ఎన్టీఆర్! ఈ మూడక్షరాల పేరు వింటే ప్రపంచంలో ఉన్న ఏ తెలుగువాడికైనా రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఎందుకంటే ఒక సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించి ఇటు సినీ రంగాన్ని అటు రాజకీయ రంగాన్ని ఏలిన ధృవతార విశ్వవిఖ్యాత నటసార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు.
సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అంటూ పేదవాడికి పట్టెడన్నం దక్కేలా చేసిన పేదల పక్షపాతి అన్న నందమూరి తారక రామారావు. తెలుగు జాతి గుండె చప్పుడు ఎన్టీఆర్. మరణం లేని జననం, మరణించి కూడా జీవిస్తున్న దైవం ఎన్టీఆర్ (Nandamuri Taraka Ramarao) అంటారు.
మేమంతా జాతీయ పార్టీ ప్రాంతీయ నాయకులం, ఎన్టీఆర్ ప్రాంతీయ పార్టీ జాతీయ నాయకులు అని మాజీ ప్రధానులు సైతం అన్నారంటే ఎన్టీఆర్ స్థాయి ఏంటో అర్ధమవుతుంది. వినూత్న సేవా సంస్కృతిని రాజకీయాల్లో ప్రవేశపెట్టిన భారత ప్రజాస్వామ్య దిక్సూచి ఎన్టీఆర్.
అలాగే టీడీపీ! ఇది కూడా మూడక్షరాలే! ఎన్టీఆర్ స్థాపించిన ఈ పార్టీ పేరులోనే ఏదో పవర్ ఉంది. అంతే కాదు టీడీపీ పార్టీ జెండాలో కూడా పసుపు శక్తి ఉంది. ఎంతైనా అన్నగారు పెట్టిన పార్టీ కదా. అటు ఇండియా అయినా ఇటు అమెరికా అయినా, ఇప్పటికీ అందరి మనసుల్లో ఎన్టీఆర్ తోపాటు తెలుగుదేశం పార్టీ కూడా అట్టే ఉంది.
అందుకే ఆ యుగపురుషుడు మరణించి 27 సంవత్సరాలైనప్పటికీ జనవరి 18 వర్ధంతిని గుర్తుపెట్టుకొని ప్రపంచమంతా స్మరించుకున్నారు. ఇందులో భాగంగా NRI TDP USA ఆధ్వర్యంలో అమెరికాలోని పలు నగరాల్లో తెలుగువారి ఆరాధ్యదైవాన్ని ప్రేమతో స్మరించుకున్నారు.
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (USA)లోని పెద్ద నగరాలైన చికాగో, హారిస్బర్గ్ , టాంపా, పిట్స్బర్గ్, ఆస్టిన్, డెట్రాయిట్, మేరీల్యాండ్, కొలంబస్, ర్యాలీ, షార్లెట్, డెలావేర్, బోస్టన్, కాన్సస్, వాషింగ్టన్ డీసీ, బే ఏరియా, హ్యూస్టన్ నగరాల్లో జనవరి 18న ఘనంగా నివాళులు అర్పించారు.
ప్రతి చోట జ్యోతి వెలిగించి, ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమాలకు హాజరైన ప్రతి ఒక్కరూ పూలతో ఎన్టీఆర్ ని స్మరించుకుంటూ నివాళులు అర్పించారు. జోహార్ ఎన్టీఆర్, ఎన్టీఆర్ అమర్రహే, జై తెలుగుదేశం, జై ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు.
తారకరాముని జీవిత విశేషాలతో కూడిన వీడియోలు ప్రదర్శించారు. వేదికలను తెలుగుదేశం పార్టీ జండాలు, ఎన్టీఆర్ బ్యానర్స్ మరియు ఫొటోలతో అలంకరించారు. అమెరికా పసుపు సైనికులుఅందరూ టీడీపీ కండువాలు ధరించి ఉల్లాసంగా కనిపించారు.
పెద్దలు, మహిళలు, పిల్లలు సైతం తమ అభిమాన నాయకుడు, నటుడు అయినటువంటి అన్నగారి వర్ధంతి లో పాల్గొన్నారు. ఎన్టీఆర్ చేసిన సేవా కార్యక్రమాలను నెమరు వేసుకున్నారు. కొన్ని చోట్ల ఇండియా నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు వీడియో కాల్స్ ద్వారా పాల్గొని ఉత్సాహాన్ని నింపారు.
ఎన్నారై విమెన్ ఫర్ టీడీపీ (NRI Women 4 TDP) వింగ్ ఆధ్వర్యంలో కూడా వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం విశేషం. అలాగే అట్లాంటా, లాస్ ఏంజెలెస్, జాక్సన్విల్ వంటి మరికొన్ని నగరాల్లో ఈ వారాంతం వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు.