Connect with us

Events

షార్లెట్లో తారకరామునికి ఆత్మీయ నివాళులు; బోడే ప్రసాద్, ప్రభాకర చౌదరి సందేశాలు

Published

on

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, తెలుగువారి ఖ్యాతిని ప్రపంచం నలుమూలలకి వ్యాపింపజేసిన నందమూరి తారకరాముని 27వ వర్ధంతి కార్యక్రమాన్ని అమెరికాలోని నార్త్ కరోలినా (North Carolina) రాష్ట్రం, షార్లెట్ నగరంలో ఘనంగా నిర్వహించారు. అలాగే ఎన్టీఆర్ సేవలను నెమరువేసుకుంటూ షార్లెట్ ఎన్నారై టీడీపీ బలాన్ని చాటారు.

Charlotte NRI TDP నాయకులు పురుషోత్తం చౌదరి గుదే, ఠాగూర్ మల్లినేని, సచ్చింద్ర ఆవులపాటి, వెంకట్ సూర్యదేవర ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముందుగా మహిళలు ధూప దీపాలు వెలిగించగా, ఆహ్వానితులు అందరూ పూలతో ఆత్మీయ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ని స్మరించుకుంటూ రెండు నిమిషాలు మౌనం పాటించారు.

భారత కాలమానం ప్రకారం జనవరి 18, బుధవారం ఉదయం 6 గంటలకు సుమారు 150 మందికి పైగా షార్లెట్ వాసులు ఈ కార్యక్రమంలో పాల్గొని నింగికేగిన ఎన్టీఆర్ (NTR) పై తమ అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. జోహార్ ఎన్టీఆర్, ఎన్టీఆర్ అమర్రహే, జై తెలుగుదేశం అంటూ నినాదాలు చేశారు. అనంతరం ఠాగూర్ మల్లినేని తయారుచేసిన వీడియోని ప్రదర్శించారు.

తెలుగువారి ఆరాధ్యదైవం ఎన్టీఆర్ సినిమా జీవితం, రాజకీయ అరంగేట్రం, తెలుగుదేశం పార్టీ స్థాపన వంటి పలు విషయాలను గుర్తుకు తెచ్చిన ఈ వీడియో అందరినీ ఆకట్టుకుంది. తారకరామునికి ఆత్మీయ నివాళులు అర్పించిన ఈ కార్యక్రమానికి వెంకట్ సూర్యదేవర (Venkat Suryadevara) వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఎన్టీఆర్ ఫోటోలు, తెలుగుదేశం పార్టీ జండాలు, బ్యానర్లతో వేదికను అలంకరించడంతో అందరూ ఆహ్లాదకరంగా ఫోటోలు దిగారు.

ఈ సందర్భంగా NRI TDP నాయకులు పురుషోత్తం చౌదరి గుదే మాట్లాడుతూ.. ఈరోజు మనందరం సమావేశమవ్వడానికి ముఖ్య కారణం ఎన్టీఆర్. విశ్వవిఖ్యాత, పద్మశ్రీ, అన్న నందమూరి తారక రామారావు ని స్మరించుకుంటూ, తన అడుగుజాడల్లో నడవాలని కోరారు. అలాగే విభజిత ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి పదంలో నడిపేందుకు నారా చంద్రబాబు నాయుడి సారధ్యంలోని తెలుగుదేశం పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకువచ్చేలా అందరూ కృషి చేయాలన్నారు.

ఠాగూర్ మల్లినేని మాట్లాడుతూ.. వారాంతం కాకపోయినప్పటికీ, తమ బిజీ షెడ్యూల్లో కూడా దాదాపు 150 మందికి పైగా పెద్దలు, మహిళలు, పిల్లలు ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే నటసార్వభౌమ ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ కోసం ప్రతి ఒక్క ఎన్నారై తమవంతుగా కొంత సమయం కేటాయించాలనీ కోరారు. సోషల్ మీడియా, టెక్నాలజీ, ఆర్ధిక వనరులు, ఎలక్షన్స్, ఇలా ఎవరు చేయగలిగిన సహాయం వారు చేస్తే బాగుంటుందని అన్నారు. దీంతో అందరూ చప్పట్లతో తమ సంఘీభావాన్ని తెలియజేశారు.

రాయలసీమ నుంచి అనంతపూర్ మాజీ శాసనసభ్యులు వైకుంఠం ప్రభాకర్ చౌదరి (Vaikuntam Prabhakar Chowdary) మరియు కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ బోడే ప్రసాద్ (Bode Prasad) ఆన్లైన్లో జూమ్ మీటింగ్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొని తమ సందేశాలు వినిపించారు.

పెనమలూరు మాజీ శాసనసభ్యులు బోడే ప్రసాద్ మాట్లాడుతూ.. అమెరికా కాలమానం రీత్యా ప్రపంచంలోనే అందరికంటే ముందు మీరే అన్నగారి 27వ వర్ధంతిని నిర్వహిస్తున్నారని, ఇలాంటి కార్యక్రమంలో నేను పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. ఇదే ఉత్సాహంతో వచ్చే ఎన్నికలలో కూడా తమ శక్తి మేర తోడ్పడి మన పసుకు పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్నారు.

వైకుంఠం ప్రభాకర్ చౌదరి మాట్లాడుతూ.. గత సంవత్సరం అమెరికా వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ 40 వసంతాల పండుగని అందరితో షార్లెట్ లో ప్రత్యక్షంగా పాల్గొన్న వైనాన్ని గుర్తుచేసుకున్నారు. తెలుగు వారి గుండెల్లో నాటికీ నేటికీ ఎప్పటికి చెరగని ప్రతిరూపమే మన ఎన్టీఆర్ అని, అటువంటి ఎన్టీఆర్ కి ఆంధ్రప్రదేశ్ లో రాజ్యమేలుతున్న రౌడీలకు బుద్దిచెప్పేలా టీడీపీ ని తిరిగి అధికారంలోకి తీసుకురావడమే అసలైన నివాళి అన్నారు.

అనంతరం పలువురు మహిళలు, నాయకులు ఎన్టీఆర్ తో, తెలుగుదేశం పార్టీతో తమ అనుభవాలను పంచుకున్నారు. నార్త్ కరోలినా రాష్ట్రం, షార్లెట్ నగరంలో స్థానిక ఆడ్రే చేజ్ హాల్లో నిర్వహించిన Nandamuri Taraka Ramarao ఆత్మీయ నివాళికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, అన్న ఎన్టీఆర్ అభిమానులు కుటుంబసమేతంగా పాల్గొనడం విశేషం. డిన్నర్ అనంతరం వందన సమర్పణతో ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected