉన్నప్పుడే గురుకుల, నవోదయ పాఠశాలలు స్థాపించారు. మాజీ ప్రధాని మన్‌మోహన్ సింగ్ కూడా పీవీని తన గురువుగా పేర్కొంటారు. పీవీ నాయకత్వం, దూరదృష్టి దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి అభివృద్ధి పథం వైపు నడిపించాయి. మాతృభాషలోనే ప్రాథమిక విద్యాబోధన జరగాలని పీవీ ఆకాంక్షించారు.