Connect with us

Motivational

మహిళా సమస్యలపై అవగాహన కోసం నాట్స్ మహిళా సాధికారత వెబినార్

Published

on

నవంబర్ 21, న్యూ జెర్సీ: అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా మహిళా సాధికారతపై దృష్టి సారించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆన్ లైన్ ద్వారా వెబినార్స్ నిర్వహించి మహిళా సాధికారత కోసం తన వంతు ప్రయత్నాలు ప్రారంభించింది. దీనిలో భాగంగా నవంబర్ 21న జరిగిన తొలి వెబినార్‌కు చక్కటి స్పందన లభించింది. చాలా మంది మహిళలు ఫేస్ బుక్, జూమ్ యాప్స్ ద్వారా ఈ వెబినార్‌ను వీక్షించి విలువైన సమాచారాన్ని తెలుసుకున్నారు. మహిళల సమస్యల పరిష్కారంపై అవగాహన పెంచుకున్నారు. మహిళల హక్కులు, వారి సమస్యలకు పరిష్కారాలపై పనిచేస్తున్న మానవితో కలిసి నాట్స్ మహిళా సాధికారత కోసం తన వంతు కృషి చేస్తోంది.

ఈ వెబినార్‌లో ప్రముఖ న్యాయవాది, పరివర్తన హోమ్ కో ఆర్డినేటర్ పూనమ్ సక్సేనా పాల్గొన్నారు. మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వేధింపులకు ఎలా చెక్ పెట్టాలి. మహిళలు తరచూ గృహహింస తదితర సమస్యలకు పరిష్కారాలు ఏమిటి? అనే అంశాలపై పూనమ్ సక్సేనా చక్కటి అవగాహన కల్పించారు. మహిళలపై వేధింపులు ఎలా జరుగుతున్నాయి? వాటిని అరికట్టడం ఎలా? బాధిత మహిళలు ఎలా న్యాయ సహాయం పొందాలనే విషయాలను పూనమ్ చక్కగా కొన్ని కేసులను ఉదాహరణలుగా చెప్పి వివరించారు. కోవిడ్ విజృంభించిన సమయంలోనే లాక్ డౌన్, వర్క్ ఫ్రమ్ హోమ్‌తో భర్తలు భార్యలను వేధించిన ఘటనలు ఎక్కువగా జరిగాయని ఆమె తెలిపారు. ఇలాంటి గృహ హింస కేసుల్లో బాధిత మహిళలకు అండగా నిలిచేందుకు తమ వంతు సాయం చేస్తామని పూనమ్ అన్నారు. ఇక కుటుంబంలో అనుకోని ప్రమాదం జరిగి ఇంటి పెద్దను కోల్పోతే అలాంటి సమయంలో మహిళలు ఎలా వ్యవహరించాలి? ఆర్థిక విషయాల్లో ఎలా అప్రమత్తంగా ఉండాలనేది కూడా పూనమ్ వివరించారు.

నాట్స్ హెల్ప్ లైన్ ద్వారా చాలా మంది మహిళలకు నాట్స్ చేసిన సాయం గురించి నాట్స్ వైస్ ఛైర్ పర్సన్ అరుణ గంటి వివరించారు. ఈ వెబినార్‌లో నాట్స్ హెల్ప్ లైన్ ద్వారా సాయం పొందిన బాధిత మహిళ తన అనుభవాలను పంచుకున్నారు. ఆత్తింటి వేధింపులతో నరకప్రాయమైన జీవితం నుంచి బయటపడి తాను స్వశక్తితో నిలబడేలా చేయడంలో తనకు నాట్స్ చేసిన సాయం మరువలేనిదని బాధిత మహిళ తెలిపారు. నాట్స్ తనకు అండగా నిలిచిన వైనాన్ని ఈ వెబినార్‌లో ఆమె వివరించారు. మహిళలకు నాట్స్ ఎప్పుడు అండగా నిలబడుతుందని, వారి సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తుందని తెలిపారు. ఇక ఈ వెబినార్‌కు వ్యాఖ్యాతగా గీతా గొల్లపూడి వ్యవహరించారు. భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాల గురించి లక్ష్మి బొజ్జ వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి జ్యోతి వనం ధన్యవాదాలు తెలిపారు. పద్మజ నన్నపనేని, ఆశా వైకుంఠం, బిందు యలమంచిలి ఈ కార్యక్రమం విజయవంతానికి తమ వంతు సహకారాన్ని అందించారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected