ఎన్టీఆర్ కు నిజమైన నివాళి తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడమే అని ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు (Kinjarapu Ram Mohan Naidu) అన్నారు. వాషింగ్టన్ డీసీలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి తానా పూర్వాధ్యక్షులు సతీష్ వేమన (Satish Vemana) అధ్యక్షత వహించారు.
ముఖ్య అతిథులుగా ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఎన్ఆర్ఐ టీడీపీ యూఎస్ఏ కోఆర్డినేటర్ జయరాం కోమటి (Jayaram Komati), గుంటూరు మిర్చియార్డ్ మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు (Mannava Subbarao) పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
అంతకుముందు ఊరేగింపుగా ఎన్టీఆర్ విగ్రహాన్ని తీసుకువచ్చారు. మహిళలు పసుపుపచ్చ చీరలు ధరించి, ర్యాలీగా తరలివచ్చి హారతులు ఇచ్చారు. ఈ వేడుకకు పరిమితికి మించి ఎన్టీఆర్ అభిమానులు వేలాదిగా తరలిరావడంతో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దారు. ఉదయం 10 గంటలకే అభిమానులు పోటెత్తారు. కొన్ని మైళ్ళ వరకూ ట్రాఫిక్ లో ఇరుక్కున్న చిన్నారులు సైతం సభాస్థలికి నడిచి చేరుకున్నారు.
ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. చంద్రబాబు ముఖ్యమంత్రి కావాల్సిన చారిత్రక అవసరం ఉంది. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు ప్రపంచవ్యాప్తంగా అంగరంగ వైభగంగా జరుగుతుండటం మనందరికీ గర్వకారణం. బడుగు, బలహీనవర్గాలకు రాజ్యాధికారం కల్పించిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే నేడు అందరికీ ఆదర్శం అయ్యాయన్నారు. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని యావత్ తెలుగుజాతి కోరుకుంటోందన్నారు. ఈ దిశగా కేంద్రం అడుగులు వేయాలన్నారు.
జయరాం కోమటి మాట్లాడుతూ.. తెలుగువారున్న ప్రతిచోట, ప్రతినోట ఎన్టీఆర్ పేరే వినిపిస్తోంది. అమెరికాలోని 50 నగరాల్లో ఈ వేడుకలు ఘనంగా నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమాలన్నింటిని పుస్తకరూపంలో తీసుకువచ్చాం. దానిని 28వ తేదీన మహానాడు వేదికగా నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ఆవిష్కరిస్తారన్నారు.
సతీష్ వేమన మాట్లాడుతూ.. ఎన్టీఆర్ మహా నాయకుడిగానే కాదు, ఒక మహానటుడిగా తెలుగు ప్రజల నీరాజనాలు అందుకున్నారు. తెలుగుజాతి ఉన్నంత కాలం చరిత్ర పుటల్లో, జన హృదయాల్లో ఎన్టీఆర్ చిరస్మరణీయులే అని కొనియాడారు. ఎన్టీఆర్ స్వతహాగా భోజన ప్రియుడు కావడంతో 100 రకాల వంటకాలతో విందు భోజనాలు ఏర్పాటుచేశామన్నారు.
మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ.. సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లంటూ నినదించిన వ్యక్తి ఎన్టీఆర్. సినీ, రాజకీయ రంగాల్లో అందనంత ఎత్తుకు ఎదిగి చరిత్ర సృష్టించారన్నారు. ప్రజల అభిమానమే ఊపిరిగా శ్వాసించిన రూపం. పోరాడే విప్లవ గీతమై, జనం గుండెచప్పుడైన ఆ మహనీయునికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నామన్నారు.
డా. నరేన్ కొడాలి మాట్లాడుతూ.. కృషి, పట్టుదలతో నేటి యువత కూడా ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఎన్టీఆర్ గొప్ప సంస్కరణ వాది అని, ఆయన సమయ పాలన, ఆత్మా గౌరవ నినాదం నేటికీ స్ఫూర్తిదాయకమన్నారు. ఆయన జాతీయ భావాలూ గల ప్రాంతీయ నాయకుడని కొనియాడారు.
అధ్యక్షుడు సుధీర్ కొమ్మి మాట్లాడుతూ.. అన్నగారి స్ఫూర్తిని కొనసాగిస్తూ తెలుగు వారంతా ఒకరికి ఒకరం అని, అన్ని రంగాలలో సమిష్టిగా ముందుకు సాగుతామని తెలిపారు. పార్టీ ఉపాధ్యక్షుడు భాను మాగులూరి (Bhanu Maguluri) ఈ కార్యక్రమాన్ని సమన్వయపరిచారు.
ఈ కార్యక్రమంలో వెంకటరావు మూల్పూరి, అనిల్ ఉప్పలపాటి, రవి అడుసుమల్లి, కార్తీక్ కోమటి, సుశాంత్ మన్నె, సాయి బొల్లినేని, యాష్ బొద్దులూరి, సుధా పాలడుగు, రామ్ చౌదరి ఉప్పుటూరి, యలమంచిలి చౌదరి, త్రిలోక్ కంతేటి, సత్య సూరపనేని, కిషోర్ కంచర్ల, నరేష్, చంద్ర మలావతు, రమేష్ గుత్త, మురళీ తదితరులు పాల్గొన్నారు.
గతేడాది నుంచి అమెరికాలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు (NTR Centennial Birthday Celebrations) జరిగాయి. ఈ కార్యక్రమాల సమారాన్ని పుస్తకరూపంలో తీసుకురావడం జరిగింది. మన్నవ సుబ్బారావు రూపొందించిన ఈ సావనీర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం విజయవంతంలో కీలకపాత్ర పోషించిన సతీష్ వేమనను సత్కరించారు.
NTR (Nandamuri Taraka Ramarao) శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని కేక్ ను కట్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి. 100 ఐటమ్స్ తో వడ్డించిన విందు భోజనం అమోఘం అంటూ అందరూ ప్రశంసిస్తున్నారు.