సెప్టెంబర్ 27, న్యూ జెర్సీ: అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘నాట్స్’ మానసిక ఆరోగ్యం (Mental Health) పై ఆన్‌లైన్ వేదికగా అవగాహన సదస్సు నిర్వహించింది.
మానసిక ఆందోళనను జయించడం ఎలా? ఒత్తిడి ఎదుర్కొనే మార్గాలేమిటి? వ్యతిరేక ఆలోచనల నుంచి ఎలా బయటపడాలి? ఇలాంటి అంశాలపై మానసిక నిపుణులు, వైద్యులు ఈ సదస్సులో పాల్గొని మానసిక సమస్యలు, వాటి పరిష్కారాలపై వెబినార్‌లో పాల్గొన్న వారికి అవగాహన పెంచారు.
సెంచరీ పిడియాట్రిక్స్ ప్రెసిడెంట్ కృష్ణ మాదిరాజు, ఎ.ఎ.పీ.ఐ ప్రెసిడెంట్ రవి కొల్లి, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫెసిలిటేటర్, టెక్సాస్ స్టేట్ కోఆర్డినేటర్ ఉష పెర్రీ, ఇండో యూఎస్ రేర్ పేషంట్ అడ్వకేట్ నారా గోవింద్‌రాజన్‌లు ఈ అవగాహన సదస్సులో తమ అమూల్యమైన సూచనలు చేశారు.
లీడ్ హ్యుమానిటేరియన్ ఐటీ డైరెక్టర్ శ్రీ ఫణి ఈ సదస్సుకు వ్యాఖ్యతగా వ్యవహరించారు. మానసిక ఆరోగ్యం అనేది చాలా ముఖ్యమైన అంశం. దీనిపై అందరూ అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని నాట్స్ ఛైర్ ఉమన్ అరుణ గంటి ఈ సదస్సులో చెప్పారు. అందుకే మానసిక నిపుణులచే ఈ వెబినార్ నిర్వహించినట్టు ఆమె తెలిపారు. ఈ వెబినార్‌కు హాజరైన అతిథులకు, సభ్యులకు నాట్స్ ప్రెసిడెంట్ బాపు నూతి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.