Connect with us

Editorial

సినీ రాజకీయ రారాజు NTR కీర్తి అజరామరం, చరిత్రలో స్థానం సుస్థిరం

Published

on

దేశానికి స్వాతంత్య్రం వచ్చినా, మహిళలకు మాత్రం ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాతే స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలు వచ్చాయి. రాజకీయ, ఆర్థిక సమానత్వం ఉంటేనే పురుషాధిక్య సమాజంలో స్త్రీలకు గౌరవం లభిస్తుందని ఎన్టీఆర్ నమ్మారు. అందుకే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు, ఆస్తిలో సమానహక్కు, పద్మావతి విశ్వవిద్యాలయం లాంటివి అనేకమైనవి ప్రవేశపెట్టారు. నా తెలుగింటి ఆడపడుచులు అంటూ ఎంతో అనురాగంతో, మరెంతో ఆప్యాయతతో పలకరిస్తూ, పలవరిస్తూ ఆయన తన ప్రసంగాన్ని ప్రారంభించేవారు. స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే జననం లేదంటూ మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చేవారు. పురుషులతో సమానంగా మహిళలు అన్నిరంగాల్లో ఎదగాలని నిరంతరం ఆయన తపించేవారు.

జనాభాలో సగానికిపైగా ఉన్న మహిళలు అన్ని రంగాల్లో వివక్షకు గురవుతున్నారు. సమాజంలో స్త్రీ, పురుషుల మధ్య అంతరాలు బాగా ఉన్నాయి. అణగారిపోతున్న అతివలు వంట పనులు, ఇంటి పనులకు మాత్రమే పరిమితమవుతున్నారు. వారికి నిజమైన స్వాతంత్ర్యం కల్పించాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ స్థాపనే మహిళా చైతన్యపూరిత శంఖారావం. మహిళా ప్రగతి కోసం పురుడుపోసుకున్న రాజకీయ ప్రస్థానం. పార్లమెంట్ లో, చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని తెలుగుదేశం పార్టీ రాజీలేని పోరాటం చేస్తోంది. మహిళలు సర్వతోముఖాభివృద్ధి చెందినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుంది. ఏ దేశంలోనైతే స్త్రీ ఆత్మగౌరవంతో పాటు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా స్వావలంబన కలిగి ఉంటుందో ఆ దేశం అభివృద్ధి పథంలో పయనిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ ఆధారిత పనులు తప్ప విద్య, ఉద్యోగం అంటే తెలియవు. అలాంటి వారికి రాజకీయ, ఆర్థిక, సామాజిక భద్రత కల్పించారు. ఎన్టీఆర్ రాకతో మహిళా చైతన్యం వెల్లివిరిసింది.

ఎన్టీఆర్ వ్యక్తి కాదు శక్తి, ఆయనొక సంచలనం, తెలుగువాడి విశ్వరూపం. ఆయన ఆత్మగౌరవ నినాదం తెలుగుజాతి గుండెల్లో జాతీయగీతంలా నేటికీ మారుమోగుతూనే ఉంది. మనం ఎక్కడ పుట్టాం, ఎలా పుట్టామన్నది ముఖ్యం కాదు. ఆ ప్రాంతానికి, ఆ జాతికి ఏం చేశాం, వారిలో ఎంత స్ఫూర్తిని నింపావన్నది ముఖ్యం. అలాంటి కారణజన్ముడు, యుగపురుషుడే ఎన్టీఆర్. అందుకే ఆయన చరిత్ర జాతిజనులు పాడుకునే జాతి గీతికలయ్యాయి. తెలుగుజాతి చరిత్రను తిరగరాసిన ఆయన చరిత్ర భావితరాలకు భగవద్గీత అవుతుంది. రాజకీయాల్లో మహానాయకుడిగా, వెండితెరపై రారాజుగా వెలుగొంది తెలుగుదనానికి ప్రతిరూపంగా నిలిచారు. రాజకీయ, సినీరంగంపైనే కాదు.. యావత్ తెలుగు నేలపై ఎన్టీఆర్ పేరు చెరగని సంతకం.

ఒక మహానటుడుగా తెలుగు ప్రజల నీరాజనాలు అందుకున్నారు. సినీవినీలాకాశంలో ధృవతారగా వెలుగొందారు. సినీ ప్రపంచంలో ఒక అరుదైన సుందర సాంస్కృతిక స్వప్నాన్ని సాకారం చేశారు. అక్షరాన్ని ఆయుధంగా మలచి, సాహితీ జగత్తుని శాసించి, సమాజాన్ని కదిలించారు. హీరో అంటే అందరికీ ఎలా ఆదర్శంగా ఉండాలో భవిష్యత్ తరాలకు తెలియజెప్పిన ఘనత ఆయన సొంతం. అందుకే దశాబ్దాలు గడిచినా ప్రేక్షకుల గుండెల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారు. తెలుగు తెరపై అందాల రాముడైనా, కొంటె కృష్ణుడైనా, ఏడు కొండలవాడైనా ఇలా ఏ పాత్రైనా ఎన్టీఆర్ చేస్తేనే ఆ పాత్రలకు నిండుదనం వస్తుంది. కేవలం పౌరాణిక పాత్రలే కాదు, సాంఘిక, జానపద, చారిత్రక సినిమాలు ఏవైనా ఆయన నటిస్తే ఆ పాత్ర పరిపూర్ణమవుతుంది. తెలుగు సినీ చరిత్రలో సాటిలేని కథానాయకుడిగా అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు.

తెలుగువారు తీర్థయాత్రలకు వెళ్లి తిరుమలలో ఏడుకొండలవాడిని దర్శించుకుని అక్కడి నుంచి మద్రాస్ వెళ్లి ఎన్టీఆర్ ను చూసిన తర్వాతే వారి యాత్రకు పరిపూర్ణత చేకూరుతుంది. ఆయనలోని నటుడిని గుర్తించిన ప్రముఖ దర్శక, నిర్మాత బీఏ సుబ్బారావు పల్లెటూరి పిల్ల చిత్రంలో అవకాశం ఇచ్చారు. ఆ సినిమా ఆలస్యం కావడంతో మనదేశం సినిమా తొలిచిత్రం అయింది. విజయ సంస్థతో కుదిరిన ఒప్పందంతో ఎన్టీఆర్ ఆ సంస్థకు ఆస్థాన నటుడయ్యారు. 1951లో కేవీ రెడ్డి దర్శకత్వంలో విజయ సంస్థ నిర్మించిన పాతాళభైరవి సినిమాతో నటుడిగా ఎన్టీఆర్ పేరు సుస్థిరమైంది. 1956 లో విడుదలైన మాయాబజార్ లో తొలిసారి శ్రీకృష్ణుడిగా నటించి మెప్పించారు. పౌరాణిక పాత్రలకు ఈ చిత్రంతోనే నాంది పలికారు. వెండితెరపై కృష్ణుడంటే రామారావే అనేంతగా బలమైన ముద్ర వేశారు. తర్వాత కృష్ణుడిగా ఎన్టీఆర్ 30 సినిమాల్లో కనిపించి అభిమానులను అలరించారు.

ఎన్టీఆర్ తొలిసారిగా రాముడి గెటప్ లో చరణదాసి అనే సాంఘిక చిత్రంలో కనిపించారు. శ్రీరాముడి గెటప్ లో పూర్తిస్థాయిలో కనిపించింది మాత్రం తెలుగు సినిమాలోనే కాదు తమిళంలో తీసిన సంపూర్ణ రామాయణంలో, ఆ తర్వాత 1963లో విడుదలైన లవకుశ సినిమా రాముడిగా ఎన్టీఆర్ కు ఎనలేని కీర్తిప్రతిష్టలు సంపాదించి పెట్టింది. 1959లో ఏవీఎం సంస్థ నిర్మించిన భూకైలాస్ చిత్రంలో రావణబ్రహ్మ పాత్రకు జీవం పోశారు. ఆ తర్వాత తన సొంత బ్యానర్ ఎన్ఏటీ పై నిర్మించిన సీతారామ కల్యాణం సినిమాకు తొలిసారి దర్శకత్వం వహించారు. అందులో రావణుడిగా నటించి మెప్పించారు. వేంకటేశ్వరస్వామి మహత్యం, శ్రీ తిరుపతి వేంకటేశ్వరస్వామి కల్యాణం సినిమాల్లో వేంకటేశ్వరుడిగా మెప్పించారు. ఎన్టీఆర్ నటించిన చిత్రాల్లో దాదాపు 97 శాతం చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాయి. తెలుగులో ఇలాంటి రికార్డ్ ఎవరికీ లేదు. అంతేకాదు ఆయన సినిమాలు మళ్లీ విడుదలైతే.. మొత్తం పెట్టుబడి రాబట్టగలగడం ఎన్టీఆర్ కే సాధ్యమైంది. పౌరాణికాలే కాదు.. జానపద సినిమా హీరోగా కూడా ఎన్టీఆర్ తిరుగులేని మాస్ ఇమేజ్ సంపాదించుకున్నారు. 1977లో తెరకెక్కిన అడవిరాముడు సినిమాతో ఎన్టీఆర్ క్రేజ్ ఎన్నో రెట్లు పెరిగింది. అదే ఏడాదిలో విడుదలైన దానవీరశూర కర్ణ మధురానుభూతిని మిగిల్చింది. అందులో ఆయన పోషించిన శ్రీకృష్ణ, కర్ణ, దుర్యోధన పాత్రలు అనితరసాధ్యం అనే చెప్పాలి. యమగోలతో సహా 1977లో ఒకే ఏడాది మూడు ఇండస్ట్రీ హిట్లు కొట్టారు.

అలాగే ఎన్టీఆర్ స్టార్ హీరోగా ఉండగానే తాత, తండ్రి, మనవడుగా కులగౌరవం చిత్రంలో త్రిపాత్రాభినయం చేశారు. ఇక ద్విపాత్రాభినయం కలిగిన చిత్రాలను లెక్కలేనన్ని పోషించారు. రాజకీయాల్లోకి వచ్చాక కూడా బ్రహ్మర్షి విశ్వామిత్ర, సామ్రాట్ అశోక్, మేజర్ చంద్రకాంత్, శ్రీనాథ కవి సార్వభౌమ లాంటి చారిత్రక, పౌరాణిక, సాంఘిక చిత్రాలు తీసి తనకు తానే సాటి అనిపించుకున్నారు. ఎన్టీఆర్ తన 44 ఏళ్ల సినీ జీవితంలో 13 చారిత్రక, 55 జానపదాలు, 186 సాంఘికాలు, 44 పౌరాణిక చిత్రాలు చేసి తెలుగుతెరపై చెరగని ముద్ర వేశారు. అంతేకాదు హిందీ, తమిళ భాషల్లో పలు చిత్రాల్లో నటించారు. ఎన్టీఆర్ తో తనయుడు బాలకృష్ణ 12 చిత్రాల్లో నటించారు. అందులో ఎక్కువశాతం విజయాలు సాధించాయి. అంతేకాదు ప్రపంచ సినీ చరిత్రలో ఓ తండ్రి, కొడుకులు హీరోలుగా, ముఖ్యపాత్రల్లో ఇన్ని సినిమాల్లో నటించిన వారు ఎవరూ లేరు. ఇదొక రికార్డ్. తాను నటించిన చిత్రాల్లో ఐదోవంతు సినిమాలను ఎన్టీఆర్ రైతు నేపథ్యం, గ్రామీణ నేపథ్యం ఉన్న కథలతోనే ఎక్కువగా నటించారు. సాంఘిక సినిమాల్లోనే కాదు.. పౌరాణిక, జానపద, చారిత్రక చిత్రాల్లో కూడా సందర్భానుసారం రైతును గుర్తుచేసుకున్నారు. ఈ తరహాలో నటించిన నటులు దేశంలో మరొకరు కనిపించరు. తాను ఎంచుకునే రైతు కథలలో రైతుల సమకాలీన సమస్యలు, వాటికి పరిష్కారాలు ఉంటే వెంటనే ఆయన ఒప్పేసుకునేవారు. నాలుగు దశాబ్దాల పాటు తనను ఆరాధించిన ప్రజలకు ఏదైనా చేయాలనే తపనతోటే రాజకీయ రంగం ప్రవేశం చేశారు. సినీ రంగంలో ఉన్నప్పుడు కూడా చైనా దురాక్రమణ జరిగిన సమయంలో అమరజవానుల కుటుంబాలను ఆదుకోవడం కోసం, దివిసీమ ఉప్పెన సందర్భంలోనూ జోలెపట్టి ఊరూరా తిరిగి, నిధులు సేకరించి బాధితులను ఆదుకున్నారు.

గతేడాది నుంచి అమెరికా వ్యాప్తంగా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను అంగరంగ వైభవంగా కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు నిర్వహించారు. 2023 ఏడాది మే నెలలో 50 నగరాల్లో నిర్వహిస్తున్న శతవసంతాల వేడుకలు తెలుగువారి మదిలో ఇప్పటికీ, ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఒక శకం ముగిసింది, ఒక తార రాలిపోయింది, ఒక గొంతు మూగబోయింది, ఒక తరం అంతరించిపోయింది. పీడిత జన హృదయాల్లో నుంచి ఉద్భవించిన నిలువెత్తు చైతన్యం, ప్రజాభిమానమే ఊపిరిగా శ్వాసించి, ధ్యాసించి అమరుడైన అన్న ఎన్టీఆర్ కు శత వసంతాల నీరాజనం. ఫ్రిస్కో నగర మేయర్ జెఫ్ షెనీ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన జన్మదినం మే 28వ తేదీని తెలుగు వారసత్వ దినోత్సవంగా ప్రకటించడం తెలుగుజాతికి లభించిన అరుదైన గౌరవం. ప్రాచీన భాషలలో తెలుగు ఒకటని షెనీ కీర్తించారు. ఎన్టీఆర్ తెలుగుతేజం, తెలుగుదనానికి నిలువెత్తు నిదర్శనం. సమున్నత వ్యక్తిత్వం, మహోన్నత మానవత్వం. తెలుగువారి ఖ్యాతిని దశదిశలా చాటిన యశస్సు. తెలుగుజాతి ఉన్నంతకాలం చరిత్ర పుటల్లో, జన హృదయాల్లో ఎన్టీఆర్ చిరస్మరణీయులే. అందుకే ఆయన స్థానం చరిత్రలో సుస్థిరం. ఆయన కీర్తి అజరామరం. ఇంతటి విశిష్ట లక్షణాలు కలిగిన ఒక మహాపురుషిడిని కోల్పోవడం దేశానికే తీరని లోటు. ఎన్టీఆర్ కు శతవసంతాల నీరాజనం పలుకుతూ భారతరత్న ఇవ్వాలని యావత్ తెలుగుజాతి కోరుకుంటోంది.

– మన్నవ సుబ్బారావు, గుంటూరు మిర్చియార్డ్ మాజీ ఛైర్మన్

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected