Connect with us

Government

భారత కాన్సులేట్‌ ని ఖలిస్తాన్ వాసులు ధ్వంసం, భారతీయుల ఖండన & శాంతి ర్యాలీ: San Francisco, California

Published

on

San Francisco, California: శాన్ ఫ్రాన్సిస్కోలో ఖలిస్తానీ తీవ్రవాదానికి వ్యతిరేకంగా స్థానిక కాలిఫోర్నియా భారతీయులు ఏకమయ్యారు. ఖలిస్తాన్ ఉద్యమానికి వ్యతిరేకంగా భారతదేశ ఐక్యత కోసం శాన్ ఫ్రాన్సిస్కోలోని కాన్సులేట్ కార్యాలయం ప్రాంగణం లో వందలమంది స్థానిక కాలిఫోర్నియా భారతీయ అమెరికన్ మద్దతుదార్లు మార్చి 24 సాయంత్రం 3 గంటలకు భారత అనుకూల ప్రదర్శనకు హాజరయ్యారు.

ఖలిస్తాన్ అనుకూల నిరసనకారుల బృందం ఆదివారం, మార్చి 19, 2023 న కాలిఫోర్నియాలోని శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో ఉన్న భారత కాన్సులేట్‌ కార్యాలయ అద్దాలను పాక్షికంగా ధ్వంసం చేసిన కొన్ని రోజుల తర్వాత , ప్రవాస భారతీయులు శుక్రవారం భారత కాన్సులేట్‌ కార్యాలయ భవనం వెలుపల గుమిగూడి ఈ హింసాత్మక సంఘటనకు వ్యతిరేకంగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. వందేమాతరం, భారతమాత కు జై నినాదాలు చేశారు. పలు దేశభక్తి పాటలను వినిపించారు.

భారత మద్దతుదారులు శుక్రవారం మార్చి 24 సాయంత్రం 3గం కు భారత కాన్సులేట్‌ కార్యాలయ భవనం చేరుకోగానే, అక్కడ ఒక టెంటు లో అప్పటికే సిద్ధంగా ఉన్న కొంతమంది ఖలిస్తాన్ మద్దతుదారులు వేర్పాటువాద నినాదాలు, భారత వ్యతిరేక నినాదాలు లంకించుకున్నారు. అయితే తగ్గేదిలేదని భారత మద్దతుదారులు భారత ప్రభుత్వ అనుకూల నినాదాలతో, డోలు వాయిద్యాలతో దేశభక్తి పాటలతో వారికి ధీటుగా సమాధానం చెప్పారు.

దాదాపు రెండు గంటలపాటు జరిగిన ప్రదర్శన, మాటల యుద్ధంలో భారత మద్దతుదారులు ఖలిస్తాన్ వేర్పాటువాదులపై పైచేయి సాధించారు. ఆదివారం హింసాత్మక సంఘటనలు జరిగిన నేపథ్యంలో శుక్రవారం అటువంటి సంఘటనలు జరగకుండా స్థానిక పోలీసులు అక్కడ పెద్ద ఎత్తున మోహరించి ఉండడం కనిపించింది.

ఆదివారం ఖలిస్థాన్ వేర్పాటువాదులు శాన్ ఫ్రాన్సిస్కోలోని కాన్సులేట్ కార్యాలయం అద్దాలను పాక్షికంగా ధ్వంసం చేసిన నేపథ్యంలో భారత్ కు మద్దతుగా పెద్ద సంఖ్యలో భారత అమెరికన్ కమ్యూనిటీ సభ్యులు శనివారం జరిపిన శాంతి ర్యాలీలో శాక్రమెంటో నగరం నుండి శాక్రమెంటో తెలుగు సంఘం తరపున రాఘవ్, మనోహర్, వెంకట్ ఇంకా పలువురు స్థానిక ప్రవాస తెలుగు వారు హాజరు అయ్యారు.

కాన్సులేట్ జనరల్ T.V. నాగేంద్ర ప్రసాద్, కాన్సుల్ ఆకున్ సబర్వాల్, ఇంకా కార్యాలయ సిబ్బంది బాబురావు తదితరులను వారు కలుసుకొని వారికి తమ సంఘీభావం తెలియజేశారు. పలువురు భారత అనుకూల ముస్లింలు, సిక్కులు, ఇతర ప్రవాసులు పాల్గొన్న ఈ శాంతియుత ప్రదర్శనలో “భారతీయత” ప్రస్ఫుటంగా కనిపించింది.

ఉత్తర భారత రాష్ట్రమైన పంజాబ్‌లో ఖలిస్థాన్ వేర్పాటువాద నాయకుడు అమృతపాల్ సింగ్ ఆచూకి కోసం పోలీసులు భారీ వేట ప్రారంభించిన కొన్ని రోజుల తర్వాత శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్‌లో ఆదివారం జరిగిన విధ్వంసక చర్య నేపథ్యంలో, ఇలాంటి విధ్వంసక సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని భారత అనుకూల ప్రదర్శనకు హాజరు అయిన ప్రవాస భారతీయులు స్థానిక అమెరికా ప్రభుత్వాన్ని కోరారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected