Connect with us

Health

అమెరికాలో ఆకస్మిక గుండెపోట్ల తీవ్రతపై నాట్స్ సమయానుకూల సదస్సు

Published

on

యువకులు సైతం ఆకస్మిక గుండెపోటుతో చనిపోతుండటంతో ఈ అంశంపై అవగాహన కల్పించేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘నాట్స్’ అంతర్జాల వేదికగా వెబినార్ నిర్వహించింది. అమెరికాలోని ప్రముఖ కార్డియాలజిస్ట్ గుడిపాటి చలపతిరావు ఈ సదస్సులో ప్రధానంగా అసలు ఆకస్మిక గుండెపోట్లు ఎందుకు వస్తాయనే దానిపై అవగాహన కల్పించారు.

జీవన శైలిలో మార్పులు గుండెపోట్లకు ప్రధాన కారణమని తెలిపారు. మనం తినే ఆహారం సరిగా లేకపోవడం, శరీరానికి సరైన వ్యాయామం లేకపోవడం, వారసత్వంగా వచ్చే వ్యాధుల వల్ల గుండెపోట్లు పెరుగుతున్నాయని, ముఖ్యంగా భారత్‌లో ఈ పెరుగుదల ఎక్కువగా ఉందని గుడిపాటి చలపతిరావు అంకెలతో సహా వివరించారు.

జీవనశైలిలో ఆరోగ్యకరమైన మార్పులు చేసుకుంటే ఆకస్మిక గుండెపోట్ల నుంచి తప్పించుకోవచ్చని తెలిపారు. ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం మంచిదన్నారు. పైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలని ప్రముఖ డాక్టర్ మధు కొర్రపాటి తెలిపారు. పెరుగన్నం, చిరుధాన్యాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని తెలిపారు.

తెల్ల అన్నానికి బదులుగా మిలెట్స్, ఓట్స్, బ్రౌన్ రైస్‌లాంటివి వాడొచ్చని తెలిపారు. కూరగాయలు, పండ్లు ఆహారంలో ఎక్కువగా ఉండాలని.. రోజుకు కనీసం 8 గ్లాసుల నీళ్లు తాగాలని మధు కొర్రపాటి సూచించారు. గుండెపోటు వచ్చినప్పుడు చుట్టుపక్కన ఉండేవాళ్లు ఎలా స్పందించాలి అనేది డాక్టర్ మాధురి అడబాల వివరించారు. సీపీఆర్ ఎలా చేయాలనే దానిపై అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమానికి విజయ్ అన్నపరెడ్డి వ్యాఖ్యతగా వ్యవహరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో డాక్టర్ పూర్ణ అట్లూరి గుండెపోటు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచించారు. ఈ కార్యక్రమ నిర్వహణలో డాక్టర్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ గంటి సూర్యం, డాక్టర్ బీఎస్ఆర్ మూర్తి, డాక్టర్ దాసరి సతీష్‌లు కీలక పాత్ర పోషించారు.

టీఏజీడీవీ, టీఎఫ్ఏఎస్, టామ్, వాషింగ్టన్ తెలుగు సోసైటీ, టాంటెక్స్, ఉజ్వల ఫౌండేషన్, సహృదయ ఫౌండేషన్, జింకానా రన్ ఇన్ ఇండియా, హిందు అమెరికన్ సోసైటీ ఆఫ్ సెంట్రల్ న్యూజెర్సీ తదితర సంస్థలు ఈ కార్యక్రమానికి తమ పూర్తి మద్దతు, సహకారాన్ని అందించాయి.

డాక్టర్స్ ఫార్మసీ ఈ కార్యక్రమ నిర్వహణకు ప్రధాన స్పానర్‌గా వ్యవహరించింది. ప్రతి ఒక్కరికి ఎంతో ఉపయుక్తమైన సదస్సును దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరికి నాట్స్ ఛైర్ విమెన్ అరుణ గంటి, నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి (బాపు) నూతి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected