Connect with us

Editorial

మూడక్షరాల శక్తి నింగికేగి 27 ఏళ్ళు; శకపురుషుడు NTR వర్ధంతి ప్రత్యేకం

Published

on

తెలుగు ప్రజలు ఆరాధ్యదైవంగా పూజించే మూడక్షరాల శక్తి, మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్. అకుంఠిత దీక్షాదక్షతలు, అచంచలమైన ఆత్మవిశ్వాసం, నిర్విరామ కృషి, కఠోరమైన క్రమశిక్షణ ఇవన్నీ ఆయనకు పర్యాయపదాలు. గలగలా ప్రవహించే గోదావరిని పలకరించినా, బిరబిరా పరుగులిడే కృష్ణమ్మని ప్రశ్నించినా ఉత్తుంగ తరంగ తుంగభద్రని కదిలించినా అవి చెప్పేది ఒక్కటే.. యుగపురుషుడు ఎన్ట్ఆర్ అని. ఒకవైపు ఆయన శత జయంతి సంబరాలు, మరోవైపు 27వ వర్థంతి కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఎన్టీఆర్ ఒక తరాన్ని శాసించాడు, ఒక తరాన్ని ప్రభావితం చేశాడు, ఒక తరానికి మార్గదర్శకుడయ్యాడు, తరతరాలకు దైవంగా నిలిచాడు. నిర్వీర్యమై, నిస్తేజమే, చేష్టలుడిగి చేవచచ్చిన తెలుగుజాతికి ప్రాణ ప్రతిష్ట చేశారు.

సామాన్య రైతు కుటుంబంలో జన్మించి సినీ వినీలాకాశంలో ధ్రువతారగా వెలుగొందారు. తన నటనా కౌశలంతో 300కు పైగా చిత్రాల్లో నటించి దేశ వ్యాప్తంగా ప్రజల మనసులను కొల్లగొట్టారు. తెలుగువారు తీర్థయాత్రలకు వెళ్లి తిరుపతిలో ఏడుకొండలవాడిని దర్శించుకుని మద్రాస్ వెళ్లి ఎన్టీఆర్ ను చూసివచ్చేవారు. అప్పుడే తమయాత్ర ఫలప్రదమైందని భావించేవారు. అందమైన రాముడిగా, కృష్ణుడు పాత్రలనే కాదు.. భీష్ముడు, బృహన్నల లాంటి విభిన్న పాత్రలు పోషించారు. ఠీవీ, రాజసం ఉట్టిపడే దుర్యోధనుడు, రావణాసురుడు లాంటి ప్రతినాయక పాత్రలు పోషించి ఆయా పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేసి వాటికి జీవం పోశారు. సినీరంగంలో అరుదైన సుందర సాంస్కృతిక స్వప్నాన్ని సాకారం చేశారు. ఒక అద్భుతమైన కళ, వైభవ, ప్రాభవాలను ఆవిష్కరింపజేశారు. అక్షర సేద్యంతో తెలుగు భాషను సుసంపన్నం చేశారు. మాతృభాషలోని మాధుర్యాన్ని తెలుగు ప్రపంచానికి రుచి చూపించారు. అక్షరాన్ని ఆయుధంగా మలిచి సాహితీ జగత్తును శాసించి సమాజాన్ని కదిలించారు.

మరణం లేని జననం… మరణించి జీవిస్తున్న వ్యక్తి ఎన్టీఆర్. చాలా మంది జీవిస్తూ మరణిస్తుంటారు. 1996, జనవరి 18వ తేదీన మరణించి కోట్లాదిమంది తెలుగుప్రజల హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచారు. తెలుగు జాతి గుండె చప్పుడు ఎన్టీఆర్. తెలుగు జాతి ఉన్నంత వరకూ తరతరాలుగా గుర్తిండి పోయే మహోన్నత వ్యక్తి. అవహేళనలు, అవమానాలు భరిస్తూ తెలుగు వారంతా మదరాసీలుగా పిలిచేరోజులు. ఉత్తరాది వారి ఏలుబడిలో, తమిళుల పంచన తలొంచుకు బతుకుతున్న తెలుగుజాతి… ఉనికిని కోల్పోయే ప్రమాదంలో పడిన సందర్భంలో నందమూరి చేసిన సింహ గర్జన యావత్ దేశాన్నే ఉలిక్కిపడేలా చేసింది. ఎన్టీవోడి గర్జన నుంచి పుట్టిన వేడిగాలి దావానలంలా వ్యాపించి, తెలుగు వారి వాడి, వేడి, పౌరుష ప్రతాపాల ప్రభావాన్ని విశ్వ వ్యాపితం చేసింది. ఎన్టీఆర్ ఆత్మగౌరవ నినాదం తెలుగుజాతి గుండెల్లో జాతీయగీతంలా మారుమోగింది. తెలుగుజాతి చరిత్రను తిరగరాసిన ఆయన చరిత్ర భావితరాలకు భగవద్గీత అయింది.

రాజకీయ రణక్షేత్రంలో అడుగుపెట్టే నాటికి రాజకీయ శూన్యత, అస్థిరత్వం రాజ్యమేలుతోంది. రాజకీయాలు కొంతమందికి వృత్తి, వ్యాపారంగా మారిన నేపథ్యంలో… “బ్రతకడానికి రాజకీయాల్లోకి రావద్దు, బ్రతుకులను మార్చడానికి రాజకీయాల్లోకి రండి, ఇదొక సామాజిక బాధ్యత’’ అని నినదించారు. నాటి ఢిల్లీ పెద్దలు ఏడాదికి నలుగురు ముఖ్యమంత్రులను మారుస్తూ తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నడివీధుల్లో తాకట్టుపెట్టారు. ఆ సమయంలో తెలుగుదేశానికి జీవం పోసి దేశ రాజకీయ స్వరూపాన్నే మార్చేశారు. చైతన్యరథాన్ని వేదికగా రహదారులు పక్కనే కాలకృత్యాలు తీర్చుకుంటూ 9 నెలల పాటు అవిశ్రాంతంగా సుమారు 60 వేల కిలోమీటర్లు పైగా రాష్ట్రం నలుచెరుగులా తిరిగారు. కుల, మత, ప్రాంతీయ విద్వేషాలతో కుళ్లిన రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేసి నూతన రాజకీయ సంస్కృతిని తీసుకురావడమే ఆయన ఆశయం. సైద్ధాంతిక నిబద్ధత, బలమైన వర్తమానం, ఆశావహ దృక్పథం ఆయనలో ఉన్నాయి.

తొలి కాంగ్రేసేతర ముఖ్యమంత్రిగా 1983, జనవరి 9వ తేదీన 40 వసంతాల క్రితం ప్రమాణస్వీకారం చేశారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లని నినదించారు. భారత రాజకీయ చరిత్రలో సరికొత్త సంక్షేమ అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. రెండు రూపాయలకే కిలో బియ్యం, పక్కా ఇళ్లు, జనతా వస్త్రాలు, వితంతువులకు, కూలీలకు పింఛన్లు, రూ.50కే రైతులకు విద్యుత్ వంటి వినూత్న పథకాలకు ఆయనే ఆదిగురువు. రాయలసీమ, చెన్నై వాసుల దాహార్తిని తీర్చేందుకు తెలుగు గంగ ప్రాజెక్టును చేపట్టారు. మహిళా విశ్వ విద్యాలయం, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, పటేల్, పట్వారీల వ్యవస్థ రద్దు, అధికార వికేంద్రీకరణ జరగాలని మాండలిక వ్యవస్థను ప్రవేశపెట్టారు. స్థానికసంస్థల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత ఆయనకే దక్కుతుంది. ప్రజాధనం దుర్వినియోగం, అవినీతి, లండగొండితనం లాంటి వాటికి తావులేకుండా పాలన చేశారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వారధిగా ఉండవలసిన గవర్నర్లను కేంద్రం చేతిలో కీలుబొమ్మలుగా మార్చారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన కాంగ్రెసేతర ప్రభుత్వాలను కూలగొట్టే కుటిల రాజకీయ నీతికి అలవాటుపడ్డారు. 1984 ఆగష్టు 16న అప్రజాస్వామికంగా ఎన్టీఆర్ ను అధికారం నుంచి తొలగించారు. ఆ సమయంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం జరిగిన ఉద్యమం దేశ పోరాటాల చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. కేంద్రం మెడలు వంచి కేవలం నెల రోజుల్లోనే తిరిగి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఢిల్లీ సింహాసనాన్ని గడగడలాడించారు. ఇప్పుడు మెడలు వంచుతామని బీరాలు పలికిన వారు… ఎన్టీఆర్ ఆత్మ క్షోభించే విధంగా తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని హస్తినాపురంలో అణాపైసలకు అమ్మకానికి పెట్టారు. కేంద్రం మిథ్య అంటూ.. కేంద్ర, రాష్ట్ర సంబంధాలు, గవర్నర్ల వ్యవస్థపైన రాష్ట్ర ప్రభుత్వాల హక్కులు, నిధులు, విధులుపై ఎన్టీఆర్ రాజీలేని పోరాటం చేశారు. రాజ్యాధికారం కొన్ని వర్గాల గుత్తాధిపత్యంలో ఉండేది. ఆ నేపథ్యంలో బడుగులకు ఎన్టీఆర్ ఆశాకిరణంలా కనిపించారు. గగనతలంలో విహరిస్తున్న రాజకీయాలను భూమార్గం పట్టించి, భూకంపం సృష్టించిన సామాజిక ఉద్యమ నిర్మాత. సరికొత్త తరాన్ని, వినూత్న సేవా సంస్కృతిని రాజకీయాల్లో ప్రవేశపెట్టిన ”భారత ప్రజాస్వామ్య దిక్సూచి” ఎన్టీఆర్‌.

