అమరావతి, ఆంధ్రప్రదేశ్: రాష్టంలో సీ.ఎఫ్.ఎం.ఎస్ టోకెన్ పడి పెండింగ్ లో ఉన్న రూ.1277 కోట్ల నీరు చెట్టు బిల్లులు నాలుగేళ్లుగా పెండింగ్ లో ఉంచడం దారుణమని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు (Nara Chandrababu Naidu) అన్నారు. మంగళగిరి లోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు, నీరు- చెట్టు రాష్ట్ర కోఆర్డినేషన్ కమిటీ అధ్యక్షులు ఆళ్ళ వెంకట గోపాల కృష్ణారావు (Alla Venkata Gopala Krishna Rao) శుక్రవారం సాయంత్రం చంద్రబాబు నాయుడు ను కలిసి నీరు చెట్టు పెండింగ్ బిల్లుల పురోగతిపై నివేదిక సమర్పించారు.
ఈ సందర్భంగా ఆళ్ళ వెంకట గోపాల కృష్ణారావు మాట్లాడుతూ.. గత మూడున్నర సంవత్సరాలుగా నీరు చెట్టు ఫిర్యాదుల విభాగం చేస్తున్న కృషిని వివరిస్తూ… పనులు చేసిన రైతులు ఇప్పటివరకు 8,250 మంది బిల్లులు చెల్లించమని రిట్ పిటిషన్లు వేయగా, అయినను చెల్లించకపోవడంతో ఉమ్మడి 13 జిల్లాల నుంచి 5,724 మంది రైతులు ధిక్కార పీటీషన్లు వేయగా రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు ప్రస్తుత వైసిపి ప్రభుత్వం (YSRCP Government) 2022 మార్చి నుంచి 2023 జులై వరకు బడ్జెట్ ద్వారా రూ. 970 కోట్లు కేటాయించి రూ.780 కోట్లు రైతులు ఖాతాలో జమ చేయడం జరిగిందని ఇంక రూ.190 కోట్లు ధిక్కార పిటిషన్లకు సంబంధించి సంబంధించి రైతులకు చెల్లించాల్సి ఉందని వివరించారు.
నీరు చెట్టు పనులు చేసిన సన్న చిన్నకారు రైతులు పనులు చేసి నాలుగున్నర సంవత్సరాల పూర్తి కావడంతో ఆర్థికంగా చితికిపోయి వడ్డీలు కట్టలేక నానా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నీరు చెట్టు పనులు చేసిన రైతులు కోట్ల డబ్బు ఉన్న బడా కాంట్రాక్టర్లు కాదని కేవలం అభివృద్ధి కొరకు పనులు చేసిన గ్రామాభివృద్ధి కాముకులని గుర్తించి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మెమోల పేరుతో కక్షపూరిత ధోరణి విడనాడి ధిక్కార పిటిషన్లకు సంబంధించి నీరు చెట్టు పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని (Government) డిమాండ్ చేశారు.
దీనిపై చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) స్పందిస్తూ నీరు చెట్టు బాధితులకు ఆఖరి రూపాయి అందే వరకు కృషి చేయాలని నీరు చెట్టు ఫిర్యాదుల విభాగానికి సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ (Telugu Desam Party) రాష్ట్ర నీరు చెట్టు కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు కౌలూరి రాజ చంద్రమౌళి, చెన్నుపాటి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.