ఉత్తర అమెరికా తెలుగు సంఘం “తానా” నూతన అధ్యక్షునిగా లావు అంజయ్య చౌదరి జులై 10న బాధ్యతలు చేపట్టారు. లావు అంజయ్య చౌదరి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన తానా రాజ్యాంగంపట్ల అంతఃకరణ శుద్ధితో అంటూ అట్టహాసంగా ప్రమాణస్వీకారం చెయ్యాల్సి ఉండగా, హంగు ఆర్భాటం నచ్చని అంజయ్య నిరాడంబరంగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎన్నారై2ఎన్నారై.కామ్ ప్రత్యేక కథనం.
అంజయ్య కుటుంబ నేపధ్యం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా పెద్దఅవుటుపల్లి గ్రామంలో లావు సాంబశివరావు – శివరాణి దంపతులకు 1971 మార్చి 27 న అంజయ్య చౌదరి జన్మించారు. తండ్రి వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగిగా విశాఖపట్నం లో పనిచేయడం వలన అంజయ్య చౌదరి చిన్నతనంలోనే బాబాయి లావు రంగారావు, పిన్నమ్మ కోటేశ్వరమ్మ ల సంరక్షణలో పెరిగారు. ప్రాథమిక విద్యాభ్యాసమంతా గన్నవరం లోని సెయింట్ జాన్స్ హైస్కూల్లోనూ, ఇంటర్మీడియట్ విజయవాడలోని గౌతమి రెసిడెన్షియల్ కళాశాలలో, తరువాత ఉన్నత విద్య బీటెక్ బళ్ళారి లోను, ఎంటెక్ గుల్బర్గా కళాశాలలో పూర్తిచేశారు. 1997 లో అనకాపల్లి కి చెందిన నటాషా తో వివాహం జరిగింది. అంజయ్య కి ఇద్దరు సంతానం. కుమారుడు శ్రీకాంత్ చౌదరి, కుమార్తె అక్షిణ శ్రీ చౌదరి. 1998 లో అమెరికా వెళ్లి అట్లాంటాలో స్థిరపడ్డారు.
టీమ్ స్క్వేర్ అంజయ్య
అమెరికాలో ఉద్యోగం చేస్తూనే అంజయ్య అక్కడి తెలుగు వారి సమస్యల పరిష్కారం కోసం తానా సంస్థలో సభ్యులుగా చేరారు. తెలుగువారు హత్యకు గురైనా, రోడ్డు ప్రమాదాల్లో మరణించినా వారి మృతదేహాలను ఇండియాకు తీసుకురావడంలో జరిగే ప్రాసెస్ మొత్తాన్ని దగ్గరుండి అన్ని తానై పూర్తి చేసేవారు. కోటి ఆశలతో అమెరికాకి చదువులు, ఉద్యోగాల నిమిత్తం వచ్చిన తమ బిడ్డలు అనుకోని ప్రమాదాల్లో మరణించడం తల్లిదండ్రులకు ఎంత శొకమో మాటల్లో చెప్పడం కష్టం. అటువంటి సందర్భాల్లో ఇండియాలోని వారి తల్లిదండ్రులకు, ఆప్తులకు చివరి చూపు కల్పించడానికి అంజయ్య సరైన సమయంలో స్పందించి పగలు రాత్రి సమయం వెచ్చించి తానా టీం స్క్వేర్ (తానా ఎమర్జెన్సీ అసిస్టెన్స్ మానేజ్మెంట్) సహాయంతో వందల సార్లు పడ్డ కష్టం అద్వితీయం. ఎన్ఆర్ఐ తల్లిదండ్రులు ఇండియా నుండి అమెరికా కి వెళ్లి ఇబ్బందులకు గురైతే వారికి అండగా నిలిచారు. హెల్త్ ఇన్సూరెన్స్ , ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం, ఫేస్బుక్ సమాచారం ఆధారంగా ఇబ్బందుల్లో ఉన్న వారి సమాచారాన్ని తెలుసుకొని వారికి సహాయపడేవారు.
రెండు దశాబ్దాలుగా అమెరికాలో ఉంటూ, దశాబానికి పైగా తానాలో ముఖ్యమైన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తున్న అంజయ్య కి అమెరికాలో ఉండే తెలుగువారి అవసరాలు బాగా తెలుసు. కమ్యూనిటీ సర్వీస్ కోఆర్డినేటర్ గా సుమారు 100 కు పైగా సేవా కార్యక్రమాలు అమెరికా వ్యాప్తంగా చేశారు. ముఖ్యంగా బోన్మారో డ్రైవ్, బ్లడ్ డ్రైవ్, ఫుడ్ డ్రైవ్, ట్రైనింగ్ వర్క్ షాప్, టాక్స్ సెమినార్లు, ఫైనాన్స్ ప్లానింగ్ సెమినార్ నిర్వహించి ఎప్పటికప్పుడు వృత్తి నైపుణ్యం పెంపొందించుకొనేలా తన వంతు సహాయం అందించారు. ఆపదలో ఉన్న తెలుగు వారిని ఆదుకునేందుకు 2008వ సంవత్సరంలో ప్రారంభించబడిన టీమ్ స్క్వేర్ సంస్థకు చైర్మన్ గా పనిచేసిన కాలంలో అంజయ్య చేసిన సేవలు అనిర్వచనీయం. రాత్రింబవళ్ళు శ్రమిస్తూ సుమారు 600 మంది కార్యకర్తలను సంధాన పరుస్తూ సేవా యజ్ఞాన్ని కొనసాగించారు.
అంజయ్య అన్నదానం
“అన్నం పరబ్రహ్మ స్వరూపం “. అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పది. ఆకలితో ఉన్నవారికి పట్టెడన్నం పెట్టి వారిని ఆదుకోవడం కన్నా మంచి పని ఏమి ఉంటుందని భావించారు అంజయ్య చౌదరి లావు. భగవంతుడు తనకు ఇచ్చిన శక్తి స్తోమతను బట్టి గత 20 సంవత్సరాలుగా నిరంతరాయంగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అనేక వృద్ధ శరణాలయాల్లో అన్నదానం చేస్తూ అందరి అభిమానాన్ని చూరగొన్నారు.
వరించిన పదవులు
అంజయ్య పదవుల కోసం ఏనాడూ పాకులాడలేదు, పదవులే ఆయనను వరించాయి. వరించిన ప్రతి పదవికి ఆయన వన్నె తెచ్చారు. అతి చిన్న వయసులోనే అనేక పదవులు చేపట్టారు. తానా టీమ్ స్క్వేర్ చైర్మన్ గా మొదలైన వారి ప్రయాణం నేడు తానా అధ్యక్షుని వరకూ వచ్చింది.
“తానా” టీమ్ స్క్వేర్ చైర్మన్ (2011-13) “తానా” సంయుక్త కోశాధికారి ( 2013-15) “తానా” టీమ్ స్క్వేర్ మెంటార్ చైర్మన్ (2013 -15) “తానా” కమ్యూనిటీ సర్వీస్ కోఆర్డినేటర్ (2015 – 17) “తానా’ టీమ్ స్క్వేర్ కో చైర్ (2015 – 17) “తానా” జనరల్ సెక్రటరీ (2017 – 19) “తానా” టీమ్ స్క్వేర్ చైర్మన్ (2017 -19) “తానా” ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ (2019 – 21) “తానా” ప్రెసిడెంట్ (2021 -23)