1984లో ఇందిరాగాంధీ హత్య నుంచి పుట్టిన సానుభూతి పవనాలు దేశమంతా బలంగా వీచాయి. ఆ సానుభూతి పవనాలు ఎన్టీఆర్ చరిష్మా ముందు నిలవలేదు. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం విజయ దుందుభి మోగించేలా చేశారు. పార్లమెంట్ లో ఒక ప్రాంతీయ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. జాతీయ పార్టీ బీజేపీ రెండు స్థానాలకే పరిమితమైంది. ఎన్టీఆర్ జాతీయస్థాయిలో ప్రతిపక్షాలను ఏకం చేసేందుకు అనేక సమ్మేళనాలు నిర్వహించారు. వీపీ సింగ్ నాయకత్వంలో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటు కోసం భిన్నధృవాలుగా ఉండే వామపక్షాలు, బీజేపీ మద్దతును కూడగట్టారు. బోఫోర్స్ ముడుపుల కేసులో కాంగ్రెస్ పై ఒత్తిడి పెంచేందుకు నేషనల్ ఫ్రంట్ ఎంపీలు 105 మంది ఒకేసారి రాజీనామా చేసేందుకు ఎన్టీఆర్ కృషిచేశారు. దేశవ్యాప్తంగా రైతులకు పదివేలలోపు రుణాలు రద్దుచేసేందుకు, లోక్ పాల్ బిల్లు, ప్రసారభారతి బిల్లు ఆమోదించడంలోనూ కీలకపాత్ర వహించారు. అంబేద్కర్ కు భారతరత్న ప్రకటించడం, ఆయన చిత్రపటాన్ని పార్లమెంటరీ హాలులో ఆవిష్కరింప చేయడమే కాక, మహ్మద్ ప్రవక్త జయంతిని జాతీయస్థాయిలో సెలవు దినంగా ప్రకటింపచేశారు.

మేమంతా జాతీయ పార్టీ ప్రాంతీయ నాయకులం, ఎన్టీఆర్ ప్రాంతీయ పార్టీ జాతీయ నాయకులు అని మాజీ ప్రధానులు ఆయన్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు. రాజకీయాల్లో మొదటి నుండి విలువలు, విశ్వసనీయత, జాతీయ దృక్పథంతో ఉన్నత ప్రమాణాలు పాటించారు. ఏ నిర్ణయం తీసుకున్నా జనహితమే.. అది సంచలనమే. ప్రజాహితం కోసం ఏనాడూ రాజీపడలేదు. ప్రజా నాయకుడిగా చరిత్రలోనే కాదు ప్రజల హృదయాల్లో ఎన్టీఆర్‌ స్థానం సుస్థిరం. ఎన్టీఆర్ ఖ్యాతిని ఆంగ్ల ప్రసార మాధ్యమాలు కొనియాడాయి. బ్రిటన్ వారపత్రిక ‘ది ఎకనమిస్ట్’ ప్రత్యేక సంకలనం ద బుక్ ఆఫ్ అబీచ్యువరీస్ లో అన్నగారి జీవిత విశేషాల సమాహారం ముద్రితమైంది. ప్రపంచ వ్యాప్తంగా 400 మంది జీవిత విశేషాలను దానిలో ముద్రించగా, దక్షిణ భారతానికి చెందిన ముగ్గురిలో ఒకరిగా ఎన్టీఆర్ నిలిచారు. సామాన్యుడు అసామాన్యుడిగా ఎదిగి చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్ చరిత్ర చెరిపేద్దామన్నా చెరిగిపోదు. పేరు తొలగించినా జనం మదిలో, మనస్సులో నుంచి ఆయన రూపును తుడిపివేయలేరు. అందుకే ఆయనకు ఘనంగా నివాళులు అర్పిద్దాం. ఆయన కీర్తి అజరామరం. ఆ మహానుభావుడికి భారతరత్న ఇవ్వాలని యావత్ తెలుగు జాతి దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నది. తెలుగువారి ఆకాంక్షలను కేంద్ర ప్రభుత్వం గౌరవిస్తుందని ఆశిద్దాం.

– మన్నవ సుబ్బారావు, గుంటూరు మిర్చి యార్డ్ మాజీ ఛైర్మన్

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected