Connect with us

Eye Camp

వినూత్నంగా మొదటిసారి అమెరికాలో నేత్ర వైద్య శిబిరాలు: Dr. Uma Aramandla Katiki, TANA Women Services Coordinator

Published

on

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (Telugu Association of North America) ‘తానా’ గత కొన్ని సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఆరోగ్య శిబిరాలను (Health Camps) నిర్వహిస్తున్న సంగతి అందరికీ విదితమే. ఉచిత కాన్సర్ నిర్ధారణ క్యాంపులు, మెగా కంటి వైద్య శిబిరాలు, హెల్దీ గళ్ హెల్దీ ఫ్యూచర్ వంటి ప్రాజెక్ట్స్ ఈ కోవకి చెందినవే.

కానీ ఇప్పుడు ప్రప్రధమంగా తానా ఉమెన్ సర్వీసెస్ కోఆర్డినేటర్‌ డా. ఉమా ఆరమండ్ల కటికి (Dr. Uma Aramandla Katiki) వినూత్నంగా అమెరికాలో ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గత వారాంతం సెప్టెంబర్ 18 ఆదివారం రోజున ఇండియానా రాష్ట్రం, మెరిల్విల్ టౌన్లో తానా తరపున మొట్టమొదటిసారిగా ఉచిత కంటి పరీక్షా శిబిరం నిర్వహించారు.

తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు మరియు కమ్యూనిటీ సర్వీసెస్ కోఆర్డినేటర్‌ రాజా కసుకుర్తి సహకారంతో తానా ఉమెన్ సర్వీసెస్ కోఆర్డినేటర్‌ (TANA Women Services Coordinator) డా. ఉమా ఆరమండ్ల కటికి ఆధ్వర్యంలో డాక్టర్ శ్రీరామ్ శొంటి మరియు నర్సులు సుమారు 4 గంటలపాటు పలువురు ప్రవాసులకు గ్లూకోమా క్యాటరాక్ట్ వంటి కంటి సంబంధిత వ్యాధులకు పరీక్షలు చేశారు.

చిన్మయ మిషన్ సహాయంతో నిర్వహించిన ఈ తానా కంటి పరీక్షా శిబిరం విజయవంతం అవడానికి సహకరించిన డాక్టర్ శ్రీరామ్ శొంటి, నగేష్ కండ్రేగుల, పద్మిని మాకం, గుర్ప్రీత్ సింగ్, శాంతి లక్కంసాని, మైథిలి పిట్టల, శశి మందల, కిరణ్ వంకాయలపాటి మరియు రాధిక గరిమెళ్ళ తదితరులకు తానా ఉమెన్ సర్వీసెస్ కోఆర్డినేటర్‌ డా. ఉమా ఆరమండ్ల కటికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమానికి హాజరైన వారు తానా చేస్తున్న వివిధ సేవా కార్యక్రమాలను కొనియాడారు. మరీ ప్రత్యేకించి పుట్టినింటే కాకుండా మెట్టినింట కూడా సేవలందించేలా కృషి చేస్తున్న తానా ఉమెన్ సర్వీసెస్ కోఆర్డినేటర్‌ డా. ఉమా ఆరమండ్ల కటికి సేవానిరతిని అభినందించారు.

సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్న సూక్తిని ఆచరిస్తూ ఇంతకు మునుపే జూన్ 18 శనివారం రోజున ఇలినాయిస్ (Illinois) రాష్ట్రం, చికాగో (Chicago) సౌత్వెస్ట్ సబ్అర్బ్స్ లోని బోలింగ్బ్రూక్ (Bolingbrook) లో తానా ఉమెన్ సర్వీసెస్ కోఆర్డినేటర్‌ డా. ఉమా ఆరమండ్ల కటికి మరో ఉచిత కంటి పరీక్షా శిబిరాన్ని కూడా నిర్వహించారు.

ఈ ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని బొలింగ్బ్రూక్ సిటీ మేయర్ మేరీ అలెగ్జాండర్ బస్త (Mary Alexander Basta) సందర్శించడమే కాకుండా తానా సేవలను అభినందించడం విశేషం. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు పలువురికి డాక్టర్ శ్రీరామ్ శొంటి (Dr. Sriram Sonty) కంటి పరీక్షలు చేశారు.

ఈ మెగా శిబిరానికి హేమ అద్దంకి, శ్రీదేవి దొంతి, మైథిలి పిట్టల, గుర్ప్రీత్ సింగ్, కిరణ్ వంకాయలపాటి, సునీత రాచపల్లి, సంధ్య అద్దంకి, శ్రీలత గరికపాటి, హేమ కానూరు, హను చెరుకూరి, యుగంధర్ యడ్లపాటి, కృష్ణ మోహన్ చిల్మకూర్ తదితరులు తోడ్పాటు అందించారు.

ఎడ్యుకేట్, ఎంపవర్, ఎంకరేజ్ అంటూ గత 10 సంవత్సరాల నుండి మహిళా సంక్షేమం కోసం ప్రత్యేకంగా పనిచేస్తున్న డా. ఉమా ఆరమండ్ల కటికి ప్రప్రథమంగా చికాగోలో పెద్దఎత్తున ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ మహిళా దినోత్సవ వేడుకలు (Women’s Day Celebrations) నిర్వహించి అందరి మన్ననలు పొందారు.

అలాగే ఉన్నత విద్యావంతురాలైన డా. ఉమా ఆరమండ్ల కటికి తన దైనందిన జీవితంలో ఒక పక్క ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ మరో పక్క తానా ఉమెన్ సర్వీసెస్ కోఆర్డినేటర్‌ గా డొమెస్టిక్ వయొలెన్స్ (Domestic Violence) బారిన పడిన మహిళలకు అవసరమైన సహాయం చేస్తూ అందరి అభినందనలు అందుకుంటున్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected