కోవిడ్ వైరస్ లో ఇప్పటి వరకు డెల్టా, ఆల్ఫా, గామా వేరియంట్స్ గురించి విన్నాం. ఇప్పుడు కొత్తగా ము అంటూ ఇంకో వేరియంట్ ని గమనిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ.హెచ్.ఓ) వెల్లడించింది. కొలంబియాలో మొట్టమొదటిగా గుర్తించిన ఈ ము వేరియంట్ ఇప్పుడు 39 దేశాలలో గుర్తించబడినట్లు తెలుస్తుంది. మొత్తంగా ఈ కొవిడ్ కేసులు 0.1% కంటే తక్కువే ఉన్నప్పటికీ కొలంబియా, ఈక్వడార్ దేశాల్లో రోజు రోజుకీ కేసులు పెరుగుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఆగష్టు 30 2021 న డబ్ల్యూ.హెచ్.ఓ తన వేరియంట్స్ జాబితాలో ఈ ము వేరియంట్ ని కూడా చేర్చినట్లు తెలిపింది. ము వేరియంట్ తోపాటు పెరూ దేశంలో మొట్టమొదటగా గుర్తించిన లాంబ్డా వేరియంట్ ని కూడా జాగ్రత్తగా గమనిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.